- రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ
- ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
- ఆయాజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
- గడిచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీగా నమోదైన వర్షపాతం
తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఒడిశా-ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఆదిలాబాద్,ఆసిఫాబాద్,మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల,రాజన్నసిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి,ములుగు,కొత్తగూడెం,ఖమ్మం,హన్మకొండ, జనగాం,సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి,హైదరాబాద్,మేడ్చల్ మల్కాజ్‌గిరి,వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.రానున్న 12గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది.ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.మరోవైపు గడిచిన 24గంటల్లో తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాపాతం నమోదైంది.నిజామాబాద్,నిర్మల్,జగిత్యాల,హన్మకొండ,ములుగు,ఆదిలాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాపాతం నమోదైంది.మరికొన్ని జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది.నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. వెంపల్లెలో 18.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.ముప్కల్‌లో 12.5,అలూర్‌లో 15,నవీపేటలో 11.8,రేంజల్‌లో 11.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.నిర్మల్ జిల్లా మామడలో 13.8,ఖానాపూర్‌లో 11.9,ములుగ జిల్లా మల్లంపల్లిలో 12.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.
భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి ఉద్ధృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద చేరుతోంది.ఇప్పటికే నీటిమట్టం 41.30 అడుగులకు చేరుకుంది.నీటిమట్టం 43 అడుగులు దాటితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు.48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.ప్రస్తుతం ఎగువన కురిసే భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.