Thursday, January 30, 2025
spot_img

ఇదిగో చెరువు కబ్జా.. కన్నెత్తి చూడని హైడ్రా..

Must Read
  • పుప్పాలగూడలో చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్..
  • అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు..
  • ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..
  • ఒకేరోజు, ఒకేసారి, ఒకే భూమికి మూడు రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు ..
  • దొడ్డిదారిన నిర్మాణ అనుమతుల పొందిన అక్రమార్కులు..
  • కళ్లెదుటే వేల కోట్ల విలువైన భూములను కొల్లగొడుతున్న ఫినిక్స్ నిర్మాణ సంస్థ..
  • సుమధుర నిర్మాణ సంస్థ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్మకాలు..
  • అందిన కాడికి దోచుకొని అడ్డదారిలో రేరా అనుమతి ఇచ్చిన అధికారులు..
  • నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జి.ఓ.1092 బేఖాతరు..
  • ఫీనిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి..
  • ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న సామాజిక వేత్తలు..
  • ముఖ్యమంత్రి సాబ్ ఈ చెరువు కబ్జాపై దృష్టి సారించండి..
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్స్..

ఒకవేళ ఫినిక్స్ నిర్మాణ సంస్థ చెరువు కబ్జా సక్రమమే అయితే.. హైడ్రా కూల్చి వేస్తున్న చెరువు కబ్జాలు అన్నీ కూడా అక్రమము ఎలా అవుతాయి అంటున్న హైడ్రా బారిన నష్టపోయిన బాధితులు..

అయ్యారే ఈ అక్రమాలకు అంతులేదా..? కాసులకు అమ్ముడుబోని నిజాయితీపరులైన అధికారులు బూతద్దం పెట్టి వెతికినా కనిపించారా..? అరాచకాలకు అడ్రస్ గా మారిన రాజకీయ నాయకుల్లో మార్పు రాదా..? తాము చేస్తున్న పని మహాపాపం అని తెలిసినా.. తాము ప్రతిరోజూ పూజింజే దేవుళ్ళు చూస్తుంటారని తెలిసినా.. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు అని తెలిసినా.. ప్రస్తుతం అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితం ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు అన్న చందాన పాపాలు మూటగట్టుకుంటూనే ఉన్నారు కొందరు.. వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వారు ఫినిక్స్ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్.. ఇతగాడికి సహకరిస్తూ, అతడి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు అవినీతి ప్రభుత్వ అధికారులు.. వీరి గురించి ఎంత చెప్పుకున్నా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉంటోంది తప్ప ఫలితం మాత్రం కనిపించడం లేదు..

విచిత్రం ఏమిటంటే పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి.. ట్రీటాన్, ఇంకా మధురంగా సుమధుర.. నిజానికి ఈ పేర్లు చూడగానే మనం పడిపోతుంటాం.. ఈ సంస్థలు చెప్పే కల్లబొల్లి కబుర్లు విని మైమరచిపోతాం.. వారి వలలో చిక్కుకుని రక్తం ధారపోసి సంపాదించింది అంతా వారి చేతుల్లో పోసి ఒక నివాస స్థలమో..? ఒక ఫ్లాటో కొనుగోలు చేస్తాం.. తీరా ఆ నిర్మాణాలు అక్రమం అంటూ ప్రభుత్వాధికారులు మన గోడు వినకుండా.. నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారు.. మనకి అమ్మిన దౌర్భాగ్యుడు మాత్రం కోట్లు వెనకేసుకొని దర్జాగా కాలరెగరేసుకుని తిరుగుతుంటాడు.. ఒకవేళ మనం కేసు పెట్టినా డబ్బులు వెదజల్లి బెయిల్ తెచ్చుకుంటాడు.. ఏ విదేశానికో వెళ్లి మన రెక్కల కష్టాన్ని తన సరదాలకు ఖర్చుబెట్టుకుంటాడు.. అసలు ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి..? వీటిని నిరోధించాల్సిన అవసరం మనం ఎన్నుకున్న ప్రభుత్వాలకు లేదా..? వుంది కానీ ఎన్నుకుంది మనం.. మనం ఎన్నుకున్న వారిని కొందరు దుర్మార్గులు కొనేస్తున్నారు.. దాంతో నరకయాతన అనుభవించాల్సింది మనమే.. అందుకే మేలుకోండి.. ఇలాంటి దుర్మార్గపు నిర్మాణాలే చేస్తోంది ఫీనిక్స్ నిర్మాణ సంస్థ.. ఏకంగా చెరువులను కొల్లగొట్టి నిర్మాణాలు చేస్తోంది.. వీరి బుట్టలో మనం పడ్డామా అంతే సంగతులు.. ప్లీజ్ బీ కేర్ ఫుల్..

రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న నిషేధిత జాబితాలోని సర్వే నెంబర్స్ ను కూడా వదలడం లేదు ఫీనిక్స్ ప్రభుద్దులు.. రంగారెడ్డి జిల్లాలోని, గండిపేట మండలం పరిధిలో గల పుప్పాలగూడ గ్రామ శివారులో ప్రభుత్వ భూమిగా నమోదై, నిషేధిత జాబితాలో ఉన్న సర్వేనెంబర్స్ 272, 273. ఈ సర్వే నెంబర్లలో ఎలాంటి భూ బదలాయింపులు చేపట్టడానికి వీలులేని భూమిగా నిషేధిత జాబితా 22 (ఏ)లో పెట్టాలని నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వర్తించిన నాటి చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు 1092 తేది : 06-06-2005 నే అందుకు ఆధారం.. రిజిస్ట్రేషన్ చట్టంలో పొందుపరచి ఉంది అయితే ఏమి లాభం..? పరిస్థితి షరా మామూలుగానే ఉంటోంది..

నార్సింగ్ 2 చెరువుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెలుగులోకి తీసుకుని వచ్చిన విధంగా 9 ఎకరాల 24 గుంటల స్థలాన్ని కబ్జా ఫీనిక్స్ నిర్మాణ సంస్థ పేరుతో చేసిందని.. 100 శాతం చెరువులు కబ్జాకు గురి అయిన జాబితా రిలీజ్ చేసిన దాంట్లో ఈ సర్వే నెంబర్ల స్థలం సైతం ఉండడం ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ వ్యవహారం బట్టబయలైంది.. పుప్పాలగూడ కేంద్రంగా ఫినిక్స్ ట్రీటాన్ పేరుతో వేల కోట్ల విలువైన భారీ భూ దోపిడీ చేస్తోంది ఈ నిర్మాణ సంస్థ.. సామాన్య ప్రజలు అప్రమత్తం కాకపోతే అంతే సంగతులు అంటున్నారు పలువురు సామాజికవేత్తలు.. ప్రభుత్వం జారీ చేసిన జీవో అధికారుల కండ్లకు కనబడటం లేదా..? లేదా ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అధికారులు అమ్ముడుపోయారా..? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారూ మీ మాటకు విలువే లేదా..? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేస్తూ సామాన్య ప్రజలకు అంటకట్టి సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏమిటి..? ఉప ముఖ్యమంత్రికి సైతం తెలియకుండా ఏదైనా మతలబు జరుగుతోందా..? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజానీకం.. కబ్జాల పేరుతో పేదల ఇండ్లపై కొరడా ఝుళిపించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా సంస్థ.. నార్సింగ్ టు చెరువును కబ్జా చేసి, దర్జాగా నిర్మాణ పనులు చేస్తుంటే ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం ఏమిటి..? మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై సమాధానం చెప్పగలరా అని హైడ్రా బారినపడి నష్టపోయిన బాధితులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.. వేల కోట్ల భూస్కాం చేస్తున్న ఫినిక్స్ అక్రమాలపై, ఈ సంస్థ డైరెక్టర్ వ్యవహరిస్తున్న చుక్కపల్లి అవినాష్ వ్యవహారంపై సిబిఐ, ఈడి అధికారులు దృష్టి సారిస్తే ఈ భారీ భూ స్కాంలో ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అమ్ముడుపోయిన అధికారుల బాగోతం బట్టబయలవుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.. సుమధుర నిర్మాణ సంస్థ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్ముతూ.. కోట్లు కొల్లగొడుతున్న ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ పై నేటికీ ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది..దీనితో ప్రభుత్వ అలసత్వం తేటతెల్లమవుతోంది.. తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు పాటించాల్సింది.. చట్టాలు అమలు అయ్యేది కేవలం సామాన్యులకేనా..? ఫినిక్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు చట్టాలు వర్తించవా..? వీరు పాటించాల్సిన అవసరం లేదా..? అనే బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. కళ్లెదుటే కబ్జాలు చేస్తూ యదేచ్చగా నిర్మాణ పనులు చేస్తూ ఉంటే, నేటికీ పనులు నిలుపుదల చేయకపోవడంపై అధికారుల అవినీతి ఏ మేరకు చేరింది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది..? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు చేసే అధికారుల జాడెక్కడ..? లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎంతకు అమ్ముడు పోయింది..?ఫీనిక్స్ నిర్మాణ సంస్థ కు అమ్ముడుపోయిన అధికారులు ఈ సంస్థ చేతిలో బందీలుగా మారి చర్యలు చేపట్టుటకు వెనుకడుగు వేస్తున్నారు అనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి..

పైగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగంగా కబ్జాకు గురైందని చెప్పినా నేటికీ చుక్కపల్లి అవినాష్ పై కేసు నమోదు చేయకపోవడం ఏంటని..? ఉపముఖ్యమంత్రి మాట ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదా అన్నది సామాన్యుల మనసులో ప్రశ్న మొదలైంది..

రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా, నేటికీ ఒక్క అధికారిపై చర్యలు చేపట్టకపోవడంపై మండి పడుతున్నారు పలువురు సామాజికవేత్తలు.. ఫినిక్స్ నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలపై, హైదరాబాద్ పరివాహక ప్రాంతంలో చుక్కపల్లి అవినాష్ తో కలసి మరికొంత మంది కలసి చేస్తున్న భూ కబ్జాల దందాపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్” ‘మా అక్షరం’ అవినీతిపై “అస్త్రం “

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS