- వైద్యాధికారి నియామకంలో అధికారుల నిర్లక్ష్యం
- సకాలంలో అందని వైద్య సేవలు
- ఆందోళనలో పశుపోషకులు
గ్రామాల్లో వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.పశువైద్యశాలల్లో సిబ్బంది కొరత కారణంగా మూగజీవాలకు వైద్య సేవలు అందించేవారే కరువయ్యారు.గ్రామీణ ప్రాంత రైతులకు పాడి,పంట రెండు కళ్ళలాంటివని భావిస్తూ పాడి పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుకుంటారు.అలాంటి పాడి పశువులకు రోగం వస్తే వైద్యం చేసే దిక్కు లేదంటూ వాపోతున్నారు.వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన పశువులకు సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయంటూ రైతులు లబో,దిబోమంటున్నారు.పాలకులకు మూగరోధన వినిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
పాలకవీడు మండలంలో పశు వైద్యశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ లో ప్రాథమిక పశు వైద్య కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పశు వైద్యాధికారి 2 నెలల క్రితం రాజీనామా చేసి వెళ్లిపోయారు.అప్పటి నుండి ఇప్పటివరకు మండల పశు వైద్యాధికారిని నియమించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారు.మండలంలో పశు వైద్యాధికారితో పాటు సిబ్బంది లేకపోవడంతో గ్రామాలలో మూగజీవాలకు రోగాలు వస్తే అంతే సంగతులు.గత్యంతరం లేక పశు వైద్యశాలకు అటెండర్ దిక్కుగా మారారు.
ఇంచార్జ్ ఆధీనంలో పశు వైద్యశాల: జాన్ పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పశువైద్యాధికారి లేకపోవడంతో ఉన్నతాధికారులు గరిడేపల్లి మండలం కల్మల్ చెర్వు పశువైద్యాధికారిని ఇన్చార్జిగా నియమించారు.సదరు వైద్యాధికారికి ప్రస్తుతం ఉన్నచోటే పని భారంతో ఇక్కడ ఇన్చార్జ్ బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.పశుపోషకులు అధికంగా ఉన్న పాలకవీడు మండలంలో పశు వైద్యశాలకు వైద్యాధికారి,సిబ్బంది లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
పశు సంపద వివరాలిలా:
పాలకవీడు మండలంలోని 22 గ్రామాలలో గేదె జాతి 6142, ఆవులు 4632, మేకలు 7236, గొర్రెలు 8810, కోళ్లు 11690.
-పాడి పశువులను అమ్ముకుంటున్నాం:
20 ఏళ్ల నుంచి వ్యవసాయంతో పాటు పాల వ్యాపారం చేస్తున్నాను.8 గేదెలు, 4 ఆవులు ఉన్నాయి. పశువులు అనారోగ్యానికి గురైతే డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు.ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నాం.వారు కూడా సమయానికి రావడం లేదు.దీంతో పశువులు చనిపోతున్నాయి.ఏం చేయాలో తెలియక ఒక్కొక్కటిగా అమ్మేసుకుంటున్నాము.మాలాంటి పాల రైతులు పశు వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వైద్యాధికారితో పాటు సిబ్బందిని నియమించి పశు సంపదను కాపాడాలని కోరుతున్నాను. – బొమ్మకంటి.సైదులు జాన్ పహాడ్
సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా:
మండలంలో పశుపోషకులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆస్పత్రిలో డాక్టర్ తో పాటు సిబ్బందిని నియమించే విధంగా నా వంతు కృషి చేస్తా. – ఇంచార్జ్ పశు వైద్యాధికారి టి.సురేష్.