ఎన్నికల్లో ఒడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు.ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాలని సూచించారు. ఒకవేళ వారు ఎన్నికల్లో గెలుస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గడిచిన రెండేళ్ల మహాయుతి కూటమి పాలనలో ఎన్నో పనులు చేశామని, అందుకే ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమిని గెలిపించారని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మహాయుతి కూటమికి 43.55 శాతం ఓట్లు దక్కగా, ఎంవీఏకు 43.71 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష కూటమికి 31 సీట్లు రాగా, అధికార కూటమికి 17 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు కూడా ఈవీఎంలలో స్కాం జరిగినట్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదని తెలిపారు.