విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్
తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు రాష్ట్రంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని డైరీ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. విజయ బ్రాండ్, లాఫింగ్ కౌ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కు అని దానిని ఏ ప్రైవేట్ డైరీలో వినియోగించడం చట్టరీత్య నేరమన్నారు. లాలాపేట్ లోని విజయ డైరీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి డెయిరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాట్లాడారు. విజయ బ్రాండ్ ను కాపీ చేసి ప్రైవేటు డైరీలు వాడడం నేరమని తెలిపారు. తెలంగాణ కోపరేటివ్ సొసైటీ చట్టం 1964 ప్రకారం ఫెడరేషన్ ప్రారంభమైందని చెప్పారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రాల విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల్లో వేరువేరుగా సంబంధిత ఫెడరేషన్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. విజయ బ్రాండ్ అనేది ఇప్పటికీ ఉమ్మడి హక్కుగానే ఉందని అన్నారు. మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 1995 ప్రకారం స్వయం ప్రతిపత్తి తో పనిచేస్తున్న జిల్లాల పాల యూనియన్లు విజయ బ్రాండ్ ను వినియోగించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. విజయ బ్రాండ్ ను వినియోగించుకునేందుకు ఏ జిల్లా యూనియన్లకు సైతం అనుమతించలేదని పేర్కొన్నారు. కానీ రెండు రాష్ట్రాలలోని కొన్ని జిల్లా యూనియన్లు విజయ బ్రాండ్ ను చట్ట విరుద్ధంగా వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే సిటీ సివిల్ కోర్టును తాము ఆశ్రయించగా విజయ బ్రాండ్ ను అనుకరించే ఏ ఉత్పత్తులను తయారు చేయడం, విక్రయించడానికి చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులను రెండు రోజుల క్రితం జారీ చేసిందని తెలిపారు.

ఇప్పటివరకు కర్నూలు జిల్లా పరస్పర సహాయ సహకార సంఘం, విఎన్ఆర్ డెయిరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణా జిల్లా పాల ఉత్పత్తి పరస్పర సహాయ సహకార సంఘం, శ్రీ సాయి దుర్గ ఎంటర్ప్రైజెస్, నెల్లూరు జిల్లా పరస్పర సహాయ సహకార పాల ఉత్పత్తి యూనియన్ లిమిటెడ్, ఆల్ రిచ్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, విజయ మిల్క్ ప్రొడక్ట్స్, నార్మల్ మదర్ డెయిరీ తదితర సంస్థలు విజయ బ్రాండ్ ను అక్రమంగా వాడుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చిందని వివరించారు. కోర్టు ఆదేశాల ప్రకారం పై సంస్థలతోపాటు ఏ ఇతర సంస్థలు విజయ బ్రాండ్ ను ఏ రకంగా వినియోగించిన చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని చెప్పారు. తమ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో తెలంగాణ పాడి రైతుల నుండి పాలు కొనుగోలు చేసి, నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోందని అన్నారు. విజయ బ్రాండ్ నాణ్యతకు, ప్రజల నమ్మకానికి చిరునామాగా మారిందని అభిప్రాయపడ్డారు. విజయ బ్రాండ్ ను వినియోగించుకుంటున్న ఇతర సంస్థల వలన ప్రజలు తమపై పెంచుకున్న విశ్వాసానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెయిరీలు నాణ్యత పాటించకుండా పాలు, ఇతర పాల ఉత్పత్తులను రూపొందించే ప్రమాదం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండి విజయ తెలంగాణ బ్రాండ్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని వినియోగదారులు, విక్రేతలు, పంపిణీ దారులు అందరూ విజయ తెలంగాణ పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల తెలంగాణ పాడి రైతులకు మద్దతు ఇవ్వడమే కాకుండా రాష్ట్ర డెయిరీ రంగ అభివృద్ధికి తోడ్పడుతూ, రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందించినవారిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా 9121160569 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.