Friday, November 22, 2024
spot_img

బీబీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డబుల్ రిజిస్ట్రేషన్ దందా

Must Read

అమాయక ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న‌ ఇంటూరి వెంక‌ట‌ప్ప‌య్య‌, ప్ర‌శాంత్ రెడ్డి,బ‌డేసాబ్‌,బొమ్మ వెంక‌టేశ్‌,డాక్యుమెంట్ రైట‌ర్‌ చిన్న

  • లే అవుట్‌లో లేని బై నెంబ‌ర్ వేసి రిజిస్ట్రేష‌న్ చేస్తున్న ఎస్ఆర్ఓ
  • త‌ప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితులు
  • ఎస్ఆర్ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే న్యాయం జరుగుతుందో లేదో తెలియదు కానీ, కొన్ని ఆఫీసులకు పోతే అన్యాయం కూడా జరుగుతుందనీ ఈ వార్త చదివితే మీకే అర్థమవుతుంది. ‘రోజులు మంచివని పగటి పూటే దొంగతనానికి బయలుదేరాడట’ అన్నట్టు అధికారులు దర్జాగా గవర్నమెంట్ ఆఫీసుల్లోనే దందా చేస్తున్నారు. కొందరి వద్ద లక్షలాది రూపాయలు మాముళ్లు తీసుకుంటూ అమాయకుల భూమిని లాక్కొని కబ్జాకోరులకు అప్పనంగా అప్పగించేస్తున్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏ మారుమూల గ్రామాన చూసిన ల్యాండ్ వ్యాల్యూ ఫుల్ గా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది భూములను తమ వశం చేసుకునేందుకు బయలుదేరారు. ఎక్కడైతే గత ప్రభుత్వాలు పేదలకు భూములు పంపిణీ చేసిందో, ఇతరత్రా లూపు లైన్లు ఉన్న వాటినీ ఎంచుకొని వాటికి ఎర వేస్తున్నారు. వీళ్లకు అవినీతి అధికారులు అంటకాగడం మూలంగా పలువురికి తీరని అన్యాయం జరుగుతుందనేది జగమెరిగిన సత్యం.

‘ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు’ అన్నట్టు సర్కారు ఆఫీసుకు వెళ్లేవాడి పరిస్థితి కూడా అలానే ఉంటుంది. వివరాల్లోకి వెళితే… యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో పలువురు ఫాట్ల ఓన‌ర్ల‌కు తీరని అన్యాయం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీబీన‌గ‌ర్ మండ‌లం, నెమరుగోముల గ్రామం స‌ర్వే నెంబ‌ర్ 154, 155, 157లో ప‌ట్ట‌దారు ఒంగూరు బాల‌య్య, ఒంగూరు పెంట‌య్య, కిష‌న్ సేట్ నుండి సుమారు 8 ఎక‌రాల భూమిని అప్పట్లో కోనుగోలు చేశారు. అదేవిధంగా గ‌డ్డం న‌ర్సింహా, ఒంగూరు బిక్ష‌ప‌తి లు కూడా కిష‌న్ సేట్ నుండి సుమారు 8 ఎక‌రాలు భూమి కొనుగోలు చేయడం జరిగింది. ఇది ప‌హానీల‌లో, రెవెన్యూ రికార్డుల‌లో స్ప‌ష్టంగా న‌మోదు కావ‌డం జ‌రిగింది. అంటే మొత్తం 16 ఎక‌రాల భూమి. ఈ నలుగురు క‌ల‌సి ఆ భూమిని (డాక్యుమెంట్ నెం 154/1984, 206/1984) స‌య్య‌ద్ హెజాజ్ ఉస్సెన్‌, స‌య్య‌ద్ ఉజ్జ‌త్ ఉస్సెన్‌, స‌య్య‌ద్ ఇలాయ‌త్ ఉస్సెన్‌, స‌య్య‌ద్ ఫిరాస‌త్ ఉస్సెన్‌, స‌య్య‌ద్ ఇర్ఫాన్ ల‌కు అమ్మ‌కున్నారు. అయితే ఈ ఐదుగురు వ్య‌క్తులు కాజాపాషా పేరున 16 ఎక‌రాల భూమిని జీపీఏ (74/1989) చేశారు. ఇదీలా ఉండగా కాజాపాషా 1989లో స‌ర్వే నెంబ‌ర్ 154, 155, 157లో సాయిబాబా న‌గ‌ర్ అనే పేరుతో 286 ఫాట్ల‌తో వెంచ‌ర్ ఏర్పాటు చేశారు. ఆ వెంచ‌ర్‌కు నెమరుగోముల గ్రామ‌ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి గ‌డ్డం మ‌ల్ల‌య్య ఈ లేవుట్ కు అనుమ‌తులు కూడా ఇచ్చారు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. వారి పేరున ఉన్న భూమిని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కేంద్రంగా మోసం జరగడం కొసమెరుపు.

అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ :

‘కంచిలో చేయబోయే దొంగతనానికి కాళహస్తి నుంచే వంగి నడిచినట్లు’ వీళ్లందరూ కలిసి భూమాయ చేయబోయి అడ్డంగా దొరికిపోయారు. ఎస్ఆర్ఓ… పైసలు దండుకుని లే అవుట్‌లో లేని బై నెంబ‌ర్ వేసి రిజిస్ట్రేష‌న్ చేశాడు. పైసలకు కక్కుర్తిపడే అధికారులు కొందరూ తమ బుద్ధిని చాటుకుంటున్నారు. ఇదే తరహాలోనే బీబీనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ అధికారి అమాయకులను నట్టేట ముంచాడు. మాముళ్ల కోసం ఆశపడిన అధికారి పట్టాదారులను కాదని పరాయివాళ్లకు పట్టా చేసి ఇయ్యడం అంటే మాములు విషయం కాదు. ఇందులో భాగంగా ఇంటూరి వెంక‌ట‌ప్ప‌య్య‌, ప్ర‌శాంత్ రెడ్డి, బ‌డేసాబ్‌, బొమ్మ వెంక‌టేశ్‌, డాక్యుమెంట్ రైట‌ర్‌ చిన్న(బీబీన‌గ‌ర్‌) లు కుట్ర పన్ని 286 ఫాట్ల‌లో బైనెంబ‌ర్లు వేసి అమాయ‌క ప్ర‌జ‌ల‌కు అమ్మ‌డం ప్రారంభించారు. దీనికి బీబీన‌గ‌ర్ ఎస్ఆర్ఓ పూర్తిగా స‌హ‌క‌రించ‌డం శోచ‌నీయం.

బీబీ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన కొన్ని మచ్చుతునకలు ఉదాహరణలు మీకు వివరిస్తున్నాం. సాయిబాబా న‌గ‌ర్‌లో లేఅవుట్ అనుమ‌తుల ప్ర‌కారం మొత్తం వెంచ‌ర్‌లో ఎక్క‌డ‌కూడా బై నెంబ‌ర్‌ల‌తో పాట్ల‌ను అమ్మ‌డం జ‌రుగ‌లేదు.. కానీ ఈ మోస‌గాళ్లు బై నెంబ‌ర్ల పేరుతో అమాయకుల భూములను ఏ విధంగా కొట్టేశారో ఇవీ చూస్తే క్లీయర్ గా అర్థమవుతోంది. అవేంటో ఈ క్రింద క్లుప్తంగా రాయడం జరుగుతుంది. సేల్ డీడ్, డాక్యుమెంట్ల నెంబర్లుతో ప్లాట్ నెంబర్లను అధికారికంగా ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యాయో కూడా వివరంగా చూద్దాం..

  1. సేల్ డీడ్‌నెం. 616/1993, ప్లాట్ నెం. 268, య‌మ‌ల గ‌ణేశ్
  2. డాక్యుమెంట్ నెం. 619/1993, ప్లాట్ నెం. 267, డి. ఉమామ‌హేశ్వ‌రి
  3. డాక్యుమెంట్ నెం. 1841/1993, ప్లాట్ నెం. 266, చిన్న‌గుంట స‌ర‌స్వ‌తి
  4. డాక్యుమెంట్ నెం. 1843/1993, ప్లాట్ నెం. 264, పి. ప‌ద్మ
  5. డాక్యుమెంట్ నెం. 1844/1993, ప్లాట్ నెం. 270, పి. శివ‌కుమార్
  6. డాక్యుమెంట్ నెం. 1842/1993, ప్లాట్ నెం. 269, పి. శివ‌కుమార్
  7. డాక్యుమెంట్ నెం. 2011/1994, ప్లాట్ నెం. 271, మ‌హ‌వీర్ ప్ర‌సాద్

ఈ ఎనిమిది మంది పేర్లపైన ఉన్న ప్లాట్స్ ను అక్రమార్కులు బై నెంబ‌ర్‌లు వేయించి డ‌బుల్ రిజిస్ట్రేషన్ చేశారు. అంతేకాకుండా, శ్రీరామ్ సిటీ యూనియ‌న్ ఫైనాన్స్ లిమిటెడ్‌, నాగోలు హైద‌రాబాద్‌లో డాక్యుమెంట్ నెం. 4168/2014న 268/1, 267/1, 266/1, 264/1, 270/1, 269/1, 271/1 ఫాట్లు మార్టిగేష‌న్ చేయ‌డం జ‌రిగింది. అలాగే శ్రీరామ్ సిటీ యూనియ‌న్ ఫైనాన్స్ లిమిటెడ్‌, హ‌బ్సిగూడ‌ హైద‌రాబాద్‌లో డాక్యుమెంట్ నెం. 193/2020న మ‌ళ్లీ ఈ 7 ఫాట్లు మార్టిగేష‌న్ చేశారు.

మార్టిగేష‌న్ రీలీజ్ చేసి, అనంత‌రం సదరు భూములను అమ్మ‌కాలు చేస్తున్నారు. ఈ ర‌కంగా మోసాల‌కు పాల్ప‌డుతున్నట్టు క్లీయర్ గా అర్థమవుతోంది. కాగా తమకు జరిగిన మోసాల‌పై బాధితులు బీబీన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌ లో, రాచ‌కొండ క‌మీష‌న‌ర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అన్యాయంగా తమ భూములను డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పేరిట ఉన్న ఇట్టి భూములను అక్రమ మార్గంలో వేరే వారికి అమ్ముతున్నట్లు వివరించారు. ఇందుకు బీబీనగర్ ఎస్ఆర్ఓ పూర్తిగా సహకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ అధికారి ఆధ్వర్యంలోనే తమ ప్లాట్స్ ను అక్రమార్కులు కాజేశారని తద్వారా ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారని వాపోతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీన‌గ‌ర్ మండ‌లం, నెమరుగోముల గ్రామంలో అట్టి సర్వే నెంబర్ లో ఉన్న తమ ప్లాట్స్ ను తమకు తిరిగి వచ్చేలా చూడాలని, తమను మోసం చేసిన ఎస్ఆర్ఓ, మిగతా నలుగురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ న‌లుగురు క‌లిసి చేసిన అక్ర‌మాల‌పై మ‌రో క‌థ‌నం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైద‌రాబాద్‌.. మా అక్ష‌రం .. అవినీతిపై అస్త్రం..

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS