- జేఏటీ 2025 డైరీ ఆవిష్కరణలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యం గల వ్యవస్థ మీడియా(Media) రంగం అని.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం మీడియా అని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishnu Dev Varma) అన్నారు. సోమవారం రాజ్ భవన్ లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) 2025 డైరీ ని గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్టు స్టేట్ కమిటీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజలకు, పాలకులకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించడం గొప్ప విషయం అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మీడియా రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని రిపోర్టర్లు పనిచేయడం ప్రశంసనీయమన్నారు. కాలంతో పోటీపడి క్షణం క్షణం.. నిమిషం నిమిషం సమాజాన్ని జాగ్రత్త పరుస్తున్న మీడియా రంగానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారన్నారు.
అత్యాధునిక టెక్నాలజీని అందుకొని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను దాటేసి డిజిటల్ రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులను అభినందించారు. ఎటువంటి లాభావేక్ష లేకుండా సమాజ సేవలో నిరంతరం పనిచేస్తున్న విలేకరులు ఆదర్శప్రాయులని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పేరుపేరునా అందరినీ పలకరించి, మీడియా రంగంలో వస్తున్న మార్పులు.. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూలూరి రమేష్, నాయకులు చిలుకూరి అఖిలేష్, అశోక్, అనిల్, మోహన్, తిరుమలేష్, రాఘవేంద్ర గౌడ్, గిరిధర చారి, కిషోర్, సత్యం, దుర్గాప్రసాద్, రామ్మోహన్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.