- అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్
- మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా
- ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు
- గుంట భూమి.. గుండెకు ధైర్యం
- తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది
- సరికొత్త కొటేషన్లతో బురిడీ కొట్టిస్తున్న వైనం
- హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే అడ్వటైజ్మెంట్
- కలర్ ఫుల్ పాంప్లెట్స్ తో అమాయకులకు కుచ్చుటోఫీ
- రియల్ భూమ్ పేరిట సంస్థల బురిడీ
భూములు కొనడం, అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే మాట రియల్టర్లది. వాస్తవానికి అదీ నిజమా, అబద్ధమా అనేది అటుంచితే.. రియల్ ఎస్టేట్ సంస్థలు, ఏజెంట్లు, మధ్య దళారులు ఈ రకంగానే లక్షలకు సంపాదిస్తారు. కానీ పెట్టుబడి పెట్టినవారు పైకొచ్చిన దాఖలాలు ఎక్కడా కానరావు. ఒకవేళ ఉన్నా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ దానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు బాగా డెవలప్ అయ్యయి. సాప్ట్ వేర్ సహా ఇతర అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరంలో స్థాపించడం, సిటీలో మూడు లైన్ల మెట్రో సదుపాయం, పట్నం చుట్టూ ముట్టూ ఓఆర్ఆర్ ఉండడంతో ఓ రేంజ్ లో ఎదిగింది. ఇదంతా చూసి అమాయక, పేద ప్రజలు ఓ జాగనో, ఇంటి స్థలం, ఇల్లు కొనుక్కుంటే మా పిల్లలు, మేము స్థిరపడిపోవచ్చు అనే ఆశపడుతారు. ఎక్కడ తక్కువ ధరకు వచ్చిన ఎంతో కొంత దూరంలో ఉన్నది అయినా పర్లేదు అనుకుంటారు. ఇదే అదునుగా తీసుకొని కొందరు రియల్టర్లు రేపో, మాపో హైదరాబాద్ లో కలిసిపోతుంది, సిటీ పెరుగుతుంది అని నమ్మిబలికే మాయమాటలకు చాలా మంది బోల్తా పడుతున్నారు. మంచి మంచి కవితలతో కొటేషన్స్, కలర్ ఫుల్ బ్రోచర్లు, సెలబ్రెటీలతో యాడ్స్ చేయిస్తూ రియల్ ఎస్టేట్ సంస్థలు జనాన్ని దోచుకు తింటున్నాయి. హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, కనీస నియమ నిబంధనలు, ప్రభుత్వ గుర్తింపు లేనివి ఎన్నో కొత్త రకం భూదందా మొదలు పెడుతున్నాయి. ఇక ఒక్కటేంటి ఈ రకానికి చెందిన బోలెడన్నీ ఉన్నాయి.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో రియల్ భూమ్ పేరిట సరికొత్త దందా చేస్తున్నారు రియల్టర్లు. ఆయా సంస్థలు ఫేక్ ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. అందులో భాగంగా ఎస్.ఎల్.ఎన్ ప్రాపర్టీస్ పేరుతో మార్కెటింగ్ చేస్తుంది. పర్మిషన్స్ లేని 5 ఎకరాల స్థలాన్ని రియాల్టర్లు అమ్మకానికి పెట్టారు. సర్వే నెంబర్ 162 అత్వేలి గ్రామంలో ప్లాట్లు కొన్నవాళ్లంతా మోసపోతున్నారు. మేడ్చల్ పట్టణానికి అతి సమీపంలో తక్కువ ధరకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజులలో మరో సింగపూర్ సిటీ అవుతుంది గుంట భూమి గుండెకు ధైర్యం అంటూ అమాయక ప్రజలను ఆకట్టుకొని ఫ్రీ లాంచింగ్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి వసూల్ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అత్వెల్లిలో సర్వేనెం.162లో గల ఐదు ఎకరాల స్థలానికి ఎల్ పి నెంబర్ తీసుకొని హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయంటూ నామమాత్రంగా వెంచర్ చేసి రంగురంగుల జెండాలు పెట్టి ఆకర్షణమైన ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ మార్కెటింగ్ సంస్థ అమాయక ప్రజలను మోసం చేస్తున్నది.
తక్కువ ధరకు భూమి వస్తుందని చెప్పి చాలామంది రియల్ ఎస్టేట్ సంస్థలు మాటలకు బోల్తా పడ్డారు. శామీర్ పేట్, మేడ్చల్ సహా తదితర ప్రాంతాల ప్రజలను రియల్టర్లు బురిడీ కొట్టించారు. వెంచర్ లో ఫ్రీ లాంచింగ్ పేరుతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ తర్వాత అవుతలా పడ్డారు. డబ్బులు ముట్టజెప్పినంక రిజిస్ట్రేషన్ చేయమంటే రేపు, మాపు అంటూ నెలలు, ఏళ్లు తరబడి గడుపుకుంటూ పోతున్నారు. జాగ కోసమని డబ్బులు కట్టినా… రిజిస్ట్రేషన్ చేయకపోయేసరికి.. చివరకు మోసపోయమని తెలుసుకొని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీస్ స్టేషన్ లా చుట్టూ తిరుగుతున్నారు. ఫ్రీ లాంచ్ పేరుతో దగా మోసం జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. ఈ విధంగా ప్రాపర్టీ ఓనర్ ఒకరు, డెవలప్మెంట్ చేసేది మరొకరు, ఇక్కడ ఫ్లాట్లు తక్కువ ధరకే దొరుకుతాయంటూ మార్కెటింగ్ చేసేది బ్రోకర్లు. ఇలా అమాయక ప్రజలు మోసపోతున్నారు. భూమి కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాం కదా ఆ ల్యాండ్ నాదే అనే భ్రమలో ఉంటున్నారు. కానీ చివరకు మోసపోయేమని తెలుసుకొని లబోదిబోమంటున్నారు.
ఇకనైన ఎవరైనా, ఎక్కడైనా భూమి కొనుగోలు చేయాలంటే దానికి ప్రభుత్వ గుర్తింపు ఉన్నదా, హెచ్ఎండీఏ పర్మిషన్ ఉన్నదా ఇలాంటి వన్ని పూర్తిగా తెలుసుకొని, దీనిపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ నుంచి సమాచారం తీసుకొని జాగ కొనుగోలు చేయాలి. అమాయక ప్రజలు తస్మాత్ జాగ్రత్త.. ఫ్రీ లాంచింగ్ పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలు, రియల్టర్లు, మధ్యవర్తులు కళ్లబొల్లి కబుర్లు చెప్పి మోసాలకు గురి చేస్తారు. అమాయక ఇలాంటి వారికి అమాయక జనం బలి కావద్దంటూ సూచిస్తూ మీకోసం ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం.