- వేణుగోపాలపురం కార్యదర్శిపై చర్యలెక్కడ…
- వరుస తప్పిదాలతో వివాదాస్పదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కార్యదర్శి విజయలక్ష్మి..!
- మైనర్ బాలుడికి నీళ్ల టాంకర్ ఇచ్చి ప్రమాదానికి కారకురాలిగా మారినా చర్యలు శూన్యం..!
- కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు..
గ్రామ పంచాయతీకి చెందిన నీళ్ల టాంకర్‌ను మైనర్ బాలుడికి అప్పగించి ప్రమాదానికి కారకురాలైన ఘటన ఒకటైతే, వీధి దీపాల వ్యవహారంలో మండల అధికారుల ఆదేశాలను పట్టించుకోని ఘటన మరొకటీ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో అనర్హులను అర్హులుగా గుర్తించిన వ్యవహారం ఇంకొకటి, ఇలా అదేపనిగా తప్పులు చేస్తూ పలుకుబడితో తప్పించుకుంటున్న పంచాయితీ కార్యదర్శి విజయలక్ష్మి పై చర్యలు మాత్రం శూన్యం అంటున్న గ్రామస్తులు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాలపురం కార్యదర్శి విజయలక్ష్మి పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావు తీస్తుందని, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించి అనర్హులను అర్హులుగా అందలమెక్కించిన తీరు మరవకముందే తాజాగా గ్రామంలోని మైనర్ బాలుడికి జిపి నీళ్ల ట్యాంకర్ అప్పగించి ప్రమాదానికి కారకురాలుగా మిగిలిందని, ఇది మర్చిపోక ముందే గ్రామంలో వీధి దీపాల సమస్యలను ఎం.పీ.ఓ. విజయకుమారి మీదకు నెట్టి మరో పొరపాటు చేసిందని, ఇలా అనేక రకాలుగా వివాదాస్పదంగా మారుతున్న పంచాయతీ కార్యదర్శి తీరు పట్ల అధికారులు సైతం చర్యలు తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మైనర్ బాలుడికి నీళ్ల ట్యాంకర్ అప్పగింత…!
గత నెల 25న గ్రామంలో జరుగుతున్న సీసీ రహదారుల పనులను చేస్తున్న కాంట్రాక్టర్ కోసం పంచాయితీ కార్యదర్శి విజయలక్ష్మి గ్రామంలోని ఓ మైనర్ బాలుడికి జీపీ నీళ్ల ట్యాంకర్ ను అప్పగించిందని, సదరు బాలుడు అతివేగంగా, అజాగ్రత్తతో ప్రయాణించి ఎదురుగా వస్తున్న ఏలూరు లక్ష్మీ అనే మహిళ మీదకు దూసుకపోవడంతో ట్యాంకర్ బోల్తా పడిన ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని, ఇదే అంశంపై కార్యదర్శి విజయలక్ష్మిని గ్రామస్థులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటంతో, ఆగ్రహించిన గ్రామస్థులు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని, కార్యదర్శి పై చర్యలు తీసుకోవడంలో అధికారులు ఎందుకు వెనకాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రాజకీయం చేస్తున్న కార్యదర్శి…?
గత ఐదు నెలలుగా గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని సమ స్యను గ్రామస్థులు కార్యదర్శి విజయలక్ష్మి దృష్టికి తీసుకపోగా ఎం.పీ.ఓ విజయకుమారి కావాలనే సంతకం పెట్టడంలేదని ఆరో పించటంతో, గ్రామస్థులు ఎం.పీ.ఓ.ని వివరణ కోరగా వీధి దీపాల సమస్య తన దృష్టికి రాలేదని బదులివ్వడంతో, ఏమీ అర్ధంకాని గ్రామస్థులు ఎం.పీ.డీ.ఓ సంజీవయ్య వద్దకు సమస్యను చేర్చగా నాలుగు రోజుల్లో పరిష్కరించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినా, నేటికీ సమస్యను తీర్చక పోగా, కొత్త సమస్యలు సృష్టిస్తూ, రాజకీయ నాయకుల అండదండలతో కార్యదర్శి తనను ఎవరు ఏమీ చేయలేవరనే ధీమాలో ఉన్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు.
స్పందించని కార్యదర్శి విజయలక్ష్మి…
ఈ విషయంపై సంబంధిత కార్యదర్శిని చరవాణిలో ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా, కార్యదర్శి స్పందించకపోవడం గమనార్హం.
కార్యదర్శిపై చర్యలు తీసుకుంటాం.. నారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి…
ఈ విషయం నా దృష్టికి వచ్చింది.
ఎం.పీ.వోని వివరణ అడిగాను. రిపోర్టు రాగానే పరిశీలించి, కార్యదర్శి పై చర్యలు తీసుకుంటాం.