అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి తలలోకి మాంత్రికుడు 70 సూదులను గుచ్చిన అమానవీయ ఘటన ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుర్లాలోని వింసార్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తండ్రి బిష్ణు బెహరా.. తేజ్ రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. వైద్యం పేరిట ఆయన పలు దఫాలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు వింసార్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై సూదులు ఉన్నట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటికి తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారని వింసార్ కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రబినారాయణ్ గురు తెలిపారు. పోలీసులు మాంత్రికుడు తేజ్ రాజ్ ను అరెస్టు చేశారు.