- ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్
- కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి పోర్టల్ బాధ్యతలు
- త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం
- రైతుకు మంచి జరిగే ప్రతి సూచనను స్వీకరిస్తాం
- విగ్రహావిష్కరణపై కూడా బీఆర్‌ఎస్ రాజకీయం
- గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదు
- మా హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
- గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నాం
- మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ఏడాది పూర్తయ్యిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని..పదేళ్ల పాలనకు.. ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉందని, మా ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి అప్పగించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిపుణుల కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణి పోర్టల్ ను ఎలా ప్రక్షాళన చేయాలని చూస్తున్నామన్నారు.
ప్రజలకు మంచి జరిగేలా ధరణి పోర్టల్ లో మార్పులు చేస్తామన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ధరణి పోర్టల్ పై ఫిర్యాదులు వచ్చేవి. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెవెన్యూ అధికారులు, నిపుణులతో ధరణిపై కమిటీ వేశాము. కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణి పోర్టల్ ను ఎలా ప్రక్షాళన చేయాలి. ఎలా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో చర్చించి దశల వారీగా అమలు చేస్తున్నాము. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ధరణిలో సీక్రెట్ లేకుండా అందరూ వివరాలు తెలుసుకునే విధంగా మార్చాము. ధరణి ఫిర్యాదులను రిజెక్ట్ చేస్తే అందుకు పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించాను. అలాగే ధరణిపై వచ్చిన 2.45 లక్షల ఫిర్యాదులను కేవలం కలెక్టర్ క్లియరెన్స్ మాత్రమే కాకుండా వివిధ దశలుగా డీసెంట్రలైజేషన్ చేశాము. ఎమ్మార్వో, ఆర్డీవో, స్పెషల్ కలెక్టర్(రెవెన్యూ), కలెక్టర్, సీసీఐ.. ఇలా 5 దశల్లో ఫిర్యాదు అప్లికేషన్లను పరిష్కరిస్తారు. డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్ బాధ్యతలను ఎన్ఐసీకి అప్పగించాం. ధరణిలో గతంలో 33 మాడ్యూల్ ఉండేవి. సామాన్యులకు ఈ మాడ్యూల్స్ అర్థం అయ్యేవి కాదు. ప్రజలు పొరపాటున ఒక మాడ్యూల్ బదులుగా మరో మాడ్యూల్ అప్లై చేస్తే అధికారులు రిజెక్ట్ చేసేవారు. ఈ సమస్యకు పరిష్కారం తీసుకోస్తున్నామని మంత్రి తెలిపారు.
2020 ఆర్‌వోఆర్ చట్టంలో లోపాలు సరిచేసి, 2024 ఆర్ వోఆర్ కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని, వచ్చే అసెంబ్లీ సమావేశాలలో కొత్త చట్టాన్ని ఆమోదింపజేస్తామని చెప్పారు. ధరణి కొత్త యాప్, కొత్త చట్టం సామాన్యులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు పరిచిందని, కానీ రెవెన్యూ గ్రామాలకు ఓ అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని అన్నారు. 2004-14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇళ్లు నిర్మించిందని, 2014-23 వరకు 1.52 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్లు మాత్రమే పిలిచారని, వీటిలో 63 వేల ఇండ్లు పూర్తి అయ్యాయని, ఇందులో పింక్ కలర్ షర్ట్ తొడుకున్న వారికే ఎక్కువగా ఇచ్చారని విమర్శించారు.
గత ప్రభుత్వంలో మొదలై అసంపూర్తిగా ఉన్న ఇండ్లు ఇందిరమ్మ రాజ్యంలో యుద్ధప్రాతిపదికన రాబోయే ఒక నెల లేదా రెండు నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. వీటిని అర్హులైన పేదవారికే ఇస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి లోపే ఇవన్నీ కంప్లీట్ చేసి ఇస్తామని అన్నారు. మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల స్థలాలు ఉన్న వారికోసం 4 లక్షల 50 వేల ఇండ్లు, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు తగ్గకుండా ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇచ్చామన్న. ప్రతి ఇంటికి రూ. 5 లక్షల చొప్పున 400 చదరపు అడుగులు ఉండే విధంగా.. అంతకంటే ఎక్కువగా ఉన్న వారికైన సరే నచ్చిన డిజైన్‌లో ఒక టాయిలెట్, ఒక కిచన్‌తో పాటు ఇంటి నిర్మాణం వారి ఆర్థిక స్థోమత ప్రకారం కట్టుకోవచ్చని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని అభివృద్దిని తాము చేసి చూపించినందుకే మాపై విష ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక త్వరలో సర్వే వ్యవస్థను పటిష్టం చేయబోతున్నామని, ఇందుకోసం 1000 సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.