“వినోదం” సినిమాలో దొంగ పోలీస్ స్టేషన్‌ను చూసి మనం తెగ నవ్వుకున్నాం. ఈ కామెడీ కాన్సెప్ట్ భలే ఉందే అనుకోవటమే కాకుండా అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయా అని కూడా ముక్కున వేలేసుకున్నాం. ఆ రీల్ స్టోరీ కాస్తా ఇప్పుడు రియల్ స్టోరీగా మారిపోయింది. బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ ఏడాదిగా సాగించిన రకరకాల దందాలు తాజాగా వెలుగుచూశాయి.
నేరాలకు రాజధానిగా మారిందంటూ రాహుల్ గాంధీ తాజాగా విమర్శించిన బీహార్‌లో ఓ ప్రబుద్ధుడు ఫేక్ పోలీస్ స్టేషన్‌ను క్రియేట్ చేసి అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడ్డాడు. పూర్ణియా జిల్లాల్లోని మోహని అనే గ్రామంలో రాహుల్ కుమార్‌షా అనే వ్యక్తి నకిలీ పోలీస్ స్టేషన్ పెట్టడమే కాకుండా అందులో ఉద్యోగాల పేరిట డబ్బులు కూడా వసూలు చేశాడు.
గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్‌మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్ జాబులు ఇస్తానంటూ యువత నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడు. అంతటితో ఆగకుండా వాళ్లకు నకిలీ పోలీస్ యూనిఫామ్స్, లాఠీలు, ఫేక్ ఐడీకార్డులు సైతం ఇచ్చిపడేశాడు. అక్కడితోనూ ఆగలేదు. ఆ ఉత్తుత్తి పోలీసులతో పెట్రోలింగ్ కూడా నిర్వహించాడు.
మద్యం అక్రమ రవాణాపై దాడులు సైతం చేయించేవాడు. వారి నుంచి డబ్బు లాక్కొని అందులో సగం తాను తీసుకొని మిగతా సగాన్ని తన కింది వారికి పంచేవాడు. అక్రమ రవాణాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మళ్లీ వాళ్లకే ఇచ్చేసేవాడు. ఏకంగా సంవత్సరం పాటు సాగిన ఈ ఫేక్ పోలీసుల ఆగడాలు ఎట్టకేలకు ప్రభుత్వానికి తెలియటంతో రాహుల్ పరారయ్యాడు. ఇప్పుడు అతని కోసం అసలు పోలీసులు గాలిస్తున్నారు.