తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ బీఆర్ఎస్ పార్టీ వేసిన కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా… సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు నాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం… సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా? అని ప్రశ్నించింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని… స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పీకర్ సమయం నిర్దేశించకుంటే… తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.