˜ కరోనా సమయంలో సారు సంపాదన ఫుల్
˜ టెస్టింగ్ కిట్స్, మెడిసిన్, పీపీఈ కిట్స్ పక్కదారి
˜ వైద్యశాఖలో కోట్లు కొట్టేసిన్నట్టు ఆరోపణలు..
˜ గత ఫిబ్రవరిలో డిప్యుటేషన్ ఆర్డర్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేసి.. ముడుపులు తీసుకొని 70 మందిని ఓరల్ ఆర్డర్స్ ఇచ్చిన డీఎంహెచ్‌ఓ
˜ ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లలో మాముళ్లు
˜ అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించిన జిల్లా వైద్యాధికారి కొండల్ రావు
˜ రిటైర్మెంట్ ఫంక్షన్‌కు ఒక్కో పీహెచ్‌సీకి రూ.10వేల చొప్పున వసూల్
˜ సీజ్ చేసిన బాలాజీ స్కానింగ్ సెంటర్ నేటికి యదేచ్ఛగా కొనసాగుతున్న వైనం
˜ అవినీతి కొండల్ రావు ఫెన్షన్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు..
‘ఆకలి వేస్తే రోకలి మింగమన్నాడు’ అన్నట్టు వైద్యాశాఖలో విచ్చల విడిగా అక్రమాలకు పాల్పడ్డాడు ఓ అవినీతి అనకొండ. నల్గొండ జిల్లా డీఎంహెచ్‌ఓ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నికావు. నల్గొండ జిల్లా వైద్య శాఖాధికారి ఎ. కొండల్ రావు (మే 31న పదవి విరమణ పొందారు) భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. తన ఉద్యోగ సమయంలో చేసిన అవినీతి ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం గమనార్హం. ప్రపంచ దేశాలను గజగజ వణికించిన కరోనా వ్యాధి టైంలో మనోడి సంపాదన గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మాస్క్ లు, కరపత్రాల ముద్రణ, హ్యాండ్ గ్లౌజ్ లు, శానిటైజర్, టెస్టింగ్, పీపీఈ కిట్లు, మెడిసిన్, వ్యాక్సిన్ వంటి అనేకం బయట మార్కెట్లో విక్రయించడం ద్వారా కోట్ల వెనకేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు’ అన్న చందంగా మాజీ డీఎంహెచ్‌ఓ కొండల్ రావు వైద్యశాఖలో ఉన్నతాధికారిగా ఉంటూ అనేక అక్రమాలకు తెరలేపారు. ఆయన అవినీతి గురించి చెప్పుకుంటూ పోతే ‘హనుమంతుడి తోక’ కన్నా పెద్దగా ఉంటుంది. గత పదేళ్ల బీఆర్‌ఎస్ సర్కార్ హయాంలో సారు ఓ అవినీతి అనకొండలా తయారయ్యారు.
‘కంచాలమ్మ కూడబెడితే.. మంచాలమ్మ మాయం చేసిన్నట్టు’ పేద ప్రజలను దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్, టెస్టింగ్ సెంటర్స్ లకు సపోర్ట్ చేస్తూ వారి వద్ద నెలనెలా మాముళ్లు వసూలు చేసినట్లు సమాచారం. కేసీఆర్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో సిబ్బందికి అందించే మధ్యాహ్న భోజనం, స్నాక్స్ తదితర సంబంధిత డబ్బులు, డేటా ఎంట్రీ వాళ్లకు రోజుకు రూ.100 చొప్పున డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అప్పటి డీఎంహెచ్‌ఓ కొండల్ రావు వాటన్నింటినీ మింగేశారు. పైగా ఇంకా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు కాలేదని డేటా ఎంట్రీ వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొన్ని పీహెచ్‌సీలకు డబ్బులు ఇచ్చినట్లు, మరికొన్ని పీహెచ్‌సీలకు ఇవ్వలేదని రికార్డులో చూపించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో సిబ్బంది మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. కానీ వచ్చిన నిధుల్లో డీఎంహెచ్‌ఓకు కమీషన్లు ఇచ్చినట్లు పీహెచ్‌సీ డాక్టర్లు, సీనియర్ అసిస్టెంట్లు వెల్లడిరచారు. కంటివెలుగు కార్యక్రమంలో నిధులను అప్పణంగా కొట్టేసిన డీఎంహెచ్‌ఓ కొండల్‌రావుపై ఉన్నతాధికారులు ఎవరూ చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.
బీఆర్‌ఎస్ సర్కార్ టీ హబ్ శాంపిల్స్ కలెక్షన్స్ కోసం ఫోర్ వీల్లర్ వెహికల్స్ వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ‘కోటి విద్యలు కూటికొరకే’ అన్నట్టు డీఎంహెచ్‌ఓ కొండల్ రావు తెలివిగా ఫోర్ విల్లర్ వెహికిల్స్ వాడకున్నా.. వాడినట్లు చూపి ప్రభుత్వం నుంచి బిల్లు డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్లల్లో కాకుండా టూ విల్లర్ మీద బ్లడ్ శాంపిల్స్ కోసం బైక్ మీద ప్రతి పీహెచ్‌సీ తిరుగుతూ శాంపిల్ తీసుకుపోవడం మూలంగా నాణ్యత లోపం వచ్చి పరీక్షలలో సరైన ఫలితాలు రాలేదని తెలిసింది. అయితే శాంపిల్స్ కోసం వాడినట్లు కారుకు సంబంధించిన టెండర్‌ను తన సోదరుడి పేరుతో తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు ‘గుండ్లు తేలి బెండ్లు మునిగాయంటున్నట్టు’ డీఎంహెచ్‌ఓ లీలలు ఉన్నాయి. నేషనల్ క్వాలిటీ ఎస్యురెన్స్ స్టాండర్డ్స్ ఈ ప్రోగ్రాం కి కావలసిన పరికరాలు రికార్డ్స్, రిపోర్టింగ్ ఫార్మేట్ కావలసిన ఎక్విప్మెంట్స్ మొత్తం తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంపికైనటువంటి పీహెచ్‌సీలకి, ఉపకేంద్రాలకు ఎన్.హెచ్.ఎం జిల్లా విభాగానికి వచ్చి వాటిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా పంపిస్తారు. అయితే ఇక్కడ ఈ పరికరాలు హెచ్‌డిఎఫ్ (హాస్పటిల్ డెవలప్‌మెంట్ ఫండ్) ద్వారా కొనుగోలు చేసినట్లు స్థానిక ప్రజా ప్రతినిధులను తప్పుదోవ పట్టిస్తూ.. యధేచ్చగా నిధులు కాజేశారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎంపికైన పీహెచ్‌సీ సిబ్బందికి 25% నిధులు ఇవ్వాలి.. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా సిబ్బందికి ఇచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో ఎన్‌హెచ్‌ఎం స్కీం ద్వారా తీసుకున్నటువంటి పల్లె దావఖాన మెడికల్ ఆఫీసర్లలో, 3వ ఏఎన్‌ఎంల ఎంపికలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఉద్యోగం ఉండి వయస్సు ఎక్కువగా ఉందని తొలగించిన వారిని కూడా మళ్లీ తీసుకోవడం జరిగింది.
దేవరకొండ బాలాజీ స్కానింగ్ సెంటర్ కు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో డీఎంహెచ్‌ఓ కొండల్ రావు కలెక్టర్ ఆదేశాల ప్రకారం వెంటనే ఆ స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. తదనంతరం స్కానింగ్ సెంటర్ యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని యదేచ్ఛంగా కొనసాగించండి.. మాకు ఆ అక్రమ సొమ్మలో భాగస్వాములను చేయండని సుమారు రూ. 2 లక్షలు తీసుకున్నట్లు బహిరంగంగానే విమర్శలు వెలువెత్తాయి.
‘జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు’ లక్షల్లో జీతాలు తీసుకునే ఉద్యోగులు డ్యూటీకి రాకుండా విధులు నిర్వర్తించినట్లు డబ్బులు తీసుకున్నారు. డ్యూటీ రాకున్నా పర్సంటేజ్ తీసుకొని సీనియర్ అసిస్టెంట్స్ ని ఏజెంట్‌గా మార్చుకొని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తూ.. ముడుపులు తీసుకున్నారని తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో వైద్యాశాఖలో ఉన్నతాధికారిగా కొనసాగుతున్న సమయంలో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఏకంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే మనకు రక్షణ అని చెప్పి నిర్మోహమాటంగా మాట్లాడినట్లు సమాచారం. అంతా కేసీఆర్ కే ఓట్లేసి వారి రుణం తీర్చుకోవాలని చెప్పి బావుటంగనే ప్రకటించనట్లు తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో రద్దు చేసిన డిప్యుటేషన్ ఆర్డర్స్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తూ వారి అదే స్థానంలోకి పంపించారు. మళ్లీ వెంటనే ఇదే డీఎంహెచ్‌ఓ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో కలెక్టర్ ని తప్పుదోవ పట్టిస్తూ ఈ జిల్లాల్లో ఇప్పుడు 70 మందిని ఓరల్ ఆర్డర్స్ ఇస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తనకు నమ్మిన బంటు అయిన బీజాల శేఖర్ రెడ్డి ద్వారా ముడుపులు తీసుకుంటూ వారిని కోరుకునే డిప్యూటేషన్ ఇస్తూ కొన్ని పీహెచ్.సీలలో పనిష్మెంట్ కింద చేయించుకొని అంతముందు ఉన్న ప్లేస్ లోకి మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. మూడు పూలు ఆరుకాయలుగా తన అనుచరుల ద్వారా ఈ ఐదు సంవత్సరాలు నడిపించాడు. శేఖర్ రెడ్డి టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మిగతా పారామెడికల్ షాప్ లో ఉన్న యూనియన్ల మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చాడు.
డీఎంహెచ్‌ఓ కొండల్ రావు రిటైర్మెంట్ ఫంక్షన్ ను ఘనంగా చేయడానికి ప్లాన్ చేశారు ఈ శేఖర్ రెడ్డి.. సార్ రిటైర్మెంట్ అయ్యేటప్పుడు దగ్గరుండి కమిటీ బలవంతంగా పీహెచ్‌సీలలో వసూలు చేయించి సారు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని చూశాడు. మళ్ళీ రాబోయే వాళ్లకు కూడా నా పనితనం ఏందో తెలియజేయాలని వారు కూడా మళ్లీ నాకు ఇదే విధంగా ఉండాలని అతడు తన సీనియర్ అసిస్టెంట్స్, వైద్యాధికారులతో తనకు అనుకూలంగా ఉన్న వారితో ప్రతి పీహెచ్‌సీకీ 10,000 వసూలు చేశారు. డీఎంహెచ్‌ఓ సీసీ గా సీనియర్లను కాదని ఈ సీనియర్ అసిస్టెంట్ ని పెట్టుకున్న దాంట్లో ఇదే మతలబ్ అని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా అవినీతి అనకొండగా పేరుగాంచిన మాజీ డీఎంహెచ్‌ఓ కొండల్ రావు అక్రమాస్తులపై దృష్టిపెట్టి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేట్ హాస్పటల్‌లో చేసిన అక్రమ దందాలపై పూర్తి ఆదారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్..