Saturday, April 19, 2025
spot_img

జపాన్‌లో సీఎం బిజీబిజీ

Must Read
  • వ్యాపారానికి అనువైన అవకాశాలు
  • మారుబేని కంపెనీతో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం
  • సోనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థతో చర్చలు
  • దుబాయిలో హత్యకు గురైన వారి మృతదేహాలను వెంటనే తెప్పించాలి
  • దుబాయి హతుల వారసులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు
  • దుబాయిలో పలు కంపెనీలతో సీఎం.రేవంత్‌ రెడ్డి వరుస భేటీలు

పెట్టుబడుల సాధనే లక్ష్యంతో జపాన్‌ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం తొలిరోజు పెట్టుబడులను అకర్షించడంలో సఫలికృతం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి బృందం జపాన్‌ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో నెక్స్ట్స్‌ జనరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెనీ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్‌ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి, నెక్స్ట్‌ జనరేషన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. అందుకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్‌ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్‌ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్‌ పార్క్‌ అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ.5వేల కోట్లకు పైగా పెట్టుబడును ఆకర్షించే అంచనాలున్నాయి. మారుబేని ఇండస్ట్రియల్‌ పార్క్‌ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌, గ్రీన్‌ ఫార్మా, ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాలపై దృష్టి పెటనుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడుతారు.

చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్‌ సిటీకి మారుబేనికి స్వాగతం పలికారు. ఫ్యూచర్‌ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్కు ఇదేనని అన్నారు. దీంతో తెలంగాణలో దాదాపు 30 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. తెలంగాణలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని మారుబేనికి ప్రభుత్వం తరఫున తగినంత మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్‌ జీరో సిటీగా ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబేని పెట్టుబడులకు ముందుకురావటం సంతోషంగా ఉందన్నారు. భారత దేశంతో జపాన్‌ కు ఏళ్లకేళ్లుగా ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని ముఖ్యమంత్రి మాటిచ్చారు. తెలంగాణ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు ముఖమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంచుకున్న దార్శనికతకు మారుబేని నెక్స్ట్‌ జనరేషన్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ దైసకాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించారు. అక్కడున్న అవకాశాలను వినియోగించుకునేందుకు ముందువరుసలో ఉంటామని అన్నారు. మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్‌ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్‌, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్‌ లీజింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, ఏరోస్పేస్‌, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులను నియమించింది.

సోనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థతో చర్చలు,…
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం గురువారం జపాన్‌లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా సోని కంపెనీకి చెందిన యానిమేషన్‌ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌ బృందాన్ని కలుసుకుంది. ఈ సందర్భంగా సోనీ కార్పొరేషన్‌ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు ప్రదర్శించారు. ఉత్పత్తులతో పాటు వారి పని తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సోనీ కంపెనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థ క్రంచైరోల్‌పై వివరణాత్మక చర్చలు జరిపింది. యానిమేషన్‌, వీఎఫ్‌ఐ మరియు గేమింగ్‌ రంగాలలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను తెలంగాణ బృందం కంపెనీ ప్రతినిధులకు వివరించింది. ఎండ్ టు ఎండ్‌ ప్రొడక్షన్‌ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్‌ సిటీ ఏర్పాటు చేయాలనే సీఎం తన భవిష్యత్తు విజన్‌ను వారితో పంచుకున్నారు.

దుబాయి హతుల వారసులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు,….
దుబాయిలో హత్యకు గురైన వారుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి సానుభూతితో స్పందించారు. జపాన్‌ పర్యటనలో వున్న అయన అక్కడి నుండి అధికారులతో వివరాల అడిగి తెలుసుకున్నారు. మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్‌ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్‌ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్‌ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్‌లు దుబాయిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ డా. బిఎం వినోద్‌ కుమార్‌ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్‌ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS