Monday, November 25, 2024
spot_img

అఫిషీయల్‌గా నోటీసులు.. అనఫీషియల్‌గా నోట్ల వసూల్‌..!

Must Read
  • ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ అధికారుల చేతివాటం
  • గ్రామకంఠం భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
  • తొలుత అక్రమంగా మూడు ప్లోర్ల బిల్డింగ్‌కు ప్లాన్‌
  • నోటీసులు ఇచ్చి బెదిరించిన అధికారులు
  • అనంతరం యజమానితో లోపాయికారి ఒప్పందం
  • తాజాగా ఆనుకోని మరో అక్రమ బిల్డింగ్‌ నిర్మాణం
  • ప్రేక్షకపాత్రలో కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు
  • లక్షల్లో డబ్బులు వసూలు.. ఇష్యూ సైలెంట్‌..!
  • అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలేన్నడు..?

రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు ఎక్కడ్నైనా సర్కారు భూమిలో గుడిసెలు వేసుకుంటే బతుకు ఈడుస్తుంటే అధికారుల కంటపడితే చాలు వెంటనే వచ్చి కూల్చివేసి వారిని రోడ్డున పడేస్తారు. కానీ డబ్బు, రాజకీయ బలం ఉన్న వారు బహుళ అంతస్థులు కట్టిన ఎవరికీ కనిపించవు. ‘వెనుకంగా ఏనుగులు పోయిన ఏం కాదుగానీ.. ముందుగా చీమలు పోనియ్యడు’ అన్న చందంగా అసైండ్‌ ల్యాండ్స్‌, చెరువులు, కుంటలు, గుట్టలు, పుట్టలు కబ్జా చేసి ఎకరాల్లో దర్జాగా ఇళ్లు, ఫాం హౌస్‌ లు కట్టుకున్న పర్లేదు. అప్పుడు వాళ్లకు ఏ రూల్స్‌ వర్తించవు. సర్కారు జీతం చేసే ఉద్యోగులు లక్షల్లో జీతాలు తీసుకుంటారు గానీ ఒక్కరన్న న్యాయంగా పనిచేసిటోడు కానరాడు.. ఆకలి అయితే అన్నం కాదు అధికారులు తినేది డబ్బుల కట్టలే.. కోట్లాను కోట్లు కూడగట్టుకునే ప్రభుత్వ ఆఫీసర్లు సామాన్య ప్రజలంటే అయ్యో పాపం అనరు. కానీ ఖద్దరు చొక్కా వేసుకున్న ఎవరైనా వస్తే లేచి నిలబడి నమస్తే పెట్టేస్తరు. డబ్బులు దండుకొని వాళ్లకు కావాల్సిన పని ఇట్టే చేసిపెడతారు. ఒక్క డిపార్ట్‌మెంట్‌ అని చెప్పడం కాదు గానీ దాదాపు గవర్నమెంట్‌లోని అన్ని శాఖల్లో అవినీతి అధికారులు ఎవరో ఒకరు ఉంటారు.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, ఫిర్జాదీగూడ గ్రామం మరియు మండలం. మున్సిపాలిటీ పరిధిలోని 6వార్డులోని సర్వేనెం. 199 గ్రామ కంఠం భూమి.. గవర్నమెంట్‌ ల్యాండ్‌ కానీ ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. పట్టా భూమి కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద బిల్డింగ్‌ కడుతున్నా అతనికి మున్సిపల్‌ అధికారులు అండగా నిలిచారు. ‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చొన్న తునకలు బాగానే పడతాయి’ అన్నట్టుగా డబ్బుకు అమ్ముడు పోయిన అవినీతి తిమింగలాల సహకారంతో దర్జాగా రెండు బిల్డింగ్‌ లు నిర్మాణం చేపట్టాడు. తొలుత మూడంస్థులతో ఓ భవనం కడుతుండగా అదీ తెలుసుకొని అక్కడకు వెళ్లిన మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు యజమానికి నోటీసులు ఇచ్చి.. బెదిరింపులకు గురిచేశారు. అనంతరం అతడితో లోపాయికారి ఒప్పందం కుదుర్చొని లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తద్వారా బిల్డింగ్‌ నిర్మాణానికి ఎవరూ అడ్డుచెప్పలేదు. అధికారుల అండదండలతో హాయిగా పనికానిచ్చాడు. దానికి ఆఫర్‌గా మరో బిల్డింగ్‌కు ప్లాన్‌ వేసాడు. ‘కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు’ అన్న చందంగా గవర్నమెంట్‌ అధికారుల సపోర్ట్‌తో కొత్త నిర్మాణం చేపట్టాడు. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు’ ఫిర్జాదీగూడ మున్సిపల్‌ అధికారులకు మాముళ్లు ఇచ్చుకొని ఆగమాగంగా పనులు చేయిస్తున్నాడు.

‘చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి………’ అన్నట్టు ప్రభుత్వ పాలకులు, అధికారులు చెప్పే మాటలకు చేతలకు పొంతన ఉండదు. గ్రామకంఠం భూమిలో ఎలాంటి అనుమతులు లేకున్నా రెండు బిల్డింగ్‌ లు నిర్మాణం చేపడుతున్న ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా ఉండడం గమనార్హం. సదరు యజమాని వద్ద నుంచి లక్షలు లక్షలు వసూలు చేసి అంతర్గత ఒప్పందం ద్వారా నిర్మాణం సజావుగా చేపట్టేందుకు ఫిర్జాదీగూడ మున్సిపల్‌ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. అఫిషీయల్‌గా నోటీసులు ఇచ్చి.. అన్‌ అఫిషీయల్‌గా పైసల్‌ వసూల్‌ చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌ సిటీ, ఉప్పల్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉండే ఫిర్జాదీగూడలో భూమి విలువ కోట్ల రూపాయాలు పలుకుతుంది. అలాంటి గ్రామ కంఠం భూమిలో అక్రమంగా రెండు పెద్ద బిల్డింగ్‌ లు కడుతున్న అడ్డుచెప్పని అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై వివరణ కొరకు మున్సిపల్‌ అధికారులకు సంప్రదించగా.. వారు స్పందించకపోవడం శోచనీయం. కాగా, మున్సిపల్‌ కమిషనర్‌ చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోని పక్షాన కమిషనర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.

Latest News

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS