- అభిప్రాయపడ్డ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్
పోలీస్ శాఖలో అవసరమైన సంస్కరణలపై చర్చించడం ద్వారా ప్రజల సంక్షేమం కోసం మెరుగైన పోలీసింగ్‌ను చేపట్టాల్సి ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్(Director General of Police Jitender) అభిప్రాయపడ్డారు. ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం “పోలీస్ సంస్కరణల ద్వారా మెరుగైన పోలీసింగ్” అనే అంశంపై సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈష్ కుమార్ ఉపాధ్యక్షులుగా ఉన్న ఐపిఎఫ్ పోలీస్ సంస్కరణలపై పరిశోధన చేస్తున్న సంస్థ. ఈ సంస్థలో రిటైర్డ్, ప్రస్తుతం పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. పోలీస్ శాఖలో అంతర్గత సంస్కరణలు, సాంకేతిక పోలీసింగ్, జైల శాఖలో సంస్కరణలు, ఫోరెన్సిక్ సైన్సెస్ లో పరిశోధన, మహిళలపై నేరాలు, పోలీసుల ఆరోగ్యం వంటి ఆరు అంశాలపై ఐపీఎఫ్ పరిశోధనలు చేస్తుంది. ఈ సందర్భంగా డిజిపి జితేందర్ మాట్లాడుతూ.. పోలీసు శాఖ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం ద్వారా పోలీసింగ్ మెరుగుపరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లను, పోలీస్ కార్యాలయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసినట్లయితే కొంత మార్పు జరుగుతుందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ను అగ్రభాగాన నిలిపేందుకు నూతన విధానాలను అవలంబిస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని డిజిపి తెలిపారు. బాధితుల పట్ల సానుకూలంగా స్పందించడం, నైపుణ్యత తో కూడిన దర్యాప్తు, కమ్యూనిటీ పోలీసింగ్, పోలీసుల ప్రవర్తన వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నామని డిజిపి అన్నారు. బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వృత్తిపరంగా, నైతికంగా పోలీస్ సిబ్బంది ఉన్నతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజల ఫిర్యాదులపై ఎఫ్ ఐ ఆర్ చేయాలని, మహిళల భద్రత కు ప్రాధాన్యత ఇవ్వాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా పోలీస్ శాఖకు సిబ్బంది మంచి పేరు తేవాల్సి ఉందని అన్నారు. ఐపీఎఫ్ ఉపాధ్యక్షులు ఈశ్ కుమార్ మాట్లాడుతూ.. అంతర్గత పోలీస్ సంస్కరణల ప్రాజెక్టు పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నోడల్ అధికారిగా పోలీస్ ట్రైనింగ్ డిజిపి అభిలాష బిస్త్ వ్యవహరిస్తుండగా రిటైర్డ్ ఎస్పి ఎం మల్లారెడ్డి పర్యవేక్షణ అధికారిగా ఉన్నారని తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజల అభిప్రాయాలు సేకరించి తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. డిజిపిలు అభిలాష బిష్త్, శిఖా గోయల్, అదనపు డిజిపిలు, సంజయ్ కుమార్ జైన్, స్వాతి లక్రా, ఐజీపీలు ఎం. రమేష్, ఎస్. చంద్రశేఖర్ రెడ్డి , వి .సత్యనారాయణ, రమేష్ నాయుడు, డి ఐ జి గజరావు భూపాల్, రిటైర్డ్ ఎస్పీ ఎం .మల్లారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.