- నాగారం మున్సిపాలిటీలో స.నెం. 291/4లోని కోట్ల రూపాయల భూమి మాయం
- ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
- జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేసిన అక్రమార్కులు
- దోచిపెట్టిన అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్
- నిర్మాణ అనుమతులు ఇవ్వొద్దని కమిషనర్‌కి ఎమ్మార్వో అశోక్ లేఖ
- రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు
- గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్‌లో వరుస కథనాలు
- ఇప్పటివరకు ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోని వైనం
హైదారాబాద్‌లో భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్స్, చెరువులు, కుంటలు, నాలాలు ఖాళీగా కనపడితే కబ్జా చేసుడే. రాష్ట్ర రాజధానిలో అక్రమార్కుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. రాజకీయ, అధికార, డబ్బు బలంతో వాటిని పొతం పెడుతున్నారు. కబ్జాకోరులకి అధికారుల అండదండలు ఫుల్ గా ఉంటాయి. మామూళ్ల మత్తులో ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఎటు పోతే మాకేంటి అని గాలికి వదిలేస్తున్నారు. కోట్ల రూపాయల భూములు అప్పనంగా అప్పగిస్తున్నారు. పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని అన్నీ అక్రమాలను సక్రమాలు చేస్తూ రిజిస్టర్, నిర్మాణాలు చేయడానికి పూర్తి అండదండలతో సహాయ సహకారాలు అందజేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… నాగారం మున్సిపాలిటీ పరిధిలోని కోట్ల రూపాయల భూమిని హాంఫట్ చేశారు అక్రమార్కులు. మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 291/4లో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు జీవో 59 సహాయంతో చౌకగా కొట్టేశారు. అందుకు అప్పటి ఎమ్మార్వో గౌరీ వత్సల, ఆర్ఐ కిషోర్ పూర్తి సహాయ సహకారాలు అందజేసి ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు అప్పనంగా అప్పగించేశారు. ఈ ప్రభుత్వ భూమి కబ్జా విషయాన్ని వెలుగులోకి తెస్తూ గత జనవరిలోనే ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలను ప్రచురించింది. కానీ ఇప్పటివరకు ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోలేక పోవడం వారి చేతకాని తనానికి నిదర్శనం.
ఎమ్మార్వో అండదండలతో ఆక్రమణలు
ప్రస్తుత ఎమ్మార్వో అశోక్ కుమార్ సర్వే నంబర్ 291/4లోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని గతంలోనే నాగారం మున్సిపల్ కమిషనర్‌కి లేఖ రాశారు. కానీ రాత్రికి రాత్రే అక్రమాన్ని సక్రమం చేసే దిశగా కబ్జాదారులు ఆ భూమిలో కబ్జాలో ఉన్నట్లు చూపించుకోవడానికి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదెలా సాధ్యమని జనం మాట్లాడుకుంటున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని అధికారులు అక్రమార్కులకు అప్పగించడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఎడిసినట్టు చెయ్యి అన్నట్టు కబ్జాకోరులకు ఓవైపు సపోర్టు చేస్తూనే మరోవైపు మున్సిపల్, రెవెన్యూ అధికారులు నటిస్తున్నట్టు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు స్పందించి ఆ నిర్మాణాలను తొలగించినా కూడా తిరిగి వెంటనే మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఎమ్మార్వో అశోక్ కుమార్ తగిన చర్యలు తీసుకోవడానికి హైడ్రాకి సిఫార్సు చేయాలని కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్‌కి లేఖ రాశారు. కానీ ఇప్పటివరకు సర్వేనెంబర్ 291/4 ప్రభుత్వ భూమిలోని నిర్మాణాలను తొలగించి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేకపోవడం విశేషం. ఇప్పటికైనా హైడ్రా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ మార్గంలో చేజిక్కించుకున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నాగారం మున్సిపల్ వాసులు కోరుతున్నారు.
ఇకనైనా ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని నాగారం మున్సిపల్ పరిధిలోని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడుతారో చూడాలి మరి.