18 జూన్ ‘అంతర్జాతీయ విహార యాత్రల దినం’ సందర్భంగా
డిజిటల్ యుగపు భూకుగ్రామంలో ఆధునిక వేగవంతమైన ఉరుకుల పరుగుల జీవితం, ఎవ్వరికీ ప్రశాంతత లేదు, విరామం దొరకట్లేదు, అంతు కనిపించడం లేదు, ఫలితం సంతృప్తిని ఇవ్వడం లేదు. జీవితాలు యంత్ర సమానం అయ్యాయి. ఉల్లాస క్షణాలు, అమితానంద దృశ్యాలు కరువయ్యాయి. సంతోషంగా కుటుంబ సభ్యులతో గడిపే ఘడియలు కొన్ని క్షణాలైన బహు అరుదైనాయి. నవ్య నాగరికతలో అమ్మ నాన్నలు ఉద్యోగులుగా, జీవనోపాధిలో తలమునకలయిన పెద్దలుగా, పిల్లలు విద్యార్జనలో బిజీగా ఉండడంతో ఇంట్లో అందరూ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకోవడం, ఆటపాటల ఆనందసాగరంలో మునిగితేలడం అసాధ్యమైపోతున్నది. మన యాంత్రిక జీవితాల్లో కొంత ఉపశమనం, ఆరోగ్య పరిరక్షణ వెతుక్కుంటూ ఉల్లాసం కోసం విహార యాత్రలు, ప్రర్యాటక క్షేత్ర దర్శనాలు, విజ్ఞాన వివేకాలను మెరుగుపరుచుకోవడాన్కి విజ్ఞాన యాత్రలు లాంటివి ఎంతగానో ఉపయోగపడతాయని మనకు తెలుసు.
విజ్ఞాన వివేకాల ఆస్వాదన వేదికలు:
పిక్నిక్ లేదా విహార యాత్రల్లో సహజ ప్రకృతితో మమేకమవుతూ, హరిత దుప్పట్ల మీద కుటుంబ సభ్యులు భోజనాలు చేస్తూ ఆనంద క్షణాలు ఆస్వాదించడం ఓ అద్భుత అవకాశం. దైనందిన జీవన పయనంలోంచి స్వల్ప విరామం తీసుకొని, మానసిక ఉల్లాసం పొందడానికి బంధువులు, స్నేహితులతో విహార యాత్రలు చేయాలనే అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి ఏట 18 జూన్‌న ‘అంతర్జాతీయ విహారయాత్రల దినం (ఇంటర్నేషనల్ పిక్నిక్ డే)’ పాటించుట జరుగుతున్నది. 1800 మధ్య కాలంలో ఫ్రెంచ్ విప్లవ సమయాన విహారయాత్రల ఆలోచనలు ప్రారంభమైనాయి. 20 జూన్ 2009న లిస్బన్, పోర్చుగల్‌లో 22,000 మందితో నిర్వహించిన అతి పెద్ద విహారయాత్ర ‘గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో కూడా చోటు దక్కించుకుంది.
ప్రకృతి ఆస్వాదన సదవకాశాలు:
అంతర్జాతీయ విహారయాత్రల దినం రోజున విద్యాలయాలు, కుటుంబాలు విహార యాత్రలు నిర్వహించుట జరుగుతుంది. పలు తినుబండారాలు, శీతలపానీయాలు, స్వీట్లు, పండ్లు, కేక్‌లు, సాండ్‌విచ్చెస్ లాంటి అనేక రకాల ఆహార పదార్థాలతో పాటు క్రీడా వస్తువులు వెంట తీసుకొని విహారయాత్రలకు వెళతారు. ప్రతి ఒక్కరు ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదిస్తూ, తమ వయసును మరిచి, పిల్లలుగా మారిపోతూ, సాంస్కృతిక కార్యక్రమాలతో అమితానందాన్ని పొందుతూ, మానసిక ఉల్లాసాన్ని పొందుటకు, మనసు తేలిక పరుచుకునేందుకు విహారయాత్రలు ఉపయోగపడతాయి. విహారయాత్రలతో పిల్లలకు ప్రకృతి అందాలు అనుభవించే అద్భుత అరుదైన అవకాశం దొరుకుతుంది. విహారయాత్రలు పిల్లలకు విజ్ఞానయాత్రలుగా కూడా ఉపయోగపడతాయి. జూన్ 3వ వారంలో వాతావరణం కూడా అహ్లాదకరంగా, ఆకర్షణీయంగా విహారయాత్రలకు అనుకూలంగా ఉంటుంది. విహారయాత్రల నిర్వహణ ద్వారా పిల్లలకు, తల్లితండ్రులకు, తాత బామ్మలకు మధ్య చక్కటి ప్రేమానుబంధాలు ఏర్పడతాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆగష్టు మెుదటి సోమవారం సెలవు దినంగా ‘పిక్నిక్ డే’ నిర్వహించుట జరుగుతుంది.
శారీరక మానసిక ఉపశమన క్షణాలు:
జీవితాలను పరిపూర్ణంగా ఆస్వాదించడానికి, శారీరక మానసిక ఉల్లాసానికి దోహదపడే విహారయాత్రల వంటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించుకొనుటకు అందరు ముందుకు రావాలని, యాంత్రిక జీవితంలోంచి బయటపడి అపురూప ఆనంద క్షణాలను అనుభవించే అద్భుత అవకాశాలను జారవిడుచుకోవద్దని మనవి. ధనార్జన మాత్రమే ఆనందాన్ని ఇవ్వదని, ఆనందించలేని జీవితం నిరర్థకమని తెలుసుకుందాం. ఆనందమయ జీవన విధానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలుసుకుందాం.
ఆనందమే ఆరోగ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మదాం. కనీసం వానాకాలంలో అయినా వన భోజనాలు, దర్శనీయ క్షేత్రాలకు ప్రణాళికలు వేద్దాం, సాకారం చేసుకుందాం. డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037