- విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మ్యాస్ టీచర్..
- టీచర్‌కి దేహ శుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు..
- మందుల సామేల్ నియోజకవర్గంలో ఘటన…
- రాజీ కుదుర్చిన మాజీ ప్రజాప్రతినిధి…
- విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ…
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే విద్యాశాఖ..
- ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్న పట్టించుకోని అధికారులు
గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు రక్షణ కరువైంది. తండ్రి కన్న మిన్నగా చూడాల్సిన గురువు పాసవికంగా ప్రవర్తించి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారిపై అగయిత్యాలు పాల్పడడంతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎదుటివారిని నమ్మి ఆడపిల్లలను కనీసం పాఠశాలకు పంపలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. కొందరు ఏకంగా చదువుకు దూరమైన పరిస్థితులు కూడా పలుచోట్ల దర్శనమిస్తున్నాయి. అలాంటి శోచనీయ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి 21 న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అధికారుల సూచనలతో డ్యూటీలు వదిలు..
ఫిబ్రవరి 21వ తేదీన ఈ సంఘటన జరగగా, మండల కేంద్రంలో ఓ ప్రజా ప్రతినిధి కల్పించుకొని, విద్యార్థిని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సంబంధిత శాఖ అధికారులను నోరు మూయించి, సదరు ఉపాధ్యాయుడను అక్కడి నుండి పంపించేశారు. సంబంధిత శాఖ అధికారుల సూచనలతో (అండతో) నాటి నుంచి నేటి వరకు సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్ళాక పోవడం, ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి నోరు మెదపకపోవడంతో జిల్లాలో చర్చనీయంగా మారింది. మండల విద్యాధికారి లింగయ్య ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
పాఠశాలలో ఘటన జరిగిన తీరు..
కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడు అయిన శ్రీనివాస్, పదవ తరగతి విద్యార్థినీల పట్ల గత కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం స్టడీ అవర్ నిర్వహిస్తుండగా తన పుస్తకం కోసం గదిలోకి వెళ్లిన విద్యార్థిని, వెనకాలే వెళ్లిన ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడని, దీంతో ఆ విద్యార్థిని బయటకు వచ్చి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిందని తెలిపారు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు విషయం తెలుపగా కుటుంబ సభ్యులు బంధువులు కలిసి పాఠశాలకు వచ్చి సదరు ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా తప్పు జరిగిందని నన్ను క్షమించమని వారి కాళ్లపై పడి నట్లు సమాచారం. దీంతో కోపద్రిక్తులైనటువంటి బంధువులు ఉపాధ్యాయుడికి బడితే పూజ చేసి, ఆ ఉపాధ్యాయుడని గ్రామానికి చెందిన ఒక పెద్ద మనిషికి అప్పచెప్పారు. మరుసటి రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి వివాదం సద్దుమనిపించారు. ఇదే విషయం బయటకు రాకుండా ఉండేందుకు మండల, జిల్లా అధికారులకు సైతం ముడుపులు ముట్ట చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే ఉపాధ్యాయుడు గతంలో పనిచేసిన చోట ఒక వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెండ్ కు గురయ్యాడు. విషయం తెలిసిన స్థానిక ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాధికారి తనకి ఏమీ తెలియదని మాట్లాడడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. పదో తరగతి పరీక్షల సమయంలో స్కూల్ కి వెళ్లకుండా తొమ్మిది రోజులపాటు పాఠశాలకు డుమ్మా కొట్టి, బయట తిరుగుతున్న ఉపాధ్యాయుడికి సహకరిస్తున్న సంబంధిత శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
ఈ విషయంపై స్థానిక ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లింగయ్యను వివరణ కోరగా విద్యార్థిని సాయంత్రం స్టడీ అవర్స్ కి రాకపోతే ఉపాధ్యాయుడు మందలించడంతో విద్యార్థిని తల్లిదండ్రులు వచ్చి గోల చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయుడు ఫిబ్రవరి 21 నుండి మార్చి ఒకటో తేదీ వరకు స్కూలుకు రాలేదని అడిగిన విషయంపై అతను హెల్త్ ప్రాబ్లం వల్ల సెలవులు పెట్టుకున్నారని,అలా అని ప్రధానోపాధ్యాయుడికి సెలవు చిట్టి పెట్టారని తెలిపారు. జరిగిన సంఘటన గూర్చి జిల్లా అధికారులకు తెలపాల్సిన అవసరం లేదన్నారు.
ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ ను చరవాణి ద్వారా వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.