- లయన్స్ కంటి ఆస్పత్రికి 3ఎకరాల ప్రభుత్వం భూమి కేటాయింపు
- రాజేంద్రనగర్ లో కోట్ల భూమి హాంఫట్
- ఉప్పర్ పల్లిలోని సర్వే నెం.36లో 3ఎకరాలు మాయం
- పేదలకు ఉచిత వైద్యం కోసమని భూ దానం
- 2005లో అప్పటి ప్రభుత్వం జీఓఎంఎస్ నెం.1262 ద్వారా జారీ
- భూ బదిలీ, క్రయ, విక్రయాలు చేయకూడదని కండిషన్
- అబీబుల్లాకు చెందిన భూమిలో కొద్ది జాగలో లయన్స్ ఆస్పత్రి బిల్డింగ్
- నిబంధనలకు విరుద్ధంగా మూడెకరాలు భూమిని అమ్మిన వైనం
- డెవలపర్స్ మధుసూదన్ రెడ్డి, రియాజుద్దీన్ తో కలిసి స్పెక్ట్రం ఒయాసిస్ లేఅవుట్
- ప్లాట్స్ చేసి సొమ్ము చేసుకున్న డాక్టర్ రంగారెడ్డి కొడుకు వెంకటేశ్
- భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటున్న స్థానికులు
సేవ పేరుతో దోపిడి చేస్తున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ప్రభుత్వం, ప్రజల్ని నమ్మక ద్రోహం చేయడంలో ముందుంటారు. రాజధాని నగరంలో భూమిల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు కన్నం వేసేందుకు యత్నిస్తున్నారు. కడుపు అన్నం తినడానికి బదులు డబ్బులు తింటున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పేదలకు సాయం పేరుతో ఆశచూపి చివరకు గవర్నమెంట్ కే టోపి పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్స్ ను చూసి వాటిని ఏదో రకంగా తీసుకొని వాటిని తిరిగి విక్రయించడం ద్వారా కోట్ల గడించవచ్చని ఆశిస్తున్నారు. వీరికి రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు సైతం తోడవుతున్నారు. వైద్య సేవ పేరుతో ప్రభుత్వానికి కళ్లబొల్లి మాటలు చెప్పి భూములు తీసుకొని ఏదో మమా అనిపించి కొన్నేళ్లపాటు సదరు భూమిని పడావు ఉంచి అనంతరం బదలాయింపు, వెంచర్లు, ప్లాట్స్ చేసి విక్రయిస్తున్నారు. ఇలాంటి వారు ఎందరు అక్రమాలకు పాల్పడుతున్న కొన్నేళ్ల క్రితం నుంచే ఈ కార్యకలాపాలు జరుగుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం, అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పర్ పల్లి గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని మాయం చేశారు కబ్జాకోరులు. పేదలకు వైద్యసాయం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాసి భూమిని పొందడం జరిగింది. డాక్టర్ పి.రంగారెడ్డి.. లయన్స్ కంటి ఆస్పత్రిని నెంబర్ వన్ హాస్పిటల్ స్థాపించి పేదలకు ఉచితంగా ట్రిట్మెంట్ చేసేందుకు గాను ఓ కథ అల్లాడు. డాక్టర్ సి.ఎం.అబీబుల్లాతో పాటు పి.రంగారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. దీన్ని నమ్మిన అప్పటి ఉమ్మడి ప్రభుత్వం ఆయనకు భూమిని కేటాయించింది. 2005 సంవత్సరంలో ప్రభుత్వం జీఓ ఎంఎస్.నెం. 1262 ప్రకారం 3ఎకరాల భూమిని గజం రూ.450ల చొప్పున కేటాయించడం జరిగింది. అప్పటి చీఫ్ సెక్రటరీ వీపీ జాహరిన్ ఉత్తర్వులు జారీ చేశారు.
నాడు రాజేంద్రనగర్ ఏరియాలో భూమి మార్కెట్ వ్యాల్యూ ఎకరం కోటి రూపాయలకు పైనే ఉండేది. కానీ అతి తక్కువ ధరకు 3ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అదేవిధంగా సర్కారు భూమి కేటాయిస్తూ కొన్ని నిబంధనలు విధించింది. ఈ భూమి ప్రభుత్వానిది కాబట్టి దీన్ని క్రయ విక్రయాలు, ఎవరి పేరు మీద కూడా బదిలీ చేయకూడదని కండిషన్ పెట్టింది. అంతేకాకుండా ఈ స్థలంలో నిర్మించే లయన్స్ కంటి ఆస్పత్రి ద్వారా నిరుపేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలని సూచించింది. ఇంకా, ఈ లయన్స్ కంటి ఆస్పత్రి ద్వారా ఎంతమందికి వైద్యం అందిస్తున్నారు, ఎంతమంది పేదలు వైద్య చికిత్స ద్వారా లబ్ధి పొందుతున్నారో దానికి సంబంధించిన ఫర్ఫామెన్స్ రిపోర్ట్ ను ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కు నివేదిక అందజేయాలని ప్రభుత్వం షరత్ లు పెట్టడం జరిగింది.
లయన్స్ కంటి ఆస్పత్రి కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో హాస్పిటల్ కు ఎలాంటి బిల్డింగ్ కట్టకుండా.. దురుద్దేశంతో ఆలోంచించి పక్కనే అదే సర్వే నెం. 36లోని డాక్టర్ అబీబుల్లా కు సర్కారు ఇచ్చిన భూమిలోనే కొంత భాగంలో ఓ చిన్న భవనం కట్టడం జరిగింది. ఇక గవర్నమెంట్ కేటాయించిన 3ఎకరాల భూమిని డాక్టర్ పి.రంగారెడ్డి అలాగే ఖాళీగా ఉంచారు. హాస్పిటల్ కు అని గవర్నమెంట్ కేటాయించిన భూమిలో ఇక భూ దందా మొదలు పెట్టేశాడు. ఉప్పరపల్లి ఏరియాలో ఇప్పుడు ఎకరం రూ.50 కోట్లకు పైగా వ్యాల్యూ ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు తుంగలో తొక్కి అక్కడ భూమిపై కోట్లు సంపాదించాడు.
ఈ మూడెకరాలు భూమిని రంగారెడ్డి కొడుకు పీబీ వెంకటేశ్.. మధుసూదన్ రెడ్డి, రియాజుద్దీన్ అనే డెవలపర్స్ తో కలిసి భూ దందాకు తెరతీశాడు. ప్రభుత్వం లయన్స్ కంటి ఆస్పత్రికి కేటాయించిన భూమిలో స్పెక్ట్రం ఓయాసిస్ అనే లేఅవుట్ నిర్మించారు. జీహెచ్ఎంసీ అఫ్రూవడ్ పేరుతో ప్లాట్స్ చేసి కోట్లకు అమ్ముకున్నారు. అయినా ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పేదలకు సేవ చేస్తామంటే ఆస్పత్రికోసం భూమిని ప్రభుత్వం కేటాయిస్తే దాన్ని ప్లాట్స్ చేసి అమ్ముకున్న వ్యక్తులను క్షమించరాదు. సదరు భూమిని రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు స్వాధీనం చేసుకోకుండా ఉన్నారో తెలియదు. ఇప్పటికైనా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి కోట్లాది రూపాయల విలువైన గవర్నమెంట్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని, భూమిని ప్లాట్స్ చేసి అమ్ముకున్న వ్యక్తులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.