- మంకాల్ విలేజ్ వరిటెక్స్ డిస్ట్రిక్ట్ వెంచర్‌లో అక్రమంగా చేసిన ప్లాట్లు..
- ప్రభుత్వ అసైన్డ్, సీలింగ్ భూములనమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనం
- ఎకరానికి 5 లక్షలు 10 లక్షలు పేద రైతులకు ఇచ్చి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్న దుర్మార్గం..
- పిఓటి చట్టానికి దర్జాగా తూట్లు పొడిచిన వరిటెక్స్ సంస్థ..
- వర్మ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడిన కొందరు అవినీతి అధికారులు..
- అక్రమంగా అనుమతులు ఇచ్చిన రేరా,హెచ్ఎండిఏ అధికారులు..
- ఎలాంటి అనుమతి లేకుండా ఎన్నారై భూమిలో నుండి 150 ఫీట్ల రోడ్డు
- చెరువులను సైతం వదలకుండా కబ్జా చేసిన వరిటెక్స్..
- ఇరిగేషన్ అధికారులు కేసు నమోదు చేసిన ఆగని కబ్జా పర్వం..
- చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్
భయం, చట్టాలపై గౌరవం, చేసే వ్యాపారంలో నిజాయితీ, ప్రభుత్వాలపై నమ్మకం, ఇలాంటివి ఏవీ ఈయన చరిత్రలో లేనే లేవు.. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కబ్జాలు చేయడం, ప్రయివేటు భూములను దౌర్జన్యంగా లాక్కోవడం, చెరువులను చెరబట్టడం ఈయనగారి చరిత్ర.. అధికారులను లంచాలతో కొనేయడం…వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య.. పుంఖాను పుంఖాలుగా ఈయనగారి నీచపు చరిత్రను సాక్షాధారాలతో సహా వెలుగులోకి తీసుకుని వస్తున్నా.. ఎలాంటి చర్యలూ గైకొన్న దాఖలాలు కనిపించడం లేదు.. మరి ఈయన చెబుతున్న కహానీలు, ఈయన చూపిస్తున్న ఆధారాలు కోర్టులకు, ప్రభుత్వాలకు ఎలా అనుకూలంగా ఉంటున్నాయో అందేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. దీనికి సమాధానం ఒక్కటే వినిపిస్తోంది.. డబ్బు.. పలుకుబడి.. దౌర్జన్యకాండ.. ఇవే ఈయనకు ప్లస్ పాయింట్స్ గా ఉంటున్నాయి.. ఈయనే వరిటెక్స్ వర్మ.. ఈయన చేస్తున్న మరో కబ్జా ఘనకార్యం మీముందుకు తీసుకుని వస్తున్నాం..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, మంకాల్ గ్రామ శివారులో ఎయిర్ పోర్టు గోడను ఆనుకొని 100 ల ఎకరాలలో వరిటెక్స్ డిస్ట్రిక్ట్, వరిటెక్స్ ఫ్లోరెంజ పేరుతో భారీ అక్రమ వెంచర్ చేశారు వివిఆర్ వర్మ.. గత ప్రభుత్వంలో కొత్తచెరువును కబ్జా చేసి ప్రభుత్వానికే సవాలు విసిరాడు ఈ అక్రమార్కుడు.. ఇరిగేషన్ అధికారులు కేసు నమోదు చేసినా ఎలాంటి జంకు బొంకు లేకుండా ఐ డోంట్ కేర్ అంటూ.. దర్జాగా కబ్జా చేయడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య లాగా మారిందని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. మంకాల్ గ్రామ శివారులో ఉన్న పేదలకు చెందిన సీలింగ్, అసైన్డ్ భూములను వారిని బెదిరించి తెల్ల కాగితాలపై వేలిముద్రలు తీసుకొని.. ఎకరానికి 5 లక్షల చొప్పున చెల్లించి దౌర్జన్యంగా లాక్కున్నాడనీ ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పిఓటి చట్టానికి తూట్లు పొడిచి.. భూ బదలాయింపు లేని భూములను కారు చౌకగా కొట్టేసి.. అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యాడు ఈ వర్మ..

కాగా ఘరానా మోసగాడిగా చలామణి అవుతున్న వర్మ..ప్రభుత్వ అసైన్డ్ భూములను సొమ్ము చేసుకుంటున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి.. నకిలీ పత్రాలు సృష్టించి హెచ్ఎండిఏ, రేరా అధికారులను తన గుప్పెట్లో పెట్టుకొని చక్రం తిప్పాడు వర్మ.. ప్రభుత్వ అసైన్డ్ భూములతో పాటు బహిరంగంగా చెరువును కబ్జా చేసిన వర్మకు అధికారుల అండ దండలు మొండుగా ఉన్నాయి..హెచ్ఎండిఏ, రేరా అనుమతులు ఇవ్వడంతో అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని, అడ్డదారిలో అనుమతులు ఇచ్చారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి..ఇరిగేషన్ అధికారులు కేసు నమోదు చేసినా ఏ మాత్రం జంకకుండా దర్జాగా కబ్జా చేయడంతో ఇతని అవినీతి ఏ స్థాయిలో ఉందో అట్టే అర్థమవుతుంది.. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండానే ఎన్నారై కి సంబంధించినటువంటి పట్టా భూమిలోనుండి 150 ఫీట్ల రోడ్డును సైతం దౌర్జన్యంగా వేయడంపై దుమ్మెత్తి పోస్తున్నారు స్థానిక ప్రజలు..

ఎయిర్ పోర్టు గోడను ఆనుకొని ఎయిర్ పోర్టు అథారిటీ ఎన్ఓసి లేకుండానే, నిషేధిత భూముల్లో వెంచర్ వేయడంతో మహేశ్వరం మండల తహసిల్దార్ సైన్ బోర్డులను ఏర్పాటు చేసి పిఓటి యాక్ట్ 1977 నిబంధనల ప్రకారం సదరు భూమిని స్వాధీన పరుచుకుంటానని నోటీసులు జారీ చేయడం జరిగింది.. వర్మ చేసిన వెంచర్ ముమ్మాటికి కబ్జా అని తేటతెల్లమవుతుంది.. స్థానికులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుంది.. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తారా..? అధికార ప్రభుత్వం అటువైపు దృష్టి సారిస్తుందా..? ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడే గురుతర బాధ్యత భుజస్కందాలపై వేసుకుని ఆదిశగా పయనిస్తున్న హైడ్రా ఈ ఘరానా వ్యవహారం మీద స్పందిస్తుందా..? చెరువును కాపాడి, ప్రభుత్వ భూములను రక్షించి, సామాన్య రైతులకు, నిరుపేదలకు అండగా నిలబడుతుందా..? లేదా అన్నది వేచి చూడాలి.. మరిన్ని ఆధారాలతో మీముందుకు రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..


