- అమెరికా తీర ప్రాంత ప్రజలకు హెచ్చరికలు
- స్థానిక అధికారుల సూచనలు పాటించాలని ఆదేశం
- ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న ట్రంప్
రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించడంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్టాల్ల్రో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండని కాన్సులేట్ జనరల్ ’ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయ్యింది. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండని అధ్యక్షుడు సూచించారు.
రష్యా తీర ప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్ – కామ్చాట్‌స్కీ లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.8గా నమోదైంది. దీంతో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్ దీవులను సునామీ తాకింది. రాకసి అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భూకంపం కారణంగా అనేక భవనాలు కొన్ని నిమిషాల పాటు కదిలాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు, సునామీ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాలను వరద ముంచెత్తినట్లు- తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.