- బీసీల లెక్కలు అధికారికంగా వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నాం..
- 2014 కులగణన సర్వే వివరాలను సైతం బహిర్గతం చేయాలి..
- ప్రభుత్వం రెండు నివేదికలతో కూడిన శ్వేత పత్రాన్ని విడుదల చేయాలి.. ..
- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్
బీసీల రాజకీయ అవకాశాలను హరిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కాలగర్భంలో కలవక తప్పదని, అందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అతీతం ఏమీ కావని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ సోమవారం బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన కమిటీ నియామక సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన కుల గణన సర్వే వివరాలపై తమ సందేశాలను మీడియా ముఖంగా వెల్లడించారు . గతంలో టిఆర్ఎస్ సర్కార్ 2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలను నేటికీ అధికారికంగా వెల్లడించకపోవడం ప్రజలను మభ్య పెట్టడమే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో అనేక కుటుంబాలను అధికారులు సంప్రదించకపోవడం, గతం సమగ్ర కులగణన సర్వేలో (2014) 51 శాతం ఉన్న హిందూ BC జనాభా, నేడు 46 శాతానికి తగ్గటం ఇదే క్రమంలో గతంలో 8 శాతం ఉన్న హిందూ ఓసీ జనాభా ప్రస్తుతం 13 శాతానికి ఎగబాకటాన్ని చూస్తే ఈ లెక్కలు పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. ఈ సందేహాలను నివృత్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం గతంలో(2014) నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను అధికారికంగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలపై స్పష్టతను తీసుకురావడానికి ప్రజా సంఘాలతో,రిటైర్డ్ న్యాయ నిపుణులతో,ప్రొఫెసర్లతో ఒక కమిటీని ఏర్పరిచి నిజా నిజాలను నెగ్గు తేల్చాలి అన్నారు.