Thursday, August 14, 2025
spot_img

కబ్జాల వర్మకు చ‌ట్టాలు వ‌ర్తించ‌వా..?

Must Read
  • మంకాల్ విలేజ్ లో చేసిన అక్రమాలపై చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసిన హైడ్రా..!
  • హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని దౌర్భాగ్యం..
  • కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన హైడ్రా కమిషనర్ కు కంటెమ్ట్ నోటీసు జారీ..
  • బడా నిర్మాణ సంస్థలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే అవి హైడ్రా పరిధిలోకి రావా..?
  • వెంచర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డు ఏర్పాటు చేసిన స్థానిక తహశీల్దార్..
  • పెదోల్ల పై చర్యలు చేపడుతూ.. పెద్దోళ్ళను వదిలేయడం పై మండి పడుతున్న ప్రజలు..
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరిటెక్స్ కబ్జా వ్యవహారంపై సమాధానం చెప్పాలి..

ఈ హైడ్రామా ఇంకెన్నాళ్లు..? అసలు హైడ్రా ఎందుకు..? ఎవరికోసం..? ఇలాంటి ప్రశ్నలు కోకొల్లలుగా ఉత్పన్నం అవుతున్నాయి.. పేదోళ్ల పాలిట యమపాశంలా.. పెద్దోళ్ల పాలిట ఒక వరంలా హైడ్రా తన రూపురేఖలు సంతరించుకుంటోందనే విమర్శలు రోజు రోజుకూ పెల్లుబెక్కుతున్నాయి.. ఈ విమర్శల్లో కొంత నిజం లేకపోలేదు.. ఎంతో మంది నిరుపేదలు, సామాన్య దిగువ మధ్యతరగతి ప్రజల ఇండ్లను అక్రమ కట్టడాలనే నెపంతో కూల్చివేసిన హైడ్రా.. వరిటెక్స్ లాంటి బడా నిర్మాణ సంస్థల అక్రమ నిర్మాణాల జోలికి, వెంచర్ల జోలికి వెళ్ళకపోవడం ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురి చేస్తోంది.. వరిటెక్స్ వ్యవహారంలో కోర్టు హైడ్రా కు అక్షింతలు వేసిన సంఘటన కూడా ఇప్పుడు సంచలనం అవుతోంది.. మరెందుకు హైడ్రా తన ఫంథాను మార్చుకోవడం లేదు అన్నది మిలీనియం డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.. చట్టాలు అందరికి సమానం కాదు.. బడా బాబులకు ఒక్క చట్టం సామాన్యులకు మరో చట్టం అన్నట్లు హైడ్రా వ్యవహరిస్తుందని ఉత్పన్నం అవుతున్న ప్రశ్నలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎలాంటి సమాధానం చెపుతాడో వేచి చూడాలి మరి.. రోజు రోజుకూ రెచ్చిపోతున్న వరిటెక్స్ లాంటి దూర్తులను కట్టడి చేయకపోతే మొదటికే మోసం వస్తుంది.. పట్టపగలే చెరువులను పూడ్చిన, అనుమతులు లేకుండా రోడ్లు వేసిన, ప్రభుత్వ భూములను అప్పనంగా దోచుకున్న వరిటెక్స్ లాంటి నిర్మాణ సంస్థలను బ్లాక్ లిస్టు చేర్చి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. కబ్జాల పై చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తే భావితరాలు బుగ్గిపాలు అవుతాయనే వాస్తవాన్నినేటి ప్రశ్నించాల్సిన యువతరం గ్రహించాలి..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, మంకాల్ గ్రామ శివారులో వరిటెక్స్ డిస్ట్రిక్ట్, వరిటెక్స్ ఫ్లోరెంజ అనే పేర్లతో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేసి భారీ వెంచర్ ను ఏర్పాటు చేశారు వరిటెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ.. పట్టపగలే చెరువులను భారీ వాహనాలతో జెసిబిలతో పూడ్చి కబ్జా చేసినా నేటి వరకు ఇరిగేషన్, హైడ్రా అధికారులు జెసిబి వాహనాలను, చెరువులో మట్టి పోసి పూడ్చివేసిన టిప్పర్లను నేటికీ సీజ్ చేయకపోవడంతో అధికారుల వ్యవహార తీరుపై ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

ప్రభుత్వ భూములను, చెరువులను చెరబడుతున్న వరేటేక్స్ వర్మకు సంకెళ్లు పడి అరెస్టు చేసేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు స్థానిక ప్రజలు.. చెరువును కబ్జా చేసిన విషయంపై స్థానిక ఇరిగేషన్ అధికారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు అయినా.. నేటికీ చర్యలు చేపట్టకపోవడంతో.. బరితెగించిన వర్మ మూడు పూలు ఆరు కాయలు అన్న చందాన దర్జాగా కబ్జాలు చేయడం.. అట్టి భూముల్లో దొడ్డి దారిన అనుమతులు పొందడం.. అమాయకులకు అంటగట్టడం.. కోట్లు కొల్లగొట్టడం అనే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాడు.. ఇలాంటివి అన్నీ ఇతనికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు..

ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసిన వర్మపై భూభారతి చట్టంలోని నిబంధనల ప్రకారం ల్యాండ్ గ్రాబింగ్ కేసు నేటికీ రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ లో పెట్టకపోవడం ఏంటనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.. చెరువును కబ్జా చేసి ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తూ.. భారీ వెంచర్లని వేస్తున్న విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఓ ఎన్నారై తమ పట్టా భూమిలోనుండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా కబ్జా చేసి 150 ఫీట్ల రోడ్డును వేశాడని ఫిర్యాదు చేసి కోర్టుకు వెళ్లారని తెలిసింది.. ఈ విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం బాధిత ఎన్నారైలతో ఫోన్లో మాట్లాడి వరిటెక్స్ వర్మ చేసిన కబ్జాపై వివరణ తీసుకుని.. ఎంతటి వారైనా చర్యలు చేపడతానని హామీ ఇచ్చి.. చివరకు అక్రమంగా చేసిన వెంచర్ వద్దకు వచ్చి ప్రభుత్వానుమతి లేకుండా వేసిన రోడ్డును చూసి ఇది బడా వెంచర్ అని.. ఇందులో పెద్ద వాళ్ళు ఉన్నారని.. తాను ఎలాంటి చర్యల చేపట్టలేనంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెను తిరిగి వెళ్లిపోయాడని ఎన్నారై లు ఆరోపించడంతో పాటు, స్థానిక ప్రజలు హైడ్రా వ్యవహార తీరుపై మండిపడుతున్నారు.. తమకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించామని.. మూడు నెలల్లో చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినా కూడా హైడ్రా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో కంటెమ్ట్ కేసు వేశామని బాధితులు ఆరోపించారు..

కాగా సదరు కేసు విషయంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కంటెమ్ట్ నోటీసు సైతం జారీ అయిందని తెలిపారు.. ప్రభుత్వ స్థలాలను, చెరువులను కబ్జాలు చేసి అక్రమంగా నిర్మించుకున్న సరే.. పేదోళ్లపై చర్యలు చేపడుతూన్న హైడ్రా బడా నిర్మాణ సంస్థకు సంబంధించిన వర్మ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు.. ఇటీవలే మహేశ్వరం మండల తహసిల్దార్ పోలీస్ సిబ్బందితో కలిసి వెళ్లి భారీ బందోబస్తు నడుమ ప్రభుత్వ స్థలాలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు దీంతో వర్టెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్మ చేసింది ముమ్మాటికి కబ్జా అని తేటతెల్లమైంది.. వందల కోట్ల విలువైన స్థలం, చెరువు కబ్జా చేసినా.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేటికి వరిటెక్స్ వర్మ ను అరెస్టు చేయకపోవడంపై అంతర్యం ఏంటనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి..

బడా నిర్మాణ సంస్థలు ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలు చేస్తే.. అట్టి బడా నిర్మాణ సంస్థలు హైడ్రా పరిధిలోకి రావా..? అనే ప్రశ్నలు సైతం ఉత్పన్నం అవుతున్నాయి.. వాల్టా చట్టం 2002 నిబంధనలను, భూభారతి చట్టంలోని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తుంగలో తొక్కి పట్ట పగలే చెరువులను కబ్జా చేస్తున్న వరిటెక్స్ వర్మను నేటికి అరెస్టు చేయకపోవడంతో.. అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని ఆ వైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.. నేటి వరకు వరిటెక్స్ డిస్ట్రిక్ట్స్, వరిటెక్స్ ఫ్లోరంజ వెంచర్లలో వేసిన అక్రమ రోడ్లపై నిర్మించిన కల్వర్టులపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం హైడ్రా కమిషనర్ డొల్లతనం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది.. వరిటెక్స్ డిస్ట్రిక్ట్ వెంచర్, వరిటిక్స్ ఫ్లోరంజ పేరుతో చేసిన వెంచర్ కు అక్రమంగా అనుమతులు ఇచ్చిన హెచ్ఎండిఏ, ఎన్ఓసి జారీ చేసిన నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పై, ఈ అక్రమాలకు వత్తాసు పలికిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విచారణ చేపడితే వాస్తవాలు బట్టబయలు అవుతాయని డిమాండ్ చేస్తున్నారు స్థానిక ప్రజలు.. పేదోళ్లపై చర్యలు చేపడుతూ.. పెద్దలను వదిలేయడంతో హైడ్రాపై మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు..వరిటెక్స్ చేస్తున్న కబ్జాలు అన్ని ఇన్ని కావు..తీగ లాగితే డొంక కదిలినట్లు తవ్వే కొద్ది వర్మ కబ్జాలు పుట్టగొడుగుల బుట్టబయలు అవుతూనే ఉన్నాయి.. పైన ప్రభుత్వం గాని ఇటు హైడ్రా అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయంగా మారింది.. వరిటెక్స్ వర్మ రంగారెడ్డి జిల్లా కేంద్రంగా చేసిన కబ్జాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్” మా అక్షరం “అవినీతిపై అస్త్రం”..

Latest News

AI – పోలీసు విధుల్లో నూతన సాంకేతికతల వినియోగంపై ప్రత్యేక శిక్షణ

మేడ్చల్, 13 ఆగస్టు 2025:మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS