- తీగలాగితే డొంక కదిలినట్టు తవ్వే కొద్ది బయటపడుతున్న అక్రమాలు..
- నడుపుతున్నది సంతోష్ సాండ్ కంపెనీ..
- ఈ పేరుతో అమిన్ పూర్ లో లేఅవుట్ లో ఖాళీ స్థలాలపై నజర్..
- లే అవుట్ కి సంబంధించిన ఓర్జినల్ డాక్యుమెంట్లు పోయాయని
పోలీస్ స్టేషన్లో సర్టిఫికెట్ పొందిన మహావీర్ జైన్.. - చక్రపురి కాలనీలో చక్రం తిప్పిన మధుసూదన్ రెడ్డి..
- లే అవుట్ లో రోడ్లు, పార్క్ స్థలాలు కబ్జా చేసేందుకు పక్కా స్కెచ్..
- కబ్జా చేసేందుకు అనువుగా ఫ్రీ కాస్ట్ వాల్స్ వేసిన వైనం..
- అక్రమంగా వేసిన ఫ్రీ కాస్ట్ వాల్స్ అన్నీ కూల్చివేసిన
గత మున్సిపల్ కమిషనర్ సుజాత.. - కూల్చి వేసిన కమీషనరే కబ్జా చేసేందుకు పరోక్ష సహకారం
అందించడంలో ఏమిటి మతలబు..? - అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెగబడిన గూడెం బ్రదర్స్..
- వీరి అక్రమాల్లో మాజీ మంత్రి హరీష్ రావు హస్తం ఉందని అనుమానాలు..?
- ఈడి అధికారులు గత మున్సిపల్ కమిషనర్ సుజాత, మహావీర్ జైన్
అక్రమాల పై దృష్టి సారిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని
వెల్లువెత్తుతున్న డిమాండ్స్..
అవినీతికి, అక్రమాలకు పాల్పడేవాళ్లు ముదుర్లయి వుంటారు.. కానీ కొంతమంది మాహా ముదుర్లుగా పేరు తెచ్చుకుంటారు.. వీరు అధికారాన్ని సునాయాసంగా వాడుకుంటారు.. కాసులకు కక్కుర్తిపడే అధికారులను తమ చేతుల్లో పెట్టుకుంటారు.. వీరికి కోర్టులు, నిబంధనలు, చట్టాలు అంటే లెక్కే ఉండదు.. ఎంత అవినీతి చేసాం..? ఎంతమేర పైకం జేబుల్లో వేసుకున్నాం.. ఇదే వీరి ఎజెండాగా కొనసాగుతుంది.. శిక్షలు పడతాయని తెలిసినా వాటిని ఎలా మేనేజ్ చేయాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.. అలాంటి కోవలోకే వస్తారు గూడెం బ్రదర్స్.. వీరి అవినీతికి అంతు అనేది ఉండదు.. వీరు చేసే అరాచకాలకు ఫుల్ స్టాప్ ఉండదు.. ప్రభుత్వం ఏదైనా తమకు అనుకూలంగా మార్చుకోగలం అనే అతి తెలివితేటలు, ధైర్యం వీరికి ఉంటుంది..
సంగారెడ్డి జిల్లా, పఠాన్ చెరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు, గూడెం మధుసూదన్ రెడ్డి తన అన్న అధికారం అడ్డుపెట్టుకొని అక్రమ మైనింగ్ తవ్వకాలు చేపట్టి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విషయం విదితమే.. గత రెండు రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గూడెం మహిపాల్ రెడ్డి, ఇతగాడి తమ్ముడి ఇండ్లతో పాటు పలుచోట్ల సోదాలు చేసి 300 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడటమే కాక 39 కోట్ల రూపాయల రాయల్టీ ఎగ్గొట్టారని బట్ట బయలు చేసిన విషయం తెలిసిందే.. తీగ లాగితే డొంక కదిలినట్టు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీ పేరుతో అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చక్రపురి కాలని లే అవుట్ లో చక్రం తిప్పి వందల కోట్ల విలువైన ఖాళీ స్థలాలను అధికారులు అండతో కాజేశారు..
ఇందులో ఎలాంటి సందేహం లేదు.. గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధు సుదన్ రెడ్డి చక్రపురి కాలనీ లో ఉన్నటువంటి 200 ఫీట్ రోడ్డును కబ్జా చేయుటకు ఫ్రీ కాస్ట్ వాల్స్ గతంలో వేయడంతో, గత మున్సిపల్ కమిషనర్ సుజాత అక్రమం అని గుర్తించి వాటిని పూర్తిగా తొలగించింది.. సదరు భూమిపై కన్నేసిన గూడెం బ్రదర్స్ పథకం ప్రకారం స్కెచ్ చేసి అట్టి స్థలాన్ని కాజేయుట కొరకు మొనోత్ ప్రైవేట్ ట్రస్ట్ పేరుతో ఉన్న మేనేజింగ్ ట్రస్ట్ మహావీర్ జైన్ అనే వ్యక్తి ఆరు రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని తేదీ 4 అక్టోబర్ 2021లో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేశారు.. ఆ తరువాత వారి అధికారాన్ని చూసి లొంగిపోయిన స్థానిక సీఐ యు. శ్రీనివాసులు రెడ్డి డాక్యుమెంట్లు పోయాయని 19 అక్టోబర్ 2021 రోజు నిర్ధారణ చేసి, సర్టిఫికెట్ జారీ చేయడం ప్రశ్నార్థకంగా మారింది.. చక్రపూరి కాలనీ లేఅవుట్ హుడా అనుమతి పొందిన లే అవుట్.. ఇందులో రోడ్లు, పార్కులు, పాఠశాలల కోసం లేఔట్ లో చూపిన విధంగా ఉన్న ఖాళీ స్థలాలు ప్రభుత్వ అధికారుల ఆధీనంలో ఉండాలి.. గత అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత లోపాయికారీ ఒప్పందంతో సదరు లేఔట్ కు సంబంధించి పార్కులు, రోడ్లు, ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నయో అని గుర్తించి లెటర్ నెంబర్ 713/టిపీఎస్ / ఏ ఎం పీ ఆర్ / 2022. గల లేఖ తేది 13-07-2022 రోజున సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టార్ కు సర్వేనెంబర్ 126,127 అండ్ పార్ట్ ఆఫ్ సర్వే నెంబర్ 128 నుండి 130 వరకు, 135,136,137,152,153 లలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దని లేఖ ద్వారా తెలుపడం జరిగింది.. సదరు లే అవుట్ లో వందల గజాల్లో ఉండాల్సిన ప్లాట్ల కి బదులుగా బై ఏ అని వేసి, నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నెంబర్ కు బై నెంబర్ క్రియేట్ చేసి, వేల గజాల్లో ప్లాట్లు ఉన్నట్లు బోగస్ డాక్యుమెంట్లు సృష్టించి, దొడ్డి దారిన సంతోష్ సాండ్ గ్రానైట్ సప్లై కంపెనీ యజమాని గూడెం మధుసూదన్ రెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు..
వందల గజాల్లో ఉండే ప్లాట్లు వేల గజాల్లో రిజిస్ట్రేషన్ ఎలా సాధ్యమైంది అని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు… నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయడం, ఆరు ఒరిజినల్ డాక్యుమెంట్లు పోయాయని బన్వర్ లాల్ జైన్ పోలీస్ స్టేషన్ లో సర్టిఫికెట్ పొందడంలో సీఐ శ్రీనివాసులు రెడ్డి పాత్ర పై, గత అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ కొత్తగా తానేదో ఖాళీ స్థలాలను గుర్తించినట్టు సంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాయడం అంతా తెలిసే చేసినట్లు తేట తెల్లమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.. చక్రపూరి కాలనీ లే ఔట్ లో చేస్తున్న అక్రమ వ్యవహారాలపై ఈడి విచారణ జరిపితే వందల కోట్ల రూపాయల ఆస్తులు, ప్రభుత్వ ఆధీనంలో ఉండే అవకాశం ఉందని.. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ ఏర్పడుతుందని స్థానిక ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. బన్వర్లాల్ జైన్ మేనేజింగ్ ట్రస్ట్ ఎలా అయ్యాడు.. హుడా లేఔట్ చేసి 40 సంవత్సరాల అయితే ఆయన దానికి నేడు యజమానిగా ఎలా అవతారమెత్తాడు.. నిజంగా చక్రపురి కాలనీ లేఅవుట్ కు యజమాని అవుతాడా..? ఏ చట్టప్రకారం అవుతాడు.. ఎంత భూమిని కొల్లగొట్టారు..? అన్న విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తెనుంది ‘ అదాబ్ హైదారాబాద్ ‘.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..