- రోలింగ్ మిడోస్ ఆలె ఇన్‌ఫ్రాలో విల్లాలు కొంటే మోసపోవాల్సిందే..
- మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బంధువు అంటూ అక్రమ దందా..!
- 6 ఎకరాల ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా చేసి విల్లాల నిర్మాణం..
- హెచ్ఎండిఏ, రేరా అనుమతులతో 37 ఎకరాలకు గేటెడ్ కమ్యూనిటీ అనుమతులు..
- దారుణం ఏంటంటే మొత్తం 43 ఎకరాల్లో నిర్మాణాలు..
- ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లాలంటే వణకిపోతున్న ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్..
- అంతర్జాతీయ హంగులతో విలాసవంతమైన విల్లాలు ..
- చిన్న జీయర్ స్వామితో హంగామా చేస్తూ వ్యాపార ఓపెనింగ్ లు..
- కబ్జాలపై లోకల్ బాడీ, మున్సిపల్ కమిషనర్ కు, ఎమ్మార్వో కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని వైనం..
మాజీ ముఖ్యమంత్రి మాకు దగ్గరి బంధువు.. ప్రస్తుతం ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు.. సో నేనేమి చేసినా చెల్లుబాటు అవుతుంది.. నన్ను టచ్ చేసే మొనగాడు లేడు.. ఇష్టారీతిన నిర్మాణాలు చేసుకుంటాను.. అవసరమైన అధికారులను కాసులు వెదజల్లి కొనేస్తాను.. చట్టాలు, న్యాయాలు నా కాంపౌండ్ లోకి రావాలంటేనే జంకుతాయి.. ఇక అధికారులు ఏమి చేస్తారు..? ఇదండీ ఇతగాడి వ్యవహార శైలి.. ఈయనగారి పేరు నిరూప్ కుమార్ రెడ్డి… అత్యంత ఆధునికంగా నిబంధనలకు వ్యతిరేకంగా విల్లాల నిర్మాణం యథేచ్ఛగా సాగిస్తున్నాడు.. ఈయన అవినీతి పరంపరకు అడ్డుకట్టవేసే వారు లేరా అని విశ్లేషకులు, సామాజిక వేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు..?
హైదరాబాద్ విశ్వనగరం రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రతి ఒక్కరు సొంతంటి కల సహకారం చేసుకోవడానికి ఉవ్విల్లూరు తుంటారు.. ఇదే అదునుగా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు సామాన్యుడితో పాటు సంపన్నులను కూడా దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలకు అనుగుణంగా.. అన్ని వసతులు సమకూర్చే విధంగా నిర్మాణాలు చేపట్టి.. వాటిని విక్రయిస్తూ ముందుకు సాగుతుంటాయి.. ఇదే దరిమిలా కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అక్రమ ధనార్జనే ధ్యేయంగా ప్రజలను మోసం చేసే కుయుక్తులతో.. హంగు ఆర్భాటాలతో.. ఓపెనింగ్ లు, ప్రీ లాంచింగ్ లు వంటివి చినజీయర్ స్వామి లాంటి సోకాల్డ్ సెలబ్రిటీలతో, సీఎంలతో కొనసాగించి.. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో విస్తృత ప్రచారం చేసి.. ప్రజలను ఆకట్టుకుని బురిడీ కొట్టించి, మోసం చేసి ఆ తరువాత ప్లేట్ పిరాయిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.

దీనికి సాక్షీ భూతంగా నిలుస్తోంది రోలింగ్ మిడోస్ ఆల్ ఇన్‌ఫ్రా.. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు అతి చేరువలో.. బెంగళూరు హైవే ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో.. ఎటు వెళ్లాలన్నా అన్ని వసతులతో ప్రపంచస్థాయి హంగులతో హెచ్ఎండిఏ, రేరా అనుమతులు పొందిన గేటెడ్ కమ్యూనిటీని నిర్మించి.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా స్వాధీన పరుచుకుని.. దానిలో కూడా ప్రవేశించి అక్రమంగా నిర్మాణాలు సాగించి.. కోట్లకు అమ్మి వందల కోట్లకు పడగలెత్తి ప్రజల జీవితాలతో దారుణంగా చెలగాటమాడే రోలింగ్ మిడోస్ ఆల్ ఇన్‌ఫ్రా సంస్థపై హైడ్రా రంగనాథ్, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..

మహేశ్వరం మండలం, మంకల్ గ్రామం, రంగారెడ్డి జిల్లా.. 2.1 లేఅవుట్ మరియు అభివృద్ధి వివరాలు :
హెచ్ఎండిఏచే ఆమోదించబడిన లేఅవుట్.. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే మహేశ్వరం మండలం, మంఖాల్ గ్రామంలోని సర్వే నంబర్లు, 621, 622, 623. మరియు 624/1కి సంబంధించినది. లేఅవుట్ అభివృద్ధికి హెచ్ఎండిఏ రిఫరెన్స్ నంబర్ 046889/ఎస్.ఎం.డీ./ఎల్.టి. /యూ6/11/2021 కింద ఆమోదం లభించింది.

సర్వేనెంబర్ 621, 622, 623, 624/1 ఈ సర్వే నంబర్లలో హెచ్ఎండిఏ, రేరా అనుమతులు తీసుకున్న లేఔట్.. గేటెడ్ కమ్యూనిటీ పర్మిషన్ యొక్క విస్తీర్ణం 37 ఎకరాలు.. ఇదిలా ఉంటే వీరు విల్లాలు కట్టి.. చుట్టూ ప్రహరీ నిర్మించిన ప్రాంతం మొత్తం 43 ఎకరాల పైనే ఉంటుంది.. ఈ ప్రాంతాన్ని సందర్శించి అన్వేషిస్తే.. సర్వే నంబర్ 625లోని ప్రభుత్వ భూమి ఆరు ఎకరాలు కబ్జా చేసినట్లు స్పష్టంగా తెలిసిపోతుంది.. ఈ ఆరు ఎకరాలలో 20 అక్రమ విల్లాలు నిర్మించినట్లు కనిపిస్తుంది.. వీరు ఒక్కో విల్లాను తక్కువలో తక్కువ మూడు కోట్లకు అమ్ముతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ అక్రమ, అవినీతి దందాపై స్థానిక మహేశ్వరం ఎమ్మార్వోకు రాతపూర్వక ఫిర్యాదులు ఇస్తే.. అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి.. ఈ విషయంపై ఆదాబ్ టీం ఎమ్మార్వోను ప్రశ్నిస్తే.. చాలా పేరుమోసిన పెద్ద మనుషులు ఈ వ్యవహారంలో ఉన్నారు. మమ్మల్ని గేట్ లోకి అనుమతించరు.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి.. అని ప్రాధేయపడుతున్న దీన పరిస్థితి నెలకొంది.. ఇదే విషయం స్థానిక తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ కి తెలియపరిస్తే.. వారు సబ్జెక్టు తెలియక.. అంత పెద్దవారితో మేము పెట్టుకోలేము.. ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి సీఎం వెళ్లాలన్నా, ఏ అధికారి వెళ్లాలన్నా ప్రోటోకాల్ పర్మిషన్ తీసుకోవాలి.. అది మా స్థాయి కాదు.. మమ్మల్ని వదిలేయండి మహా ప్రభో.. అని ప్రాధేయ పడుతున్న పరిస్థతి..

అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా..? రాజరిక వ్యవస్థలో ఉన్నామా..? అనే అనుమానాలు అప్పుడప్పుడు మదిని తొలుస్తూ ఉంటాయి.. ఏకంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చుట్టం అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటూ.. వైష్ణవాచార ప్రముఖ ప్రచార పెద్ద చిన్న జీయర్ స్వామితో.. ఓపెనింగులు, హంగు ఆర్భాటాలతో వీడియోలు.. సోషల్ మీడియాలో ప్రమోషన్లు.. ప్రజలు ఎగబడి ఎగబడి ప్లాట్లు కొనడం.. ఇదీ నేడు జరుగుతున్న పరిస్థితి.. ఇక్కడ ప్రభుత్వ స్థలంలో విల్లాలు కొన్న వారి పరిస్థితి ఏంటి.. ? తీరా మోసపోతే రేపు ఎవరిని అడగాలి..? ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందనడానికి అక్షర సాక్ష్యం ఈ వార్తా కథనం..

ఈ భారీ అవినీతిపై రేరా ఒక్కసారైనా దృష్టి సారించి.. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని.. స్థానిక గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అవినీతికి పాల్పడుతున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి, కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..