సినీ ఇండస్ట్రీలో విలక్షణ కథానాయకుడిగా ధనుష్‌కి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ ఆయన ప్రత్యేకతను చాటుకుంటుంటారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’. పా పాండి, రాయన్ చిత్రాల తర్వాత ధనుష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ధనుష్ దర్శకత్వంలో ఆర్.కె.ప్రొడక్షన్స్‌తో కలిసి ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2018లో విడుదలైన మారి2 తర్వాత ధనుష్ నిర్మిస్తోన్న సినిమా ఇది. రొమాంటిక్ కామెడీ కథను ధనుష్ రాయటం విశేషం. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలవుతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పి విడుదల చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన రాయన్ సినిమాను కూడా ఇదే బ్యానర్ తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా, జి.కె.ప్రసన్న ఎడిటర్‌గా వర్క్ చేశారు.