- హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడకం
- పరిమితికి మించి వాడకంతో ఆరోగ్యం హాం ఫట్
- జిల్లా కేంద్రం నుండి మొదలుకొని గ్రామాల వరకు భారీగా వెలసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లు
- టేస్టింగ్ సాల్ట్ వాడకంపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువు
- వికారాబాద్ జిల్లాలో ఇంతకీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారా..?
వికారాబాద్ జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చల విడిగా వెలిశాయి. ఇందులో వంటల రుచి కోసం వివిధ రకాల పొడులతో పాటు అజీనామోటో (టేస్టింగ్ సాల్ట్)ను విరివిగా వాడుతున్నారు. అజీనామోటో అంటే చాలా మందికి తెలియదు. దీనినే మోనోసోడియం గ్లూటమేట్ అంటారు. అందరికీ తెలియని పదం టేస్టింగ్ (కిల్లింగ్) సాల్ట్. అంటే ఇదో రకమైన ఉప్పు. దీనిని అందరూ వంటలో రుచి కోసం వేసే ఉప్పు అనుకుంటారు. కానీ రుచి సంగతి దేవుడెరుగు.. ఇదో విష పదార్థం. దీని వాడకంతో చక్కని రుచి ఏమో కానీ అనారోగ్యం కలిగించే హాని మాత్రం అంతా ఇంతా కాదు. దీనిని ఎక్కువగా తినడంతో మైగ్రేన్, బద్ధకంగా ఉండడం, వికారం, నీరసం, ఛాతి నొప్పి తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే టేస్టింగ్ సాల్ట్ వాడకం పెరిగిందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో దీని వాడకం ఎక్కువగా కనిపిస్తుంది.
టేస్టింగ్ సాల్ట్‌తో దుష్ప్రభావాలు అనేకం..
అజినోమోటోను రోజూ తీసుకోవడంతో చెమట సమస్య వస్తుంది. శరీరంలో డీహైడ్రేషన్ కారణంగా అలసటకు దారితీయవచ్చు. కీళ్లు, కండరాల నొప్పులు కూడా వస్తాయి. కొంతమందికి కడుపులో మంటకు కూడా దారితీయవచ్చు. అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ మొదలైన ఇతర సమస్యలు కూడా వస్తాయి. రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. మైగ్రేన్ లేదా తీవ్రమైన తలనొప్పి కనిపిస్తుంది. నిద్ర సమయంలో శ్వాస సమస్యలకు దారితీస్తుంది. అజినోమోటోను ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలను పునరుత్పత్తి చేసి కొలొరెక్టల్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
విచ్చలవిడిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు..
చిన్నలు, పెద్దలు ఫ్రైడ్ రైస్, నూడిల్స్, మంచూరియా వంటివి ఎంతో ఇష్టంగా తింటారు. వీటిలో టేస్ట్ కోసం మోతాదుకు మించి అజీనా మోటో వేస్తున్నారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో, ఆయా గ్రామాల్లో లెక్కలేనన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. ఒక్కో సెంటర్‌లో రోజూ 500 గ్రాముల కంటే ఎక్కువగానే వాడుతున్నట్లు సమాచారం.
పరిమితికి మించి వాడకం..
ఏదైనా పరిమితికి మించి వాడితే ఆరోగ్యానికి ముప్పేనని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఆహారంలో 0.5 గ్రాముల టేస్టింగ్ సాల్ట్‌ను వాడకం సురక్షితమైన పరిమితి. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు కస్టమర్లను పెంచుకునేందుకు సింగిల్ ప్రైడ్ రైస్‌లో ఒక స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు. ఎంతలా దీని వినియోగం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి అజినోమోటోను అధిక శాతం వినియోగిస్తే శరీరానికి హానికరం. ముఖ్యంగా గర్భిణులు అజినోమోటోకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇది వారికి, పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అధికారుల నిఘా కరువు..
ఆహార కల్తీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అధికారులు.. తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. నిఘా లేనందునే టేస్టింగ్ సాల్ట్ వినియోగం పెరిగిందని పలువురు విమర్శిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అసలు తనిఖీలు చేస్తున్నారా? అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిఘా కరువవ్వడంతోనే ఫాస్ట్ ఫుడ్ దందా మూడు మంచూరియాలు, ఆరు నూడిల్స్‌గా సాగుతుందని పలువురు పేర్కొంటున్నారు.