తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ భద్రత, సౌకర్యాల మెరుగుదలకు కొత్త అడుగు వేసింది. రాష్ట్రంలో ప్రత్యేక టూరిస్ట్ పోలీస్ విభాగంను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త శాఖ సేవలు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. టూరిజం శాఖ–పోలీస్ శాఖల సమన్వయంతో జరిగిన సమావేశంలో పర్యాటక ప్రాంతాల భద్రత, అభివృద్ధిపై చర్చ జరిగింది. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, తొలి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయించనున్నట్లు తెలిపారు.
మొదటి విడతలో నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అనంతగిరి, రామప్ప, యాదాద్రిగుట్ట, సోమశిల, అమ్రాబాద్, పోచంపల్లి వంటి రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక కేంద్రములలో టూరిస్ట్ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. పర్యాటకులకు మార్గనిర్దేశం, భద్రత కల్పించడం, అత్యవసర సాయం అందించడం వీరి ప్రధాన బాధ్యతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.