ప్రపంచ పవనదినోత్సవం అనేది పవన శక్తి యొక్క ప్రాముఖ్యత మరియు ప్రపంచ ఇంధన అవసరాలను పరిష్కరించడంలో వాతావరణ మార్పులను తగ్గించడంలో దాని సామర్థ్యం గురించి అవగాహన పెంచడానికి జూన్15న జరుపుకునే వార్షిక కార్యక్రమం. పవన శక్తిని శుభ్రమైన పునరుత్పాదక మరియు స్థిరమైన శక్తి వనరుగా ప్రోత్సహించడం ఈ రోజు లక్ష్యం.” పవన శక్తి యొక్క ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియపరచడం” అనే నేపథ్యంలో ఈ యేడాది జరుపుతారు.
పవన విద్యుత్తు:
విండ్ టర్బైన్ అనునది విద్యుత్తుని తయారుచేసే యంత్రము. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. గాలి ద్వారా మాత్రమే పనిచేస్తుంది. గాలి దీని రెక్కల మీదుగా ప్రవహించడంవల్ల జెనరేటర్ తిరగడం వలన వచ్చే విద్యుత్ బ్యాటరీలో స్టోర్ చేసి ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా ఆంప్లిఫై చేసి గ్రిడ్ కి తరలిస్తారు. ఇలా ఉత్పత్తిచేసిన విద్యుత్తును పవన విద్యుత్తు అంటారు. ఆఫ్ షోర్ విండ్ టర్బైన్లు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కదిలే గాలి యొక్క శక్తిని ఉపయోగిస్తాయి.
మనదేశంలో పవన విద్యుత్:
భారతదేశంలో పవన విద్యుత్తు అభివృద్ధి డిసెంబర్ 1952లో ప్రారంభమైంది. విశిష్ట పవర్ ఇంజనీర్ అయిన మానెక్లాల్ సంకల్‌చంద్ థాకర్ దేశంలో పవన శక్తిని వినియోగించే అవకాశాలను అన్వేషించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తో కలిసి ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభంతో మొదలైంది. భారతదేశంలో పవన శక్తి ఒక ముఖ్యమైన పునరుత్పాదక ఇంధన వనరుగా అభివృద్ధి చెందుతోంది. పవన క్షేత్రాలలో ఏర్పాటు చేయబడిన విండ్ టర్బైన్ల ద్వారా పవన శక్తి ఉత్పత్తి అవుతుంది. మనదేశంలో విద్యుత్ తయారీకి అవసరమైన ఇంధనాలకు డిమాండ్ పెరుగుతోంది. పునరుత్పాదక శక్తి వనరులు క్షీణిస్తున్నాయి. అందువల్ల పవన శక్తి వంటి ప్రత్యామ్నాయ శక్తి వనరుల అభివృద్ధి ముఖ్యమైనది. మనదేశంలో విద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ విద్యుదీకరణ, వ్యవసాయ అనువర్తనాలు, పారిశ్రామిక మరియు వాణిజ్య వినియోగం, ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి వంటి అనేక ఉపయోగాలు పవనశక్తి వలన కలుగుతున్నాయి. పవన శక్తిని వినియోగించుకోవడానికి భారతదేశానికి మంచి సామర్థ్యం ఉంది. నిరంతరం పెరుగుతున్న విద్యుత్ ధరలకు శాశ్వత కవచం లాంటిది. అన్ని సాంప్రదాయక విద్యుత్ ప్రాజెక్టులలో పవన విద్యుత్ తయారీకి తక్కువ వ్యయం అవుతుంది. విద్యుత్ శక్తి యొక్క చౌకైన మూలం. నిర్వహణ మరియు కార్యాచరణ ఖర్చులు తక్కువ. భారతదేశంలో పవన శక్తిని ఉత్పత్తి చేయడానికి 800 కంటే ఎక్కువ పవన విద్యుత్ ప్లాంట్లు స్థాపించబడ్డాయి. భారతదేశంలో పవన శక్తి సామర్థ్యం చాలా పెద్దది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ప్రకారం మన దేశంలో పవన శక్తి ఉత్పత్తి ఖర్చు ఇతర సాంప్రదాయిక విద్యుత్ వనరులతో పోలిస్తే 40 శాతం తక్కువగా ఉంది. ఇటీవలి అంచనా ప్రకారం స్థూల పవన శక్తి సామర్థ్యం 100 మీటర్ల ఎత్తులో 302 గిగావాట్ మరియు నేల మట్టానికి 120 మీటర్ల ఎత్తులో 695.50 గిగావాట్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చైనా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత మూడవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన దేశంగా మనదేశం అవతరించింది. దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పవన శక్తి ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ పరిమాణం 71,814 మిలియన్ యూనిట్లు. 30జూన్ 2023 నాటికి దేశం యొక్క వ్యవస్థాపక పవన శక్తి ఉత్పత్తి సామర్థ్యం 43,773 మెగావాట్లు ఉంటే 31 మార్చి 2024 నాటికి మొత్తం వ్యవస్థాపించిన పవన విద్యుత్ సామర్థ్యం 45.887 గిగావాట్లుగా ఉంది. 2029-30 నాటికి 99.9 గిగావాట్లకు పెరిగే అవకాశం ఉంది. 2022-23 సంవత్సరానికి గాను ప్రధాన పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణలు ఉన్నాయి. కాప్26లో ప్రధాన మంత్రి చేసిన ప్రకటనకు అనుగుణంగా 2030 నాటికి శిలాజరహిత వనరుల నుంచి 500 గిగావాట్లు స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడానికి కేంద్ర నూతన మరియు పునరుత్పాదక విద్యుత్ శక్తి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ఇందులో పవన విద్యుత్ సామర్థ్యం కూడా కలిసి ఉంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చిన ‘రిపోర్ట్ ఆన్ ఆప్టిమల్ జనరేషన్ కెపాసిటీ మిక్స్ ఫర్ 2029-30 వెర్షన్ 2.0’ ప్రకారం 2029-30 చివరి నాటికి పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 99,895 గిగావాట్లుగా అంచనా వేశారు.
పవన విద్యుత్ ఉపయోగాలు:
ఇది పర్యావరణ అనుకూలమైనది. పవన విద్యుత్తు ఎటువంటి కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేయదు. అందువల్ల గ్రీన్హౌస్ ప్రభావానికి దోహదం చేయదు. మారుమూల ప్రాంతాలు లేదా బలహీనమైన గ్రిడ్ ఉన్న ప్రాంతాల్లో పవన శక్తిని బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు.
పరిమితులు:
బలమైన ఆధారపడదగిన గాలులు ఎక్కువ సమయం అందుబాటులో ఉండే చోట మాత్రమే పవన యంత్రాలు బాగా పనిచేస్తాయి. అన్ని సమయాలలో శక్తిని ఉత్పత్తి చేయడానికి గాలులు బలంగా వీయవు . గాలి టవర్లు, టర్బైన్ బ్లేడ్లు అధిక గాలులు మరియు పిడుగుల వలన దెబ్బతింటాయి. భూమి నుండి ఎత్తులో ఉన్న భ్రమణ భాగాలను మరమ్మతు చేయడం కష్టంతో కూడుకున్న పని. పవన శక్తి ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు కొన్నిసార్లు వోల్టేజ్ మరియు పవర్ ఫ్యాక్టర్‌లో హెచ్చుతగ్గులకు గురవుతుంది, ఇది దాని శక్తిని యుటిలిటీ సిస్టమ్‌కు లింక్ చేయడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. విండ్ మెషీన్ బ్లేడ్‌లను తిప్పడం ద్వారా వచ్చే శబ్దం సమీపంలోని పొరుగువారికి చికాకు కలిగిస్తుంది.
జనక మోహన రావు దుంగ
అధ్యాపకుడు
8247045230