- ప్రమాణస్వీకారం చేయించిన సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్
- 30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(High Court Of Andhra Pradesh) లో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన జడ్జిలను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు అదనపు న్యాయమూర్తుల ప్రమాణంతో జడ్జిల సంఖ్య 30కి చేరింది.
జస్టిస్ హరిహరనాథ శర్మ స్వస్థలం కర్నూలు జిల్లా. ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్ అయ్యారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిన ఆయన సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2017-18 మధ్య అనంతపురం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా 2020 – 22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్‌గా 2023లో ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు స్వస్థలం ప్రకాశం జిల్లా. నెల్లూరు వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు పొందారు. 2000వ సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కావలిలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2014లో జ్యుడీషియల్ సర్వీసులోకి వచ్చారు. మొదట ఏలూరు జిల్లా అదనపు జిల్లా జడ్జిగా పోస్టింగ్ తీసుకున్నారు. తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పీడీజేగా పనిచేస్తూ 2021 సెప్టెంబరు 2న హైకోర్టు రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. 2022 అక్టోబరు 22న రిజిస్ట్రార్ జనరల్‌గా నియమితులయ్యారు.