- బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్
- ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని దీక్ష
- రేవంత్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు
తెలంగాణలో బీసీ సమాజానికి 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ధర్నాచౌక్లో ప్రారంభమైన ఈ దీక్షకు ముందు ఆమె డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రానికి పంపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని, అదే తీరును ప్రశ్నిస్తూ ఈ దీక్ష చేస్తున్నామని కవిత పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. ఇది బీసీ వర్గాలకు జరిగే సామాజిక అన్యాయంపై పోరాటమని ఆమె స్పష్టం చేశారు. బీసీల రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ఈ దీక్ష తొలి అడుగు మాత్రమేనని, అవసరమైతే భవిష్యత్తులో మరింత ఉగ్రంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
తెలంగాణలో బీసీల జనాభా సగభాగంగా ఉన్నా, రాజకీయ హక్కులు మాత్రం దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయంగా న్యాయం చేయాలనే సంకల్పంతోనే ఈ దీక్షకు దిగాం. కాంగ్రెస్ పార్టీ గతంలో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు చర్యలు తీసుకోవాలని నెలలుగా కోరుతున్నాం. కానీ ప్రభుత్వం స్పందించడంలేదంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అంశంపై గందరగోళానికి లోనవుతుందని, బీజేపీపై నెపం వేస్తూ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ముస్లింలను మినహాయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం ప్రకటిస్తే, బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందో మేమూ చూస్తామని సవాల్ విసిరారు. అంతేకాకుండా, ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంలో ప్రత్యేక బిల్లు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ముస్లింలను బీసీల జాబితాలో ఉంచకుండా, వారికి ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ దీక్షకు బీసీ సంఘాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, పలు సామాజిక కార్యకర్తలు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది మరో ముదిరే ఉద్యమానికి నాంది కావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.