Sunday, September 7, 2025
spot_img

కాంగ్రెస్ కమిటీల్లో సామాజిక స్పృహ సున్నా

Must Read

తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆమోదించిన పలు కమిటీలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ డాసోజు శ్రవణ్ తప్పుపట్టారు. ఈ కమిటీల నియామకం ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘించేలా, కుల గణన స్ఫూర్తికి తీవ్రంగా గండికొట్టేలా ఉందని విమర్శించారు. సామాజిక న్యాయతత్వానికి కూడా విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని అంశాలు..

ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు దేశానికి బలం. రాహుల్ గాంధీ నినదించిన ‘జిత్నీ ఆబాదీ, ఉత్తనా హక్’ ఆత్మ ఈ నియామకాల్లో ఎక్కడుందో చెప్పాలి. ఈ కమిటీలు ఎలైట్ వర్గాలతో, ఫ్యూడల్ శక్తుల ఆధిపత్యంతో నిండిపోయాయి. తక్కువ వర్గాలను వ్యవస్థాపితంగా అణిచివేయడమే కాక వారి రాజకీయ శక్తిని పూర్తిగా నిరాకరించాయి. మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగుల్లో లింగ సమానత్వంపై చేసే ప్రసంగాలు బూటకమని తేలిపోయింది.

రాష్ట్ర ఆర్థిక కమిషన్, వ్యవసాయ కమిషన్ లాంటి రాజ్యాంగ పదవులను నిర్వర్తిస్తున్న నేతలనే మళ్లీ పార్టీ పదవుల్లో నియమించడం చట్ట రీత్యా పెద్ద తప్పిదం. వీరిద్దరి నియామకాలు పార్టీ నిబంధనలకు విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్య. ఉదయపూర్ డిక్లరేషన్‌లో పేర్కొన్న వికేంద్రీకరణ, సబ్బండ వర్గాల ప్రాతినిధ్యం ఈ కమిటీల్లో ఎక్కడా కనిపించడంలేదు. కుల గణన కేవలం సంఖ్యల సేకరణ కోసం కాదు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం కోసం. అట్టడుగు వర్గాలకు రాజకీయ శక్తి పంపిణీ కోసం.

ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ మర్చిపోవటం సామాజిక మోసం కిందికే వస్తుంది. కోట్లాది ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు రాహుల్ గాంధీ పిలుపును నమ్మి ఓట్లేసి అధికారమిచ్చారు. వారికి ఇప్పుడు ఏ సందేశం ఇచ్చారు?. ‘జిత్నీ ఆబాదీ ఉత్తనా హక్’ నినాదాన్ని వేదికలపై గట్టిగా పలికినవాళ్లు అదే వర్గాలకు రాజకీయ కుర్చీలు ఇవ్వకపోతే అది హిపోక్రసీ మాత్రమే కాదు. నైతికంగా ఘోరమైన ద్రోహం.

ఈ కాంగ్రెస్ కమిటీల నియామకాలు పొరపాటుగా జరిగినవి కాదు. సంకల్పబద్ధంగా బహుజన వర్గాలను అణచివేయడం కోసం జరిగినవి. ఇది సామాజిక న్యాయాన్ని గంగలో కలిపేసిన చర్య. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌ ఇకనైనా బలవంతపు శక్తుల ఆధిపత్యం నుంచి బయటపడాలి. మీరు నిజంగా సామాజిక న్యాయాన్ని నమ్మితే దాన్ని ముందుగా మీ పార్టీలో అమలుచేయడం మొదలుపెట్టండి.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This