- ప్రైవేట్ జెట్ విమానాల్లో చేసిన విహార యాత్రల వివరాలు వెల్లడిస్తా..
- కేటీఆర్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫైర్
మాజీమంత్రి కేటీఆర్ అధికారమదంతో జన్వాడ ఫామ్ హౌజ్ లో నడిపించిన అక్రమ వ్యవహారాలన్నీ త్వరలోనే ప్రజల ముందు బయటపెడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. కేటీఆర్ శని, ఆదివారాల్లో ఫాంహౌజ్ లో విచ్చలవిడిగా సాగించిన లీలలు, ప్రైవేట్ జెట్ విమానాల్లో చేసిన విహార యాత్రల వివరాలన్నీ త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మంచి పేరు తెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ బ్లాక్ మెయిలింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయిన కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నపుడు కేటీఆర్ చేసిన అవినీతి వ్యవహారాలతో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ను శంకరగిరి మాన్యాలు పట్టించారని, అయినా ఇంకా బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు.
కేంద్రంలో బీజేపీ కూడా కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తూ కాలం వెల్లదీస్తున్నదనీ అదేవిధంగా తెలంగాణలో కూడా కేటీఆర్ ఒక వాట్సప్ యూనివర్సిటీని ఏర్పాటుచేసుకొని నిత్యం అసత్యాలను వల్లెవేస్తున్నాడని బండి సుధాకర్ విమర్శించారు. కేటీఆర్ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేస్తున్నాడని, కేటీఆర్ కు త్వరలోనే గుణపాఠం తప్పదని బండి సుధాకర్ హెచ్చరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ బుద్ధి తెచ్చుకొని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.