నేడు సర్వసాధారణంగా మనం చూస్తున్న ప్రస్తుత సమాజంలో మనకు తారసపడుతున్న సున్నితమైన అంశాలివి. కొందరు పరువుకు హత్యలు. మరికొందరు అనుకున్నది దక్కలేదని, మరికొందరు వారికున్న మానసిక ఆందోళనను, అవహేళనలు, వేధిస్తున్న సమస్యల రీత్యా కృంగిపోయి ఎవరికీ చెప్పుకోలేని మానసిక క్షోభను అనుభవిస్తూ చివరికి ఈ అంశాన్ని అనగా హత్య – ఆత్మహత్య అనేవి పరిష్కార మార్గాలని భావించి వాటికే జీవితాన్ని సుగమం గావిస్తారు.
“బ్రతకాలనుండి ఆకలితో చనిపోయే జీవితాలు కొందరివి. అన్నీ ఉండి ఆరోగ్యం సరిపడక తినే యోగ్యత లేనివారు మరికొందరు” ఎవ్వరైనా సరే ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. మన ప్రాణాన్ని మనం తీసుకొనే హక్కు మనకు లేదు. అలాగే మరొకరి ప్రాణాన్ని తీసే అధికారం కూడా మనకు లేదు అని ఖచ్చితంగా చెప్పగలను.”
తల్లి తొమ్మిది నెలలు తన కడుపున మోసి, పునర్జన్మ నెత్తి మరీ నిన్ను ఈ భువిపైకి తీసుకొస్తుంది. నువ్వు కడుపులో ఉండి తనను ఎంత నరకానికి గురిచేసినా నవ్వుతూ భరిస్తుంది. నువ్వు అబ్బాయ్ అయితే సరే అమ్మాయి అనుకో తన ఇంట్లో తనవాళ్లు అనుకున్నవాళ్ళే తననొక పురుగులా చూసినా పేగులు మెలిపెడుతున్నా నీ కోసం భరిస్తుంది. నువ్వు తన బలం అవుతావని కాదు. తాను నిన్ను భాద్యత అనుకుంటుంది కాబట్టి.
నువ్వు ఎదిగాకా తనకు కొరివి పెట్టి తనను ఈ లోకపు నరకపు కూపం నుండి రక్షించే నాధుడవుతావనుకుంటుంది. అంత గొప్పగా నిన్ను ఊహించుకుంటే నువ్వేమో ఎక్సమ్ లో ఫెయిల్ అయ్యావనో, లేక ఎవరినో ప్రేమించాననో, ఆత్మన్యూనత భావంతోనే ఇలా బ్రతకడానికి ఏదో ఒక పిచ్చి కారణం చూపించి చాలా తేలికగా చితిపై చేరి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు. ఇది సరియైనదా..! నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన విధమిదేనా..!!
ఎవడో ఏదో అన్నాడని కక్ష పెంచుకొని, ఓ మాట అంటే నిన్ను నువ్వు నియంత్రించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయి అవతలి వాడిని (ఆమెను) పొడిచేద్దాం, నరికేద్దాం అని నీకనిపించింది చేసేసి నీ జీవితానికి అర్ధం లేకుండా ఆవేశానికి లోనై నిన్ను నువ్వు కాలగర్భంలో కలిపేసుకుంటున్నావ్ ఎందుకనీ? కులం కోసం చంపేస్తున్నావ్. మతంకోసం చంపేస్తున్నావ్. ఈర్ష్యా రాగద్యేషాలతో నిండి నీ జన్మ రహస్యాన్ని ఎరుగక నిన్నే నువ్వు అంతం చేసుకుంటున్నావ్.
హత్యలు – ఆత్మ హత్యల వలన సాధించేదేమీ ఉండదు. క్షణకాలపు నీ సంతోషం కోసం ఒకరిని బాధించడమో, నిన్ను నువ్వు బాధించుకోవడమో చెయ్యడం వలన అప్పటివరకు నీకు మానసిక ఆనందం దొరుకుతుంది అంటే. నీలా నువ్వు కస్టపడి పనిచేసుకుంటూ నీవల్ల ఒకరు బాధపడకుండా ఉండి, నీ తోటి వారి వల్ల నీకు బ్రతకడం కష్టమనిపించినా తట్టుకొని నిలబడి భరిస్తూ బ్రతికి చూడు ఎంత మానసిక ఉల్లాసం అనిపిస్తుందో…!
“చచ్చిపోతేనో, చంపేస్తోనో సమస్యలు తీరవు. నీవు పుట్టడమే సమస్య అని నీ తల్లి అనుకోని ఉంటే నీ ఎదుగుదలే ఆగిపోయేదిగా అది గ్రహించావా ఎప్పుడైనా..! జీవితంలో ఏం సాధించినా, సాధించకపోయినా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ వల్ల ఒకరు గాయపడకూడదు. నీ మాట వల్ల ఒకరి మనసు నొచ్చుకోకూడదు. నీ జీవనం మరొకరికి ఆదర్శం కావాలి. నీ నడవడిక ఇంకొకరికి మార్గదర్శకం కావాలి. నువ్వు బ్రతికున్నపుడు నీ చుట్టూ ఎందరు నటిస్తూ తిరిగారన్నది నువ్వు చూస్తావ్. కానీ, నువ్వు చచ్చిపోయాకా ఎందరు నీ కోసం కన్నీళ్లు విడిచారన్నది నీ నడవడికను చూపిస్తుంది.”
నీ గుణగణాలు తెలియజేస్తాయి. నలుగురిలో నటించడం కాదు. బుద్దిగా బ్రతకడం నేర్చుకో జీవితం బరువు అనిపించదు. నీ జన్మ అర్ధాన్ని, ఆజన్మ పరమార్థాన్ని తెలియజేస్తుంది.
- వాసి జ్యోత్స్న, 9866843005