Saturday, March 1, 2025
spot_img

అవినీతి అధికారి ఆస్తుల విలువ రూ. 50 కోట్లు

Must Read
  • లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు రూ. 50 కోట్లు!
  • రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు..
  • హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో విపరీతంగా భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు లభ్యం!
  • ఇంకా బ్యాంకు లాకర్లు, అకౌంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ..
  • డేలివేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్ మేనేజర్ వరకు అన్ని అడ్డదారులే..!
  • శిష్యుని ఆస్తి రూ.50 కోట్లు అయితే, మరి ఈయన గురువు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నట్లు..?

తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) లో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బొప్పూరి ఆనంద్ కుమార్ ఈనెల 20న ఓ వ్యక్తి నుండి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ, తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ను అధికారులు రిమాండ్ కు తరలించిన అనంతరం నాగోలు ప్రాంతంలోని ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించి, ఆయన ఆస్తుల విలువ లెక్కగడుతున్నట్లు తెలుస్తోంది.

ఏసీబీ సోదాల్లో ఆనంద్ కుమార్ ఇంట్లో అనేక భూముల కొనుగోళ్ల డాక్యుమెంట్లు లభించినట్లు సమాచారం! సంబంధిత భూముల ఆస్తుల విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిసింది. సోమవారం బ్యాంక్ లాకర్లు అకౌంట్లు తనిఖీ చేస్తే, మరిన్ని వివరాలు లభ్యమయ్యే అవకాశం లేకపోలేదని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

డేలివేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్ మేనేజర్ వరకు అన్ని అడ్డదారులే..!
ఆనంద్ కుమార్ విధులు నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన సహచర ఉద్యోగుల నడుమ ఈయన ఉద్యోగ ప్రస్థానంపై తీవ్రమైన చర్చ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆనంద్ కుమార్ మొదట ఈ కార్పొరేషన్ లోకి డైలీవేజ్ ఉద్యోగి (ఎన్.ఎం.ఆర్) గా మొదలుపెట్టి, అనతి కాలంలోనే తన స్థాయి ఉద్యోగులను పక్కకు నెడుతూ అంచలంచెలుగా ఎగబాకుతూ అక్రమ మార్గాన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళాడని, ఒకానొక దశలో ఈయన ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈ.ఓ)గా ఉన్నప్పుడు కార్పొరేషన్ రూల్స్ కు విరుద్ధంగా, ఏకంగా 9 నెలల పాటు కార్పొరేషన్ కు ఎం.డిగా అదనపు బాధ్యతలు సైతం నిర్వహించినట్లు తెలుస్తోంది.

గతంలో సాంఘిక సంక్షేమ శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ అధికారితో ఆనంద్ చేతులు కలిపి, ఇద్దరు ఒకటై అప్పటికే ఎస్సీ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ గిరిజన ఐ.ఆర్.ఎస్ స్థాయి అధికారిని ఈ ఇద్దరు పలు విషయాల్లో ఆయనను ఇరికించి, అతనిపై వార్తలు రాయించి ఆ గిరిజన అధికారి ఇక్కడి నుండి పక్కా స్కెచ్ వేసి తప్పించినట్లు సమాచారం! అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సదరు సాంఘిక సంక్షేమ శాఖ నాటి అడిషనల్ డైరెక్టర్, ఆనంద్ ఇరువురు నాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలతో చేతులు కలిపి, సుమారు మూడున్నర సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ ను వీళ్ళు ఏలేశారు. ఇక్కడ వీళ్ళు చెప్పిందే వేదం.. వీళ్ళు రాసిందే రాజ్యాంగం… అన్నట్లుగా ఎస్సీ కార్పొరేషన్ ను నిలువునా దోపిడీ చేశారు.

వీళ్ళ ఇరువురి హాయంలో డ్రైవర్ ఎంపవర్మెంట్, దళిత బంధు, పైలట్ ప్రాజెక్టులు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు తదితర పథకాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించడం వీళ్లకు ఒక వరంగా మారింది. ఇక్కడ ప్రతి పనికి వీరిద్దరూ ఒక పర్సంటేజీని నిర్ణయించారు. తద్వారా గురు శిష్యులు ఇరువురు అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తారని ఇక్కడి ఉద్యోగులందరూ గత మూడు రోజులుగా చర్చించుకోవడం గమనార్హం.

శిష్యుని ఆస్తి రూ. 50 కోట్ల అయితే.. మరి గురువు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నట్లు..?
ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు సుమారు రూ.50 కోట్లు అయితే, మరి ఈయన గురువైన రిటైర్డ్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఎం.డి దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి..? ఇద్దరు కలిసి కార్పొరేషన్ లో సుమారు రూ.100 కోట్ల వరకు దోపిడీ చేసి ఉండొచ్చునని సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులు కొద్దిమంది లెక్కలు వేస్తున్నారంటే వినేవారికి ఆశ్చర్యం కలుగక మానదు.

“గురు శిష్యుల బంధం @ 100 కోట్లు” అనే వార్త అంశంపై త్వరలోనే చర్చిద్దాం!

Latest News

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS