ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సీఎం రేవంత్ నిర్లక్ష్యం
తెలంగాణలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీశ్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. “రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, ఆయన మాత్రం మూసీ సుందరీకరణ, ఒలింపిక్స్ సమీక్షలతో కాలక్షేపం చేస్తున్నారు” అని విమర్శించారు. హరీశ్ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ బృందం మెదక్ జిల్లా వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించింది. రాజాపేట గ్రామంలో వరదల్లో చిక్కుకొని మరణించిన సత్యం కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజాపేటలో ఇద్దరు గ్రామస్థులు వరదల్లో చిక్కుకొని కరెంటు పోల్ ఎక్కి నాలుగైదు గంటలపాటు సహాయం కోసం ఎదురు చూశారు. అధికారులు సమాచారం అందుకున్నా నిర్లక్ష్యం చేశారు. చివరికి కరెంటు పోల్ కొట్టుకుపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ పంపించి ఉంటే వారు కాపాడబడేవారు. ఇది ప్రభుత్వపు ఘోర వైఫల్యం” అని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్‌ను అత్యవసర పరిస్థితుల్లో వాడాలని అంటారు. కానీ వాళ్లు వాటిని పెళ్లిళ్లకు, బీహార్ రాజకీయాల కోసం వినియోగిస్తారు. ఇదే ప్రజల ప్రాణాల విషయానికి వస్తే నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు” అంటూ మండిపడ్డారు.