హైదరాబాద్: డేటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను మోసం చేస్తున్న మోష్ పబ్ యాజమాన్యంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ స్కామ్ బాధితులు ఆధారాలతో ముందుకు రావాలని పోలీసులు కోరారు. ఓ బాధితుదు రితిక అనే మహిళను డేటింగ్ యాప్‌లో కలవడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఫోన్ లో సంభాషణ తర్వాత, రితికా అతన్ని హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో కలవాలని సూచించింది. అనుకున్న ప్రకారం కలిసిన తర్వాత.. ఆమె అతన్ని మోష్ క్లబ్‌కు తీసుకువెళ్లింది. అక్కడ ఆమె ఖరీదైన పానీయాలను ఆర్డర్ చేసింది. బిల్లు మొత్తం రూ.40,505/- అయ్యింది. క్లబ్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ఢిల్లీలోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఖాతాకు చెల్లింపులు జరగడంతో బాధితుడి అనుమానం వచ్చింది. దీంతో అతను పబ్ కు సంబంధించిన ట్రాక్ రికార్డు పై అన్ లైన్ లో పరిశోధించాడు.. డేటింగ్ యాప్ ద్వారా కస్టమర్స్ ను ట్రాప్ చేసి పబ్ కు తీసుకెళ్ళి జేబులు ఖాళీ చేస్తున్నారని గ్రహించాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. పబ్ లు డేట్ యాప్ ల ద్వారా చేస్తున్న మోసపూరిత వ్యవహారాలపై ఇపుడు పోలీసులు దృష్టిపెట్టారు. ఇది ఒక మోష్ పబ్ కి పరిమితమైందా.. లేక ఇతర పబ్ సంస్థలు కూడా ఇలాంటి అక్రమాలకు పల్పడుతున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.