- టాక్స్ ఫిక్సేషన్‌కు సంబంధించిన రికార్డులు తీకుకెళ్లిన జిల్లా పంచాయత్ రాజ్ అధికారి ఆర్.సునంద
- దివీస్ కంపెనీ జీపీకి చెల్లించాల్సిన పన్ను కుదింపు
- భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం
- లెక్కలు తారుమారుచేసిన అప్పటి డీఎల్‌పీఓ, ఎంపీఓ, కార్యదర్శి, సర్పంచ్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు
- దివిస్ పరిశ్రమకు సునంద ఆద్వర్యంలోని కమిటీనే ట్యాక్ ఫిక్సేషన్
- డొల్లతనం బట్టబయలు కావడంతో ఉరుకుల పరుగులు
- ఈ క్రమంలో దివిస్ టాక్స్ దస్త్రాలను మార్చే యత్నం
- ఉన్నతాధికారులు దృష్టిసారించి అక్రమాలు గుర్తించాలి
- డీపీఓ ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీ తీర్మానం – సర్పంచ్
‘మంచోళ్ళకు మాటలతోను.. మొండోళ్ళకు మొట్టికాయలు వేసి చెప్పాలి’ అంటారు అట్లనే సర్కారుకు ఖజానాకు భారీగా గండీ పెడుతున్న డీపీఓ బండారం బయటపెట్టిన ‘ఆదాబ్ కథనానికి’ ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతుండ్రు. చౌటుప్పల్ పరిధిలోని అంకిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో ఉన్న దివీస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం దగ్గర ముడుపులు తీసుకొని కోట్లాది రూపాయలు పన్నులు ఎగ్గొట్టేలా చేసిన డీపీఓ ఆర్.సునందపై వచ్చిన ఆరోపణలను ఆధారంగా తీసుకొని ఆదాబ్ హైదరాబాద్ శుక్రవారం వెలువడిన పత్రికలో ‘ఆస్తి పన్నులో భారీ స్కాం’ అనే శీర్షికతో వార్తను ప్రచురించడం జరిగింది. దివీస్ ల్యాబోరేటరీ కంపెనీకి చెందిన 91.06 ఎకరాల భూమికి గజానికి రూ.1500లు చొప్పున పన్నుఫిక్సేషన్ లో తగ్గించి, అప్పటి డీపీఓ, ఎంపీడీఓ దివీస్ లాబోరేటరీతో జతకట్టి ఆస్తి పన్ను మూలధనం విలువ రూ. 1 వేసే చోటా 20 పైసలు మాత్రం వేసి కంపెనీకి భారీ ఎత్తున పన్ను తగ్గించి సంస్థకు లాభాలు చేకూర్చింది. ఈ విషయంపై అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్‌ను ఆదాబ్ ప్రతినిధి వివరాలు కోరగా డీపీఓ ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీ తీర్మానం చేసినట్లు సదరు సర్పంచ్ వెల్లడించారు.
అయితే ఈ నేపథ్యంలో డొల్లతనం బయటపడడంతో డీపీఓ ఆర్.సునంద కార్యాలయంలోని రికార్డులను ఎత్తుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదాబ్ కథనంతో నిజం బయటపడితే కటకటాల్లోకి వెళ్లి జైళ్లో ఊసలు లెక్కపెట్టాల్సిన దుస్థితి ఏర్పడుతుందని తెలిసి ఆగమేఘాల మీద ఆఫీసులోని దస్త్రాలను మాయం చేశారు. ఆర్. సునంద పైనే టాక్స్ ఫిక్సేషన్లో భారీ ఎత్తున ముడుపులు తీసుకొని, పరిశ్రమకు తక్కువ పన్ను ఫిక్స్ చేసినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. అలాంటప్పుడు ఆ టాక్స్‌కు సంబంధించిన ఫైల్స్ ను సునంద ఎలా తీసుకెళ్తారు..? ఆమెకు ఫైల్స్ మాయం చేయమని ఆదేశించిన ఆ అధికారి ఎవరు..? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’ అన్నట్టు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న గవర్నమెంట్ ఆఫీసర్ లే ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారు. ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి సుమారు రూ. 14, 43,83,148 లు పన్ను మదింపు చేసి సర్కార్ ఖజానాకు గండిపెట్టిన ఈవిడగారు దాన్ని కప్పిపుచ్చుకునే పనిలో పడ్డట్లు అర్థమవుతోంది. అప్పటి ఓ ఉన్నతాధికారి సహా డీఎల్‌పీఓ, ఎంపీఓ, కార్యదర్శి, సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ తతంగం అంతా నడిపినట్లు తెలుస్తోంది. ఒక్క రూపాయికి కేవలం 20పైసలు మాత్రం లెక్కల్లో రాసి నాన్ కమర్షియల్ కింద చూపి రూ. 72,68,791 లు ట్యాక్స్ వచ్చేలా భారీ కుంభకోణానికి పాల్పడ్డ మేడంకు దివీస్ కంపెనీ ద్వారా పెద్ద ఎత్తున ముడుపులు అందినట్లు కీలక సమాచారం. అంత పెద్ద మొత్తం తగ్గించేలా కృషిచేసిన డీపీఓ సునందకు సహకరించిన ఉన్నతాధికారి, కిందిస్థాయి వారికి సైతం తగిన రీతిలో లాభం చేకూరినట్లు తెలుస్తోంది.
ఆదాబ్ లో వచ్చిన వార్తకు వీళ్ల బాగోతం బట్టబయలు కావడంతో అధికారులు అంతా ఆగమాగం అవుతూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ‘బతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు పీకినాయన్నట్టు’ డబ్బుల సంపాదనే ధ్యేయంగా తప్పుజేసి తీరా దాన్ని తప్పించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏం లాభం. దివీస్ ల్యాబోరేటరీ ఈ పన్ను ఎగనామం పెట్టే దాంట్లో డీపీఓ, డీఎల్‌పీఓ, ఎంపీవో, కార్యదర్శి కాక ఇంకా ఎవరెవరో ఉన్నారో వాళ్ల లెక్కలు తేల్చెపనిలో ఉంటుంది ఆదాబ్ హైదరాబాద్.
శెభాష్ మేం మంచి పని చేసినంలే మమ్ముల్ని ఎవరూ దొరకబట్టరులే అనుకుంటే అదీ ఎప్పటికీ పొరపాటే. ప్రభుత్వ కొలువు జేసే అధికారులు ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి పలానా కంపెనీకి, వ్యక్తికి సహకరిస్తే మంచిగ పైసలు ఇస్తడు అని అక్రమాలకు తావిస్తే రేపటి రోజు ఉయ్యాలే ఉరితాడు అవుతుందని గుర్తెరగాలె. ‘పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదులే అనుకుంటే పొరపాటే.. మీసాలకు అంటిన పాలను చూసి గుర్తుపట్ట లేడా యజమాని. డీపీఓ ఆర్.సునంద, డీఎల్‌పీఓ, ఎంపీఓ, కార్యదర్శి వీళ్ల పాపం పండే రోజు వచ్చింది కాబట్టే దివీస్ కంపెనీకి అప్పన్నంగా అమ్ముడుపోయి సుమారు రూ.72లక్షలకు ట్యాక్స్ ఫిక్స్ చేసిన వారిపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు దృష్టిసారించి పూర్తిగా దర్యాప్తు జరిపించి అక్రమాలకు పాల్పడ్డ అధికారులందరిపై చట్టరిత్యా చర్యలు తీసుకోని, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ సమగ్రంగా దర్యాప్తు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.