- సీపీఎం పార్టీ రథసారధి ఎవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది
- అవకాశం ఇవ్వాలని ఖమ్మం, నల్గొండ జిల్లా నేతల పట్టు
- తమ్మినేనికి అవకాశం లేకపోవడంతో పోటీ పడుతున్న సీనియర్లు
- జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగనుందని ప్రచారం
- ఉత్కంఠ రేపుతున్న సెక్రటరీ రేసులో విజయం ఎవర్ని వరించేనో ..!
రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోసం..సీపీఎం(CPM) పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. వరుసగా మూడు టర్మ్‌లుగా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగిన తమ్మినేని వీరభద్రం కు పార్టీ నిబంధనల ప్రకారం ఈ సారి కార్యదర్శి అయ్యే అవకాశం లేదు. దీంతో పార్టీలో చాలామంది సీనియర్ నేతలు రాష్ట్ర కార్యదర్శి సీటుపై కన్నేశారు. ముఖ్యంగా కొత్త కార్యదర్శి రేసులో పార్టీ సీనియర్ నేతలు ఎస్.వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన పొతినేని సుదర్శన్ గట్టిగానే పోటీ పడుతున్నారు. ఈసారి రాష్ట్ర కార్యదర్శి పదవి తమ జిల్లాకే కేటాయించాలాని ఖమ్మం, నల్గొండ జిల్లా నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు..దీంతో ఈసారి సీపీఎం పార్టీ రథసారధి ఎవరనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎప్పుడూ లేని విధంగా జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగిందని తెలుస్తోంది… దీంతో సీపీఎం స్టేట్ సెక్రటరీ రేసు మరింత ఉత్కంఠ రేపుతోంది.
ప్రతి మూడేళ్లకోసారి సీపీఎం రాష్ట్ర మహాసభలు:-
త్వరలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో జరగనున్నాయి. సాధరణంగా రాష్ట్ర మహాసభల చివరిరోజు రాష్ట్ర కొత్త సారధిని ఎన్నుకుంటారు. ప్రతి మూడేళ్లకోసారి సీపీఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తారు. ఆ సభల ద్వారానే రాష్ట్ర కార్యదర్శిని పార్టీ ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి పార్టీ కార్యదర్శి పదవికి మూడు టర్మ్‌ల కంటే ఎక్కువ కాలం ఉండకూడదనే రూల్ సీపీఎం పార్టీ కి ఉంది.గ్రామ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శి వరకు మూడుసార్లు మాత్రమే కార్యదర్శి పదవిలో ఉండాలి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్.వీరయ్య పార్టీ కార్యాలయ బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ నిర్మాణంలో తమ జిల్లా పాత్ర కీలకమని ఖమ్మం, నల్గొండ జిల్లాల నేతలు చెబుతున్నారట ..దీనికి తోడు పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ..అందుచేత ఈసారి తమకే చాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. వీరి మాటలు కేంద్ర కమిటీ వింటుందా లేక పెడ చెవిన పెడుతుందా..లేక చూద్దాంలే అని జారుకుంటుందా..వేచి చూడాలి..!
జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగనుందని ప్రచారం:-
ఈ సారి జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా అంత ఈజీగా లేదని కామ్రేడ్లు చెప్పుకుంటున్నారు.. గతంలో కంటే ఇటీవల జిల్లాలలో ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగిందని.. దీని కారణంగా చాలా జిల్లాల్లో జిల్లా కార్యదర్శి ఎన్నిక కోసం ఓటింగ్ చేపట్టే అవకాశాలు లేకపోలేదని చెప్పుకుంటున్నారు… ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక కూడా ఏకగ్రీవ అవుతుందా.? లేక ఇద్దరు ముగ్గురు నేతలు పోటీపడితే ఓటింగ్ జరుపుతారా .. అనేది ఆసక్తికరంగా మారింది. ..