- మంత్రి పదవి మీద ఉన్న ఆశ ప్రజల సమస్యల మీద లేదు.
- ఈనెల 20న వరంగల్లో జరిగే రజితోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలి.
- బీఆర్ఎస్ సన్నాక సమావేశంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పై ఉన్న ఆశ.. నియోజకవర్గ అభివృద్ధి పట్ల లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో ఉన్న బాలాజీ ఫంక్షన్ లో సోమవారం చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల ముఖ్య కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మునుగోడులో ఎక్కడ చూసినా తన హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందని, ఈ ప్రాంతానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏదీ లేదన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఎంతసేపు మంత్రి పదవి మీద ఉన్న కోరిక..ఈ ప్రాంత సమస్యలపై లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఊసరవెల్లిలా రంగులు మార్చినట్టు పార్టీలు మారితే మంత్రి పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ పదవి రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని…ఉత్తమ్ కుమార్ రెడ్డిని గంగిరెద్దులోడని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మంత్రి పదవి కోసం వారిని పొగుడుతున్నాడని ఎద్దేవా చేశారు. భువనగిరి ఎంపీని నేనే గెలిపించిన అని గొప్పలు చెబుతున్న రాజగోపాల్ రెడ్డి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి మళ్లీ రాజీనామా చేసి పార్టీ సపోర్ట్ లేకుండా తన మీద పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు నమ్మకం పోయిందని, రేవంత్ ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడుతున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గిరికటి నిరంజన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్, చిన్నం బాలరాజు, ఆందోజు శంకరాచారి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, ముటుకులోజు దయాకర్ చారి, ఢిల్లీ మాధవరెడ్డి, ఊడుగు మల్లేష్ గౌడ్, నర్రి నర్సింహ, గడ్డం మురళీధర్ రెడ్డి, జేజే రెడ్డి, సుర్వి యాదయ్య గౌడ్, పర్వాతాలు, గుండెబోయిన వెంకటేష్, ఇబ్రహీం, సాగర్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.