రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని షేక్ పేట వార్డు పరిధిలోని వినాయక్ నగర్, షేక్ పేటలలో 1 కోటి 5 లక్షల 30 వేల రూపాయలతో, యూసఫ్ గూడ సర్కిల్ లో 1 కోటి 11 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు సీసీ రోడ్డులు, విడిసీసీ (వాక్యూమ్ డీవాటరేటెడ్ సిమెంట్ కాంక్రీట్) రోడ్డు, వినాయక నగర్ పార్క్ పునరుద్ధరణ పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి , మేయర్ గద్వాల విజయలక్ష్మి లు శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు పెంపు పై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర కార్మిక, ఉపాది, భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ… స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతగా అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. డ్రైనేజీ, రోడ్లు, వీధిదీపాలు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు

మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు పెంపొందించేందుకు అనేక అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందన్నారు.
జీహెచ్ఎంసి కార్పొరేటర్ లు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఉంటే సంబంధిత ప్రతిపాదనలతో ఇంచార్జీ మంత్రి దృష్టికి గానీ, తన దృష్టికి గానీ తీసుకువస్తే పనులను మంజూరు చేస్తామని మేయర్ తెలిపారు.
దేశంలోనే గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అత్యుత్తమ నగరంగా, నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ప్రజా ప్రతినిధులు తమవంతు సహకారం అందించాలనీ మేయర్ కోరారు.
కార్యక్రమంలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్, జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన, స్థానిక కార్పొరేటర్ లు, డిప్యూటీ కమిషనర్ లు, కాలనీ పెద్దలు, మహిళా సంఘాలు సభ్యులు, యువత తదితరులు పాల్గొన్నారు.