Friday, September 20, 2024
spot_img

అధికారుల అండతో సు’రభీ” గేమ్

Must Read
  • ఎంపీడీవో,తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా యధేచ్చగా కట్టడాలు
  • సురభి హెవెన్ లో 111 జీవోకు విరుద్ధంగా బహుళ అంతస్తులు
  • విధులను పక్కనపెట్టి నాయకులతో అంటకాగుతున్న అధికారులు
  • అంతా మా ఇష్టం అంటున్న వైనం
  • ప్రభుత్వ పెద్దలు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాల్సిన గవర్నమెంట్ అధికారులు అక్రమార్కులకు అంటగడుతున్నారు. ‘ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు’ అన్నట్టుగా భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు చేసివారికి ఆఫీసర్లు అండగా నిలబడడం సిగ్గుచేటు. లక్షకు పైగా జీతాలు తీసుకునే సర్కారు ఉద్యోగులు కనీసం గవర్నమెంట్ నిబంధనలు పాటించకుంటే ఎలా అని మేథావులు ప్రశ్నిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.

ఇటీవల ప్రభుత్వం మారినప్పటికి ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ అవుతుండడం చూస్తే ప్రభుత్వాలు, పాలకులు మారిన అధికారుల తీరు మారడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. రాజకీయ ఒత్తిడిలకు, పైసలకు కక్కుర్తి పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న గవర్నమెంట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని వాదన వినిపిస్తోంది.

‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్ మండలంలో 111 జీవోకు విరుద్ధంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 111 జీవో అమలులో ఉన్నప్పటికీ అనతికాలంలోనే వెలసిన వందల కొద్దీ ఫాం హౌస్ లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిలువుటద్ధంగా నిలుస్తున్నాయి.

జీవో 111 కు రక్షణగా ఉండాల్సింది పోయి అధికారులు తమ విధులను మరిచి “కంచే చేను మేసింది” అన్న నానుడిని నిజం చేస్తున్నారు. దీనిపై రైతులు, మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న సురభి వెంచర్ కు ఆనుకుని ఉన్న ఓ ఎకరా ప్రభుత్వ భూమిని సదరు వెంచర్ పార్కు పేరుతో కబ్జాకు విఫలయత్నం చేయగా విషయం తెలుసుకున్న ఆదాబ్ హైదరాబాద్ రంగంలోకి దిగి కాపాడింది. “ప్రభుత్వ భూమి కబ్జా” శీర్షికతో ఆదాబ్ లో కథనం ప్రచురించడంతో అక్రమార్కులు వెంటనే వెనక్కి తగ్గారు.

‘కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు’ అవినీతికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోకనే అనేక మంది పుట్టకొస్తున్నరని ప్రజలు అభిప్రాయపడుతున్నరు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు, అక్రమార్కులతో అంటకాగుతూ అందినకాడికి దండుకుంటూ డీ ఎల్ పీ ఓ కి వాటా చేరవేస్తున్నందుకే అక్రమ నిర్మాణాలు ఇంత బాహాటంగా కొనసాగుతున్నాయన్న వార్తలూ మండలంలో గుప్పుమంటున్నవి. రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ లో మండల కార్యాలయానికి ఎదురుగా చిలుకూరు, సురంగల్ గ్రామ రెవిన్యూలో, సురభి హెవెన్ వెంచర్ లో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలు యధేచ్చగా సాగుతున్నాయి. బీజాపూర్ రహదారిని ఆనుకుని సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సురభి హెవెన్ వెంచర్ లో హైటెక్ సిటీలో మాదిరి బహుళ అంతస్తులు అపార్ట్మెంట్ లు నిర్మిస్తున్నారు. వచ్చిన కంప్లైంట్ లకు కంటి తుడుపు చర్యగా ఒకటి రెండు నోటీసులిచ్చిన అధికారులు మంతనాల అనంతరం అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతుండడం గమనార్హం. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండడంతో మండల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా పంచాయతీ రాజ్ అధికారి 111 జీవో కు విరుద్ధంగా నిర్మాణం చేసినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని ప్రగల్భాలు పలికే వరకే కనిపించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు చేపట్టకుండా నిర్మాణదారులతో అనైతిక ఒప్పందంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

పంచాయతీ రాజ్ అధికారులు చేస్తున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా, సర్కారు భూములు, ఆస్తులను కాపాడాల్సిన అవసరం పాలకులకు, ఉన్నతాధికారులకు ఎంతైనా ఉన్నదని మేధావులు సూచిస్తున్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This