- అక్రమంగా మూసీ నీళ్లు తరలిస్తున్ పరిశ్రమ
- యాదాద్రి జిల్లాలో మరో పైప్ లైన్ నిర్మాణం
- జాలుకాల్వ నుండి పలు గ్రామాల మీదుగా పైపులైన్
- గ్రామస్థుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం
- పైప్ లైన్ నిలిపివేసి, గ్రామసభ తీర్మానం తీసుకోవాలని డిమాండ్
- ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుండి సైతం లేని పర్మిషన్
ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబోరేటరీస్ నిర్ణయాలు ప్రజలకు హానికలిగించేలా ఉంటున్నాయి. ఎన్ని తాకుడులు తలిగిన దివీస్ యాజమాన్యానికి మాత్రం బుద్ధిరావడం లేదు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ గా దివీస్ ల్యాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తీరు ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా అంకిరెడ్డిగూడెం పరిధిలోని దివీస్ మెడిసిన్ పరిశ్రమ ఆ గ్రామస్థులకు శాపంగా మారింది. అసలుకే ఆ కంపెనీ వల్ల సర్వ రోగాలు వస్తున్నాయని, నీళ్లు, గాలి అన్ని కలుషితమై బతుకు భారంగా గ్రామస్థులు బతుకుతున్నారు. ప్రజలు అనారోగ్యం బారినపడేందుకు కారణమైన, కొందరి ఆరోగ్యాలను బాగుచేసేందుకు మందులు తయారు చేసే దివీస్ కంపెనీ పాపం అందమా అంటే మనసు రావడం లేదు. ప్రభుత్వ పెద్దల అండ, ఉన్నతాధికారుల సపోర్టుతో దివీస్ కంపెనీ బరితెగిస్తోంది. ఎవరూ ఏమన్నా గానీ తన పని తాను గుట్టుగా చేసుకొని పోతోంది. అంకిరెడ్డిగూడెం, లింగోటం గ్రామపంచాయతీ మీదుగా వెళ్లే పైప్ లైన్ కోసం ఆయా గ్రామ పంచాయతీల నుండి ఎలాంటి అనుమతులు లేవు. గ్రామసభ పెట్టి తీర్మానం కూడా తీసుకోకుండా దివీస్ కంపెనీ పైప్ లైన్ ద్వారా మూసీ నీళ్లను తరలించడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
మూసీ నీళ్లతో మెడిసిన్ తయారీ.? :
మెడిసిన్ తయారు చేసే దివీస్ కంపెనీ అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం శోచనీయం. యాదాద్రి భువనగిరి జిల్లా అంకిరెడ్డిగూడెం గ్రామపరిధిలోని దివీస్ ఫార్మా సంస్థ వివిధ అవసరాల కోసం మూసీ నీళ్లను తరలించుకుపోవడం విడ్డూరంగా ఉంది. ‘కొండ నాలుకకు మందెస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా దివీస్ కంపెనీ నీళ్లు గతిలేవని మూసీ నీళ్లను దొంగచాటుగా ఎత్తుకెళ్లడం దారుణం. హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వేస్ట్ (డ్రైనేజీ) వాటర్ ను కంపెనీ అల్రెడీ ఓ పైప్ లైన్ ద్వారా తీసుకెళ్తుండగా తాజాగా దివీస్ ఫార్మా కంపెనీ మురుగు నీటిని తరలించుకునేందుకు మరో పైప్ లైన్ నిర్మాణం చేపడుతోంది. అయితే ఈ నీటి ద్వారా మెడిసిన్ తయారీకి ఉపయోగించుకుంటారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో వాడిన మురుగు నీరే కాకుండా వివిధ కంపెనీల నుంచి విడుదలైన వ్యర్థాలు, విషపు నీళ్లు మూసీలో కలువడం జరుగుతుంది. సిటీ పరిసర ప్రాంతాల్లో మూసీ ద్వారా పండించే పంటలు, కూరగాయలను ప్రజలు వాడొద్దంటూ వైద్యులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. రోగం వచ్చిందని డాక్టర్ దగ్గరకు వెళ్తే దాన్ని తగ్గించేందుకు మందులు రాయడంతో.. ఆ మెడిసిన్ తయారు చేసే ఫార్మా కంపెనీ ఈ మూసీ నీళ్లను శుద్ధిచేసి మందుల తయారీకి వాడడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరిగేషన్ నుంచి పర్మిషన్ లేకుండానే మూసీ నీళ్ల తరలింపు :
యాదాద్రి భువనగిరి జిల్లా అంకిరెడ్డిగూడెం పరిధిలోని దివీస్ ఫార్మా కంపెనీ వాడకం కోసం అనధికారికంగా రెండో పైప్ లైన్ వేసుకొని మూసీ నీళ్లను తరలించడంపై స్థానికులు ఆగ్రహాంతో ఉన్నారు. జాలుకాల్వ గ్రామం నుండి పలు గ్రామాల మీదుగా అంకిరెడ్డిగూడెంలోని దివీస్ పరిశ్రమ వరకు పైపులైన్ నిర్మాణం చేపట్టడంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మూసీ నీళ్లు తరలించేందుకు కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం గమనార్హం. జిల్లా పంచాయత్ రాజ్ ఇంజనీర్ కార్యాలయం నుండి కేవలం పైప్‌లైన్ వేసుకోడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి.. ఈ అనుమతులు కూడా జిల్లా పంచాయత్ రాజ్ అధికారి భారీ ఎత్తున ముడుపులు తీసుకొని నిబంధనలకు విరూద్దంగా ఇచ్చినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
దివీస్ పరిశ్రమ యాజమాన్యం ఎన్ హెచ్ 65 హైవే రోడ్డుపై జాలుకాల్వ నుండి మరొక పైప్ లైన్ ను గ్రామానికి వచ్చే రోడ్డుకు ఇరువైపులా వేయడం వలన గ్రామంలోని మురికి నీరుని మారమ్మ గుడి వద్ద నుండి బండ్రివాగు వరకు డ్రైనేజీ ఏర్పాటుకు గతంలో గ్రామ సభలో తీర్మానించడం జరిగింది.
కానీ ఇప్పుడు మరో పైప్ లైన్ కు నిర్మాణం చేపడుతున్న దివీస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ పైప్ లైన్ వేయడం వలన గ్రామ ప్రజలకు డ్రైనేజ్, గ్రామం నుండి రోడ్డు వద్ద కాలనీకి వాటర్ పైప్ లైన్ కు ఏర్పాటుకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు.
ప్రజా ఆరోగ్యం కోసం తోడ్పాల్సిన దివీస్ ఫార్మా సంస్థ మూసీ డ్రైనేజీ నీళ్లను కంపెనీ అవసరాల కోసం రెండు పైప్ లైన్లు ద్వారా తీసుకెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు మురుగు నీటితో పండించిన కూరగాయలను వాడొద్దంటూ డాక్టర్లు హెచ్చరిస్తుంటే మరోవైపు అదే నీటినీ మెడిసిన్ కంపెనీ అవసరాలకు వాడుకోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. దీనిపైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు విచారణ జరిపి దివీస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.