- ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులు అనర్హులు
- హామీల మోసం విషయంలో కాంగ్రెస్,బీఆర్ఎస్ కు తేడా లేదు
- బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలి
- రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలి
- మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశం ప్రశాంతంగా ఉంది
- నాయకులకు ఉద్యోగాలు దొరికినాయికానీ, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం రాలే
- ఫిరాయింపుల పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం అన్యాయం
- ఇచ్చిన హామీలు ఏమయ్యాయి – కేంద్రమంత్రి బండి సంజయ్
ఒక పార్టీ నుండి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ పేరుతో ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు.పార్టీ ఫిరాయింపులు,అవినీతి, అక్రమాలు,హామీల మోసం విషయంలో కాంగ్రెస్ కు,బీఆర్ఎస్ కు తేడా లేదని అన్నారు.కాంగ్రెస్ నిజంగా ‘పాంచ్ న్యాయ్ పత్ర్’ కు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ లోకి 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించబోతున్నారని వార్తలొస్తున్నాయి,వారందరితో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళితే, ఆ సీట్లన్నీ బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యమన్నారు.బీజేపీలో రావాలనుకునే ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి చేరాల్సిందేనని స్పష్టం చేశారు.గతంలో హుజూరాబాద్,మునుగోడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.శనివారం హైదరాబాద్ విచ్చేసిన బండి సంజయ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక గోకుల్ చాట్ పేలుళ్లు,లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్ లు,ఉగ్రవాదుల ఊచకోతలు,నక్సలైట్ ల అర్దరాత్రి హత్యలు లేవని తెలిపారు.దేశం ప్రశాంతంగా ఉందని,దేశ భద్రతే తమ ప్రథమ కర్తవ్యం అని తెలిపారు.విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావడాన్ని స్వాగతిస్తున్నా అని తెలిపారు.ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటే సమస్యలు పరిష్కారం సులువు అవుతుందని వెల్లడించారు.చిత్తశుద్ధితో ఆయ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ కోరారు.గతంలో మాదిరిగా చేపల పులుసు,రొయ్యల వేపుడు పేరుతో తెలంగాణకు అన్యాయం జరిగే నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని తెలిపారు.కొంతమంది గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అని విమర్శించారు.అట్లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదని కోరుకుంటున్నట్టు తెలియజేశారు.తెలంగాణ బిడ్డగా నా అభిప్రాయాలు నాకు ఉంటాయని,కానీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా నేను రెండు రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు దొరికినాయి కానీ,నిరుద్యోగులకు మాత్రం ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా దొరకలే అని ఆరోపించారు ఇప్పటికే అధికారంలోకి వచ్చి 7 నెలలైందని గుర్తుచేశారు.ఒక్క ఉద్యోగం ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ మిగతా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలు నిల్బెట్టుకొనందుకే పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని తెలిపారు.ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి ఫిరాయింపుల పై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం అన్యాయం అని విమర్శించారు.పార్టీ మరినొళ్ళను “పాంచ్ న్యాయ పత్ర” ప్రకారం రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయించే దమ్ముందా? అని నిలదీశారు.రాష్ట్రంలో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివ్రుద్ధి పనులు చేయడం లేదని ఆరోపించారు.కాంగ్రెస్ మాదిరిగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే,వాళ్ల పరిస్థితి ఎట్లుంటదో ఆలోచించాలని అన్నారు. ఇకనైనా రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.నిధుల కేటాయింపు జరపాలని కోరారు. స్థానిక సంస్థల్లో అనేక సమస్యలున్నాయని తెలిపారు.గ్రామపంచాయతీలకు బిల్లుల పేరిట దాదాపు రూ.3 వేల కోట్ల బకాయిలివ్వాలని తెలిపారు.మాజీ సర్పంచులు బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు.స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడొచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించిన బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం నేతలు దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలకడం ఎంఐఎం నేతలకు అలవాటైందని విమర్శించారు.అందుకే రేవంత్ రెడ్డితో ఒవైసీ కుమ్కక్కై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.