Saturday, August 2, 2025
spot_img

పుచ్చపండు.. పోషకాలు మెండు

Must Read

పుచ్చకాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నారు? దానికి కూడా దినోత్సవం అవసరమా? ప్రతీ దానికి ఓ రోజు కేటాయించడం కామనైపోయింది. అని మనకు అనిపించడం సహజం. ఐతే.. మిగతా పండ్లకూ పుచ్చకాయకూ చాలా తేడాలున్నాయి. ముఖ్యంగా ఈ పండ్లు ఎడారి ప్రాంతాల్లో వారికి నీటి కొరతను తీర్చుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటం వల్లే దీనికి ప్రత్యేక దినోత్సవాన్ని కేటాయించారు. ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవం జరుపుతున్నారు.

భగభగ మండే ఎండల్లో గొంతు తడారిపోకుండా చేసే ఆహారపదార్థాల్లో పుచ్చకాయ ప్రధానమైంది. పెద్దల నుండి పిల్లల వరకు అందరూ ఇష్టపడే ఫలం పుచ్చకాయ. అన్ని సీజన్లలోనూ ఇవి దొరుకుతున్నా వేసవి కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత,రుచీ ఎక్కువ. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని మన శరీరం ఏ-విటమిన్గా మారుస్తుంది. వీటితో పాటు విటమిన్-బి6, విటమిన్-సీ, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. మిగిలిన పండ్లకన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ. సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్లు ఇందులో లభిస్తాయి. 100 గ్రా. పుచ్చకాయ గుజ్జులో నీరు – 95.2 గ్రా,ప్రోటీన్ – 0.3 గ్రా,కొవ్వు పదార్థాలు – 0.2 గ్రా, పీచు పదార్థాలు – 0.4 గ్రా, కెరోటిన్ – 169 మైక్రో గ్రా, సి విటమిన్ – 26 మి.గ్రా, కాల్షియం – 32 మి.గ్రా, ఫాస్ఫరస్ – 14 మి.గ్రా, ఇనుము – 1.4 మి.గ్రా, సోడియం – 104.6 మి.గ్రా, పొటాషియం – 341 మి.గ్రా, శక్తి – 17 కిలోకాలరీలు శరీరానికి అందుతాయి.

కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్లకు నెలవు పుచ్చపండు. తన క్షారగుణంతో శరీరంలో ఎక్కువగా ఉన్న ఆమ్లాల్నీ వ్యర్థపదార్థాల్నీ తగ్గిస్తుంది. శరీరంలో కాల్షియం నిల్వ సామర్థ్యాన్ని పెంచి కీళ్లనొప్పుల్నీ వాతరోగాన్నీ నియంత్రిస్తుంది. మూత్రంలో యూరిక్ ఆమ్లాన్నీ తగ్గిస్తుంది. ఎన్నోరకాల ఖనిజలవణాలున్న పుచ్చ పండును బాలింతలకు తినిపిస్తే బాగా పాలు పడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఈ ఫలం సాయం చేస్తుంది.

రక్త పోటు ఉన్నవారు పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియంలే ఇందుకు కారణం. పుచ్చకాయలో 92 శాతం ఆల్కలైన్‌ వాటర్‌ ఉంటుంది. ఈ నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మూత్రపిండాలు, మూత్రనాళాల్లో ఇబ్బందులు ఉన్నవారికి పుచ్చకాయ వరం లాంటిది. లోపలంతా గింజలతో నిండి ఉండే ఈ పండును తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి . టొమాటో లో మాదిరిగా దీనిలో లైకోఫిన్‌ అనే యాంటి ఆక్షిడెంట్ ఉంటుంది . ఒక గ్రాము టమాటోలో 40 మైక్రో గాములుంటే పుచ్చ పండులో 72 మైక్రోగ్రాములు ఉన్నది .

ప్రపంచ వ్యాప్తంగా 1200 పుచ్చరకాల్ని పండిస్తున్నారు. వాటిల్లో కొన్ని నూర్జహాన్, షర్బత్-ఎ-అనార్, అనార్కలీ షుగర్‌బేబీ (మహారాష్ట్రలోని అమెరికా రకం) అసాహీ యమటో (పశ్చిమ బెంగాల్లోని జపాన్ రకం) నందారి (ఆంధ్రప్రదేశ్ లో పండించే రకం) రెడ్ టైగర్, ఆల్ స్వీట్ వాల్ పెయింట్ మొదలైనవి.

పుచ్చపండు కుకుర్బిటేసీ కుటుంబానికి చెందుతుంది. దీని శాస్త్రీయనామం సిట్రుల్లస్ లానాటస్. పుచ్చపండును తినడం అంటే ఆరోగ్యాన్ని పెంచుకోవడమే. ఇందులో సీ విటమిన్ సహా చాలా పోషకాలు ఉన్నాయి. బాడీకి అత్యంత ముఖ్యమైన విటమిన్ A, B1, B5, B6 ఇందులో లభిస్తాయి. అంతేకాదు మెగ్నీషియం, పొటాషియం కూడా బాడీకి అందిస్తాయి. మన బాడీలో 60 శాతం నీరే ఉంటుంది. నీరు తగ్గితే ప్రమాదం. కాబట్టి నీటిని సమంగా ఉంచేందుకు పుచ్చకాయలు ప్రయత్నిస్తాయి. వీటిలో 95 శాతం నీరే ఉంటుంది. ఫైబర్ ఉన్నందువల్ల.. జీర్ణ వ్యవస్థను సరిదిద్దడంలో ఇవి బాగా పనిచేస్తాయి. పుచ్చపండును తిన్నాక ఆకలి వెయ్యదు. అందువల్ల బరువు తగ్గాలి అనుకునేవారికి ఇవి సరైన పండ్లు. ఈ రోజున ప్రతి ఒక్కరూ పుచ్చకాయలను తినాలి. ఐతే… ఆగస్టులో ఇవి దొరికే అవకాశం తక్కువ. ఎండాకాలంలోనే ఇవి లభిస్తుంటాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రూట్ స్టాల్స్ లో ఏడాది మొత్తం పుచ్చకాయల్ని అమ్ముతున్నారు.

పుచ్చకాయలకు ఘనమైన చరిత్ర ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలకు ఫేవరిట్ ఫ్రూట్ ఏందంటే పుచ్చకాయే. కొన్ని దేశాల్లో పిల్లలు… పుచ్చకాయ గింజల్ని నోటితో దూరంగా విసిరే ఆటలు ఆడుతారు. ఈ ఆటల్ని పొలాల్లో ఆడిస్తారు. తద్వారా పొలాల్లో పడే గింజల నుంచి మళ్లీ పుచ్చకాయ మొక్కలు వస్తాయి. ఐతే… గింజలు లేని ద్రాక్ష లాగానే… గింజలు లేని పుచ్చకాయల్ని ఇప్పటికే సైంటిస్టులు సృష్టించారు. త్వరలోనే ఇవి ప్రపంచమంతా రానున్నాయి. పుచ్చకాయలకు ప్రత్యేక చరిత్ర అంటూ ఏదీ లేకపోయినా… శతాబ్దాలుగా ఈ పండు మానవులు, జీవజాతుల దాహం తీర్చుతోంది. ఇక జపాన్ లో అయితే ప్రపంచంలోనే ఖరీదైన పుచ్చకాయల్ని తయారుచేస్తారు. ఒక్కోటీ రూ.5వేల దాకా ధర ఉంటుంది. స్క్వేర్ రూపంలో ఉండే ఆ పుచ్చకాయల ను తినడానికి కాకుండా… డెకరేషన్ కోసం వాడుతుంటారు. అలాగే ఈమధ్య వాళ్లు పసుపు రంగు పుచ్చకాయల్ని కూడా తయారుచేశారు.

పుచ్చ పండును ఫ్రిజ్ లో పెట్టకపోవడమే మంచిది.సహజంగా మనం పండ్లను కొన్నప్పుడు… అవి నిల్వ ఉండాలని ఫ్రిజ్ లో పెడుతుంటాం. అరటిపండ్లతో సహా కొన్ని పండ్లను మాత్రం అలా పెట్టకూడదు. వాటిలో పుచ్చపండ్లు కూడా ఉన్నాయి. వాటిని ఫ్రిజ్‌లో పెడితే… పోషకాలన్నీ పోతాయని అమెరికాలోని వ్యవసాయ విభాగం తెలిపింది. కొంతమంది పండును కట్ చేసి ఆ ముక్కలను ఫ్రిజ్ లో పెట్టి… కూలింగ్ అయ్యాక తింటారు. అలా తింటే.. ఆ చల్లదనం వల్ల నోటికి పుచ్చకాయ తీపి తెలియదు. ఫలితంగా చప్పగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల పుచ్చకాయను కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే తినాలి తప్ప.. ఎక్కువ కూలింగ్ తో తినవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కట్ చేసిన ముక్కల్ని 2 గంటలకు మించి బయట ఉంచొద్దని చెబుతున్నారు. ఎక్కువ సేపు ఉంచితే.. అవి పాడైపోతాయట.

ఆగస్టు 3 జాతీయ పుచ్చపండు దినోత్సవం

  • సుధాకర్.ఏ.వి, 9000674747
Latest News

దళితులు, ఆదివాసీల సంక్షేమం కోసం కృషి

సామాజిక న్యాయం కాంగ్రెస్‌కే సాధ్యం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన పార్టీ కాంగ్రెస్‌ పదవులను త్యాగం చేసిన ఘనత సోనియాది రాహుల్‌ను ప్రధానిని చేస్తామని తెలంగాణ పక్షాన హామీ 75 ఏళ్ల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS