కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు
హస్తినాపురం కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. జయంతిని ఉద్దేశించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధికి విద్య ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి ఉచిత, నిర్బంధ సమాన విద్య ప్రభుత్వమే ప్రధాన బాధ్యతగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారాని ఆయన సేవలను కొనియాడారు.
కానీ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు విరుద్ధంగా తెలంగాణలో విద్య ప్రైవేట్ పరమై, కార్పొరేట్ కబంధహస్తాల్లో విలవిల లాడుతుందని ప్రభుత్వాలకు విద్యపై చిత్తశుద్ధి లేక పాఠశాల విద్య నుండి, ప్రైవేటు యూనివర్సిటీల వరకు పెద్ద ఎత్తున విద్యా వ్యాపారం జరుగుతుందని పేదలకు విద్య ఆర్థిక భారమై విద్యకు దూరమవుతున్నారని దీన్ని అడ్డుకోవడానికి తెలంగాణలో ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన అవసరం ఉందని కార్పొరేట్ విద్యను తెలంగాణ పోలిమేర దాటించాలని ప్రైవేట్ విద్యను రద్దుచేసి ప్రభుత్వమే విద్యను నిర్వహించాలని విద్య వికాసం లేని చోట సమాజం వికాసం జరగదని చెన్నోజు శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చీఫ్ అడ్వైజర్ గంగుల నరసింహారెడ్డి, బచ్చు రామకృష్ణ, యోగేష్ యాదవ్, పొదిళ్ల శ్రీనివాస్, బొల్లంపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.