- ఒక్క పథకాన్ని ఇద్దరికి పంచిపెట్టిన నాయకులు
- ఓటు బ్యాంకు కోసం లీడర్ల అత్యుత్సాహం
- అసలైన లబ్ధిదారుడికి తీవ్ర నష్టం
- విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి..!
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పేద, బలహీన బీసీ కుల వృత్తిదారులకు బీసీ బందు పథకం ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సాయాన్ని వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసేందుకు 100% సబ్సిడీతో అందించింది. పాపన్నపేట మండలానికి సంబంధించి సుమారు 169 మందికి బిసి బందు వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు హడావిడిగా ప్రవేశపెట్టిన ఈ పథకం కింద లబ్ధిదారులకు ఇవ్వవలసిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామ స్థాయిలో అక్కడక్కడ కొన్ని గ్రామాల సర్పంచులు, పార్టీ పెద్దలు అత్యుత్సాహం ప్రదర్శించి అసలైన లబ్ధిదారుల నుంచి 50 వేల రూపాయలను అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి పంచి పెట్టి ఓటు బ్యాంకు కోసం రెండు కుటుంబాలను తమకు అనుకూలంగా మలుచుకున్నారన్న ఆరోపణలు ఒక్కొక్కటిగా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పాపన్నపేట గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులు తమ ప్రమేయం లేకుండానే తమ పేర్ల పైన విత్ డ్రా అయ్యాయని ఆందోళన చేస్తున్న క్రమంలో బీసీ బంధును చెరోసగం పంచి పెట్టిన సంఘటనలు మండల వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. గత ప్రభుత్వం ఒక లబ్ధిదారుడికి వివిధ యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి సబ్సిడీతో లక్ష రూపాయలు సహాయాన్ని అందిస్తే రెండు కుటుంబాలకు పంచడం వలన యంత్ర పరికరాలు ఎలా కొనుగోలు చేయొచ్చనే చర్చ సాగుతుంది. అధికారం చేతిలో ఉందని కొంతమంది నాయకులు అనాలోచితంగా వ్యవహరించడం వలన రాబోవు పథకాలకు గత ప్రభుత్వంలో లబ్ధి పొందిన పథకాలతో ముడిపెడితే అసలు లబ్ధిదారునికి నష్టం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా బీసీ బందు నుండి సగం పంచుకున్న రెండవ సగం లబ్ధిదారుడు రాబోయే పథకంలో లబ్ధి పొందితే తనకు పంచి ఇచ్చిన వ్యక్తికి తిరిగి తనకు లబ్ధి జరిగిన పథకం నుంచి సగం ఇచ్చేస్తాడా..? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని గ్రామాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు బీసీ బందు తీసుకున్నారని ఆరోపణ లు ఉండగా, వారు తీసుకున్న బీసీ బందు లక్ష రూపా యల్లో మాత్రం పంపకాలు జరగకపోవడం గమనా ర్హం. మరోవైపు కొంతమంది యూసీలు సైతం ఇవ్వలే దని తెలుస్తోంది. ఇదే అంశంపైన జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.