Wednesday, April 2, 2025
spot_img

రాష్ట్రంలో ఇంటర్ బోర్డు ఉందా.. లేదా ..?

Must Read
  • విద్యార్థులతో కార్పొరేట్ కాలేజీల వ్యాపారం
  • నిబంధనలకు విరుద్ధంగా క్లాసుల నిర్వహణ
  • ఐఐటీ, నీట్ పేరుతో కాలేజీల వేలకోట్ల దందా
  • ఇంటర్ సీటు 6 లక్షల నుంచి పది లక్షల దాకా
  • ఏసీ క్లాసు రూమ్ ల పేరుతో లక్షల్లో వసూలు
  • రూల్స్ కు విరుద్ధంగా ఇష్టానుసారంగా అడ్మిషన్లు
  • బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు
  • ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతిగదులు
  • హాస్టళ్లు,పుడ్డు, బెడ్డు.. అన్నీ అధ్వాన్నమే
  • ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఇంటర్ బోర్డు

షెడ్యూల్‌ ప్రకటనకు ముందుగానే అడ్మిషన్లు, క్లాసుల నిర్వహణ చేపడుతున్న కాలేజేలపై ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందని తెలుస్తోంది… కార్పొరేట్‌ కాలేజీల దందాను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు కోరినప్పటికీ ఇంటర్‌ బోర్డు ఖాతరు చేయడంలేదు.. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు ముగిసి, ఫలితాలు వెల్లడించిన తర్వాతే ఇంటర్‌ బోర్డు ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అప్పుడే ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, ఇప్పటికే శ్రీ చైతన్య , నారాయణ, అల్ ఫోర్స్ వంటి కార్పొరేట్‌ కాలేజీలు నో అడ్మిషన్‌ బోర్డులు పెట్టేశాయి… ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం. అయిన ఇంటర్ బోర్డు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ప్రతినిధి గత నెల బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని లిఖిత పూర్వక పిర్యాదు చేసిన ఇంటర్ బోర్డు పట్టించుకోలేదు..

బహిరంగంగా అడ్మిషన్లు, క్లాసులు నిర్వహిస్తున్న ఇంటర్ బోర్డు మౌనం
‘అడ్మిషన్లు ప్రారంభించబడినవి’ అని ఫ్లెక్సీలు, బోర్డులు పెట్టుకొని, కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా, వివిధ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేసుకుంటున్నా అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యం. ఇంటర్‌ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం, కాలేజీలను అదుపుచేయలేని స్థితిలో ఇంటర్ బోర్డు ఉండటం చేత ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల ఇష్టారాజ్యం నడుస్తోంది.. ప్రైవేట్‌ విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోతోందని, కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజుల వసూళ్లు, తరగతుల నిర్వహణ, ముందుగానే అడ్మిషన్లు వంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్లీ మొదలైంది.
ఇంటర్ తోపాటే జేఈఈ, నీట్, ఎప్ సెట్ కోచింగ్ పేరిట మేనేజ్ మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. ప్రత్యేకంగా పీఆర్వోలను నియమించుకొని, పేరెంట్స్ కు వల విసురుతున్నాయి. పదుల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేలకొద్దీ అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వందల బ్రాంచీలతో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు రెండేండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా రూ.5 లక్షల నుంచి 6 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ మచ్చుకైనా లేని అపార్ట్మెంట్లలో కాలేజీలను నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడింది ఆట.. పాడింది పాటగా నడుస్తూ వస్తోంది..

మూడోవంతు కార్పొరేట్ కాలేజీలే..
రాష్ట్రంలో 1600కు పైగా ప్రైవేట్ జూనియర్ కాలేజీలుండగా, వాటిలో 600 దాకా కార్పొరేట్ కళాశాలలున్నాయి. వీటిలో రెండు ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియెట్ మార్కెట్ ను శాసిస్తున్నాయి. హైదరాబాద్, ఔటర్కు అటూ ఇటూ వందలకొద్దీ బ్రాంచీలు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలను నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజీ అంటే దాని కో ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లేగ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ. లైబ్రరీలు, ల్యాబ్లు, ఆడిటోరియం తప్పనిసరి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ఇలాంటివేవీ కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఎంతకీ అయిపోవు. వందలు, వేల మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చినా అడ్మిషన్ చేసుకొని, ఆ మేరకు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని కొత్త బ్రాంచ్ తెరిచేస్తున్నారు.

ఒకచోట పర్మిషన్ తీసుకొని, మరోచోట కాలేజీలు నిర్వహిస్తున్నారు.
నలుగురు ఉండాల్సిన హాస్టల్ రూంలలో పది మందిని కుక్కుతున్నారు. ఒక్కో క్లాస్ రూంలలో సగటున 40 మంది స్టూడెంట్లు మించరాదని నిబంధనలు చెప్తున్నప్పటికీ 60 మందికిపైనే ఉంచుతున్నారు. ప్రతి సెక్షన్లో పూర్, యావరేజ్, ఎబో యావరేజ్ స్టూడెంట్లను ఉంచాలనేది నిబంధన. కానీ కార్పొరేట్ కాలేజీలు.. స్టూడెంట్లకు ముందుగా టెస్ట్పెట్టి, అందులో పర్ఫార్మెన్స్ ఆధారంగా సెక్షన్లు డివైడ్ చేస్తున్నాయి. ర్యాంకులు వచ్చే అవకాశమున్న పిల్లలందరితో సెపరేట్ బ్రాంచీలు పెట్టి వాళ్లపైనే కాన్సంట్రేషన్ చేస్తున్నాయి. వాళ్లకు మాత్రమే మంచి స్టాఫ్, మంచి మెటీరియల్, మంచి ఆహారం పెట్టి ఎంకరేజ్ చేస్తున్నాయి. వీరిలో ర్యాంకులు వచ్చేవాళ్లు పదుల సంఖ్యలో ఉండగా, మిగిలిన వేలాది మందికి ఎలాంటి ర్యాంకులు రావడం లేదు. ఇన్ని లక్షలు పెట్టినా కనీసం ఇంటర్ పాస్కాని వాళ్లు వేలల్లో ఉంటున్నారు. కానీ ఆఫీసర్లను మేనేజ్ చేయడం వల్ల ఈ విషయాలేవీ బయటకు రావడం లేదు.

అడ్మిషన్లు మొదలైనయ్
హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్డు ను అనుకుని ఉన్న ప్రాంతాలు, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, ఆదిభట్ల, విఠల్ వాడి, చిక్కడపల్లి, హైదర్ నగర్, దిల్ షుక్ నగర్, ఎల్ బి నగర్ తదితర ప్రాంతాలు కార్పొరేట్ కాలేజీలకు అడ్డాలుగా మారిపోయాయి.టెన్త్ ఫలితాలు ఇంకా రిలీజ్ కాకున్నప్పటికే చాలా కార్పొరేట్ కాలేజీలు దాదాపు అడ్మిషన్లు పూర్తిచేశాయి. జనవరి నుంచే స్కూళ్ల ద్వారా పేరెంట్స్ ఫోన్ నంబర్లు సేకరించి, పీఆర్వోల ద్వారా అడ్మిషన్లు ప్రారంభించారు. ముందుగా అడ్మిషన్ తీసుకుంటే ఫీజుల్లో కన్సెషన్ ఉంటుందని చెప్పి చేర్చుకుంటున్నారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష దాకా అడ్వాన్స్ తీసుకొని అడ్మిషన్ నంబర్లు ఇస్తున్నారు. అడ్మిషన్ నంబర్లతో పాటే ఆన్లైన్ క్లాస్ లింక్లు వాట్సాపు సెండ్ చేస్తున్నారు. నిజానికి మే31 దాకా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెలవులు ప్రకటించింది. కానీ, కార్పొరేట్ కాలేజీలు బుధవారం నుంచే స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. టెన్త్ పరీక్షలు రాసిన స్టూడెంట్లకూ బ్రిడ్జికోర్సుల పేరుతో తరగతులు చెప్తున్నాయి. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్లు, స్టూడెంట్ యూనియన్లు ఆధారాలతో సహా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా, ఏ ఒక్క కాలేజీపైనా చర్యలు తీసుకోలేదు. దీంతో ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏసీ కావాలంటే రూ.లక్ష అదనంగా చెల్లించాలి..
రెండేండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల దాకా వసూలు చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు ఏసీ క్యాంపస్ పేరిట పేరెంట్స్ దగ్గర అదనంగా రూ. లక్ష నుంచి రూ.2 లక్షల దాకా గుంజుతున్నాయి. నిజానికి కాలేజీలు స్టార్ట్ అయ్యేసరికే ఎండాకాలం అయిపోతుంది. ఆ తర్వాత వర్షాలు, అటుపై చలికాలంలో ఏసీల అవసరమే ఉండదు. కానీ ఐఐటీ, నీట్ ప్రిపేర్ కావాలంటే చక్కటి వాతావరణం ఉండాలని నమ్మించి, ఏసీ అయితే బాగా చదువుతారని మభ్యపెడ్తున్నారు. మెడికల్, యూనిఫామ్, దోబీ, స్టడీ మెటీరియల్ పేరుతో మరో లక్ష దాకా గుంజుతున్నారు. ఫస్టియర్ కు ఒక ఫీజు తీసుకుంటూ, సెకండియర్ కు మరో రూ.20వేల నుంచి రూ.50 వేలు పెంచేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టవేయాలని తల్లిదండ్రులు , విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు..

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS